ఇంటర్వ్యూ : హరీష్ శంకర్ – బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి ఎన్.టి.ఆర్

ఇంటర్వ్యూ : హరీష్ శంకర్ – బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి ఎన్.టి.ఆర్

Published on Oct 9, 2013 5:16 PM IST

harish-shankar

డైరెక్టర్ హరీష్ శంకర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి ట్రాక్ రికార్డ్ సంపాదించుకున్నాడు. తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా అప్పటి వరకూ బాక్స్ ఆఫీసు వద్ద అంత బాగోలేని పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డ్ ని బద్దలు కొట్టింది. దాంతో హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కి డార్లింగ్ అయిపోయాడు. ప్రస్తుతం తను ఎన్.టి.ఆర్ తో చేసిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యాన్స్ కి ఎన్.టి.ఆర్ ని చాలా స్టైలిష్ గా చూపించడంతో మరోసారి రిలీజ్ కి ముందే సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హరీష్ శంకర్ తో కాసేపు ముచ్చటించాము. ఆ విశేషాలు మీ కోసం

ప్రశ్న) ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రామయ్యా వస్తావయ్యా రిలీజ్ కి ఇది సరైన సమయం అంటారా?

స) నేను ఒక దర్శకుడిని, నా జాబ్ ఏంటంటే సినిమాకి సంబందించిన 24 విభాగాల్లో కేర్ తీసుకోవాలి, అలాగే అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్ లో సినిమా తియ్యాలి. నేను ఆ పని పూర్తి చేసేసాను. దిల్ రాజు గారు సీనియర్ నిర్మాత, అలాగే ఆయనకి సినిమా ఎప్పుడు రిలీజ్ చెయ్యాలనేది తెలుసు. కావున ఈ ప్రశ్న మీరు ఆయన్ని అడిగితే బాగుంటుంది.

ప్రశ్న) మీరు సెంటిమెంట్స్ ని నమ్ముతారా?

స) లేదండి నేను నమ్మను. నేను ఎప్పుడు హార్డ్ వర్క్ నే నమ్ముతాను. నేను అలా సెంటిమెంట్స్ నమ్మే వాన్నే అయితే ‘గబ్బర్ సింగ్’ లో శృతి హాసన్ హీరోయిన్ అయ్యుండేది కాదు.

ప్రశ్న) ఈ సినిమాలో మీరు ఎన్.టి.ఆర్ ని ఎలా చూపించబోతున్నారు?

స) నాకు ఎన్.టి.ఆర్ చేసిన ‘ఆది’, ‘సింహాద్రి’ సినిమాలంటే భలే ఇష్టం. గత కొంత కాలంగా ఆయన్ని అంత పవర్ఫుల్ పాత్రల్లో చూడటం లేదు. అలాగే ఆయన్ని సరికొత్తగా చూపించడానికి కూడా ప్రయత్నం చేసాను. మాములుగా ఆఫ్ స్క్రీన్ పరంగా ఎన్.టి.ఆర్ బాగా సెన్స్ అఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. నేను దానిలో కొంత భాగాన్ని ఆయన పాత్రలో చూపించడానికి ప్రయత్నం చేసాను. ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ పాత్ర పోషించాడు కానీ క్లాస్ రూంలో ఉండే సీన్స్ ఏమీ ఉండవు. నేను ఎన్.టి.ఆర్ ని బాగా యూత్ ఫుల్ లుక్ లో చూపించాలనుకున్నాను.

ప్రశ్న) అతిధి పాత్రలో చేయడానికి శృతిని ఎలా ఒప్పించగలిగారు?

స) మాములుగా స్టార్ హీరోయిన్స్ బాగా బిజీగా ఉండడం వల్ల అతిధి పాత్రలు చెయ్యరు. కానీ ‘గబ్బర్ సింగ్’ వల్ల ఉన్న మంచి రిలేషన్ ఉండడం వల్ల శృతికి నేను తన పాత్ర గురించి చెప్పకముందే ఓకే చెప్పింది. తన పాత్ర గురించి విన్న తర్వాత తను బాగా ఆనంద పడడమే కాకుండా డేట్స్ కూడా ఎక్కువగానే ఇచ్చింది. సినిమాలో శృతి హాసన్ సెకండ్ హీరోయిన్ కాదు ఆమెది ఒక అతిధి పాత్ర మాత్రమే..

ప్రశ్న) సినిమాలో సమంత పాత్ర గురించి చెప్పండి?

స) గ్లామర్ అండ్ టాలెంట్ కలిసి ఉన్న అరుదైన హీరోయిన్ సమంత. నేను గౌతమ్ మీనన్ తీసిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తనకి అభిమానినైపోయాను. రామయ్యా వస్తావయ్యాలో ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోతో చిన్న చిన్న గొడవలు, పోట్లాటలతో తన రిలేషన్ మొదలవుతుంది. కానీ పరిస్థితులు రాను రాను మారిపోతుంటాయి. అప్పుడే కథలో ఓ ట్విస్ట్ అది ఈ సినిమాలో చాలా కీలకమైనది.

ప్రశ్న) మీరు కొంత కాలం క్రితం ఎన్.టి.ఆర్ కి ‘ఎంఎల్ఏ’ అనే ఒక స్క్రిప్ట్ చెప్పారు కదా ఆ ప్రాజెక్ట్ ఏమయ్యింది?

స) అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండే పొలిటికల్ సెటైరికల్ సినిమా. ఆ సినిమా అనుకున్న కొద్ది రోజుల తర్వాత అలాంటి కథలు డీల్ చెయ్యాలంటే ఇంకా అనుభవం కావాలని తెలుసుకున్నాను. అందువల్లే ఆ సినిమాని పక్కన పెట్టాను. భవిష్యత్తులో ఆ సినిమా పై పని చెయ్యొచ్చు లేదా చెయ్యక పోవచ్చు. ఎన్.టి.ఆర్ నన్ను తన క్లోజ్ ఫ్రెండ్ లా నన్ను ట్రీట్ చేస్తాడు. ఒక టాప్ హీరో డైరెక్టర్ ని అలా ట్రీట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది.

ప్రశ్న) మీరెందుకు అన్ని హీరో చుట్టూ తిరిగే కథలే ఎంచుకుంటారు?

స) నేను ఒక విషయం నమ్ముతాను. ‘ మనకి నచ్చింది చెయ్యటం కంటే మనకి వచ్చింది చెయ్యటం మంచిది’. హై టెక్నికల్ వాల్యూస్ తో తీసే ఇంటర్నేషనల్ సినిమాలు చూడటానికి చాలా బాగుంటాయి. అలాగే ‘సాగర సంగమం’ లేదా శేఖర్ కమ్ముల సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తాను. కానీ అవి నా బలం కాదు. గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి లాంటి ఎపిసోడ్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడం నా బలం. అలాగే హీరో ఇమేజ్ ని వాడుకొని హీరోని సరికొత్తగా చూపించడమే నా బలం.

ప్రశ్న) ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తాడా?

స) (నవ్వుతూ). ఇప్పుడు నేను ఏమీ చెప్పను. ఒకవేళ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపిస్తే మీరు థ్రిల్ ఫీలవుతారు. అదే నేను సినిమాలో సిక్స్ ప్యాక్ ఉందని చెబితే తీరా అది సినిమాలో లేకపోతే మీరు నిరుత్సాహపడతారు. కావున ఈ విషయంలో నేనేం చెప్పను. సింపుల్ గా ‘నో కామెంట్స్’.

ప్రశ్న) చూస్తుంటే థమన్ వర్క్ విషయంలో మీరు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు?

స) అవును. థమన్ ఆడియో ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఈ సినిమా ఆడియో సక్సెస్ కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. థమన్ మణిశర్మ శిష్యుడు, ఆయన నుండి రీ రికార్డింగ్ అనే ఆర్ట్ ని బాగా నేర్చుకున్నాడు. సినిమాలో వచ్చే అన్ని పాటలు సందర్భానుసారంగా వస్తాయి. వాటికి థమన్ పూర్తి న్యాయం చేసాడు.

ప్రశ్న) మీరు డైరెక్టర్ కావడానికి ప్రభావితం చేసింది ఏమిటి?

స) లిటరేచర్ నన్ను బాగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఆయన వల్లే అని చెప్పాలి. నేను మొదట పరిషత్ నాటకాల ద్వారా ఆర్టిస్ట్ గా మారాను, ఆ తర్వాత వాళ్ళతో షోలు చెయ్యడానికి చాలా సిటీలు తిరిగాను. దాంతో నా పై మాండలికాలు, ప్రాంతీయ భాషా ప్రభావం ఎక్కువగా ఉండేది. అప్పుడే నేను కథలు రాయడం డైరెక్షన్ చేయడం లాంటి వాటికి మార్గం చూపింది.

ప్రశ్న) మీరు ఇక ముందు చేయబోయే సినిమాలు ఏమిటి?

స) ప్రస్తుతం నా ముందున్న ప్రాజెక్ట్ ‘రామయ్యా వస్తావయ్యా’ ప్రమోషన్స్. నేను ఈ సినిమాని ఎంతమంది వరకూ ప్రజల్లోకి చేర్చగలనో అంతమంది వరకు చేర్చాలి. దాని తర్వాత అల్లు అర్జున్ కి ఓ స్టొరీ చెప్తాను. నేను స్క్రీన్ మీద చూపించాలనుకున్న చాలా కథలు నా దగ్గర ఉన్నాయి. అవి నేనే డైరెక్ట్ చేస్తానో లేక నా అసోసియేట్ డైరెక్టర్స్ చేస్తారో తెలియదు.

చివరిగా హరీష్ శంకర్ ఒక సెక్షన్ కి సంబందించిన వెబ్ మీడియా పై కొన్ని కామెంట్స్ చేసారు. ఆయన చెప్పింది ఎవరైతే వారికి వారే ఊహించుకొని కొత్త వార్తల్ని సృష్టిస్తారో వారి గురించి. హరీష్ శంకర్ తన స్టైల్లో నమ్మకానికి మరియు అహంకారానికి మధ్య ఉన్న తేడాని చెప్పాడు. ‘ ముందు సినిమా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయిన తర్వాత ఏ వెబ్ సైట్ వద్ద ఎంత విశ్వసనీయ సమాచారం ఉందో తెలుస్తుందని’ హరీష్ శంకర్ అన్నాడు. హరీష్ శంకర్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ‘రామయ్యా వస్తావయ్యా’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం..

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు