డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి సినిమాలు నిర్మించే ‘బొమ్మరిల్లు’ బ్యానర్ 12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ రోజు వై.వి.ఎస్ చౌదరి మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు. మే – 1 – 2002 లో విడుదలైన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వై.వి.ఎస్ చౌదరి తనకి సినిమాల పట్ల ఉన్న ఆసక్తి, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అలాగే ప్రస్తుతం తను తీస్తున్న సినిమా స్టేటస్ గురించి మాతో పంచుకున్నాడు ఆ విశేషాలు మీకోసం …
ప్రశ్న) మే 1 వ తేదీ మీకు చాలా ప్రత్యేకమైన రోజు అనుకుంటా..
స) అవును. మే 1 వ తీదీ అనేది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. మామూలుగా ఆ రోజుకి ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది, కానీ నాది మాత్రం నా జీవితానికి సంబందించింది. 2002లో నా బొమ్మరిల్లు బ్యానర్ పై ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమా విడుదలై నాకొక కొత్త జీవితాన్ని అందించింది. ఈ సినిమా నా కలల్లో నుంచి పుట్టుకొచ్చింది.
ప్రశ్న) మీ బ్యానర్ కి ‘బొమ్మరిల్లు’ అనే పేరెందుకు పెట్టారు?
స) మామూలుగా రూరల్ స్లాంగ్ లో చెప్పాలంటే బొమ్మ అంటే సినిమా. వాళ్ళందరూ ‘అరే బొమ్మ చూసావా’ అని అంటుంటారు. అలా అడిగితే ‘నువ్వు సినిమా చూసావా? అని అర్థం. కావున నేను అక్కడి బొమ్మ అనే పదాన్ని తీసుకున్నాను. ‘ఇల్లు’ అంటే అందరికీ తెలిసిందే. సినిమాలు తీసే బ్యానర్ కాబట్టి కలిపి ‘బొమ్మరిల్లు’ అని పెట్టాను. నేను అలా ఆలోచించే నా సొంత బ్యానర్ కి నేనే ఆ పేరు పెట్టుకున్నాను.
ప్రశ్న) మీకు సినిమాల్లోకి రావాలని స్పూర్తినిచ్చింది ఎవరు?
స) ఇంకెవరు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. నేను సినిమాలు చేయడానికి ఆయనే స్ఫూర్తి. నేను ఎన్.టి.ఆర్ గారికి వీరాభిమానిని. అలాగే నాకు మొట్ట మొదట డైరెక్టర్ గా చాన్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు అక్కినేని నాగార్జున గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రశ్న) సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న ‘రేయ్’ స్టేటస్ ఏమిటి?
స) చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, షబానా అజ్మీ మేనకోడలు సయామి ఖేర్, శ్రద్దా దాస్ లతో ‘రేయ్’ సినిమాని నిర్మిస్తున్నాను. ఇందులో ఓ హీరోయిన్ పాత్ర పాజిటివ్ గా ఉంటే, రెండవ హీరోయిన్ పాత్ర నెగటివ్ గా ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి కావచ్చింది, ఈ రోజే షూటింగ్ చివరి రోజు. కొంత పాచ్ వర్క్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి.
ప్రశ్న) ఈ సినిమా నుంచి మీరు ఏమేమి ఆశిస్తున్నారు?
స) సినిమా విజయం ఫై నాకు పూర్తి నమ్మకం ఉంది. సినీ ప్రేమికులు మంచి సినిమా తీసిన ప్రతిసారి నన్ను ప్రోత్సహిస్తున్నారు. రేయ్ విశ్లేషనాత్మకంగా సాగే ఒక లవ్ స్టొరీ ‘ మాస్ ఎలిమెంట్స్ ఉంటూ క్లాస్ ని మెప్పించగల సినిమాలు రావట్లేదు. అలాగే యూత్ కి రీచ్ అయ్యే పెద్ద సినిమాలు తగ్గాయి’. కేవలం చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రమే యూత్ కి కాస్తో కూస్తో రీచ్ అవుతున్నాయి. రేయ్ సినిమా యూత్ కి భీభత్సంగా కనెక్ట్ అయ్యే సినిమా. ఇటీవల కాలంలో ఇలాంటి భారీ బడ్జెట్ యూత్ లవ్ స్టొరీ రాలేదు. ఈ సినిమా 30 కోట్ల బిజినెస్ చేస్తుంది.
ప్రశ్న) ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
స) రాబోయే 45 రోజుల్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ని మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ చూసుకొని నిర్ణయిస్తాము. ముందుగా మేము కూర్చొని చర్చించి త్వరలోనే మీకు తెలియజేస్తాము.
ప్రశ్న) మీ ప్రతి సినిమాలో మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ‘రేయ్’ సినిమా నుంచి మేము ఎలాంటి మ్యూజిక్ ఆశించవచ్చు?
స) ‘రేయ్’ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. చక్రి, చంద్రబోస్ వారి పనిని చాలా చక్కగా చేసారు. ఈ ఆడియో ఆల్బమ్ కి యువత బాగా కనెక్ట్ అవుతారు.
ప్రశ్న) మీరు భవిష్యత్తులో చేయనున్న సినిమాల విశేషాలేమిటి?
స) ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా మరో 4 సినిమాలను నా బ్యానర్ లో ప్లాన్ చేస్తున్నాను ఆ సినిమాలను రెండు నుంచి రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాను.
1. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాకి సీక్వెల్ గా ‘కృష్ణా ముకుందా మురారి’ అనే మూవీ చేస్తాను.
2. ‘సీతయ్య’ సినిమాకి సీక్వెల్ గా ‘ఎవ్వరి మాట వినడు’ అనే మూవీ చేస్తాను.
3. పవర్ఫుల్ డ్రామా గా ‘సి.ఎమ్ – కామన్ మాన్’ అనే సినిమా తీస్తాను.
4. ‘థాంక్స్ బేబీ – నన్ను లవ్ చెయ్యనందుకు’ అనే లవ్ స్టొరీ చెయ్యనున్నాను.
త్వరలోనే ఈ సినిమాల పూర్తి వివరాలను, నటీనటుల వివరాలను తెలియజేస్తాను.
ప్రశ్న) మీరు సినిమా తీయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. రెండు సంవత్సరాల్లో ఈ 4 సినిమాలని కంప్లీట్ చేస్తారా?
స) ప్రతి సినిమా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు, ప్లాన్ చేసుకునే స్టేజ్ లోనే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక సారి అదంతా రెడీ అయిపోతే 6 నుంచి 7 నెలల్లో షూటింగ్ అయిపోతుంది. గతంలో నేను 8 నెలల్లో సినిమాలు తీసేవాన్ని. నేను ఇప్పటికే అన్ని సినిమాల స్క్రిప్ట్స్ పై పని చేసాను, కావున ఈ సినిమాలను చెప్పిన టైం లోపు తీస్తానన్న నమ్మకం ఉంది.
అంతటితో వై.వి.ఎస్ చౌదరితో మా చిట్ చాట్ ముగించాము. వై.వి.ఎస్ చౌదరి తీస్తానన్న సీక్వెల్స్ యొక్క టైటిల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో అవి ఎలా తెరకెక్కుతాయా అనేది చూడాలి..
CLICK HERE TO ENGLISH INTERVIEW