యంగ్ హీరో నాని తన సినిమాలతో వరుసగా బాక్స్ ఆఫీసు వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే తను నటించిన ‘పైసా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ వారం నాని శక్తిగా కనిపించనున్న ‘ఆహా కళ్యాణం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నానితో కాసేపు ముచ్చటించాము. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ముందుగా అసలు యష్ రాజ్ సంస్థ వారి నుంచి మీకు ఆఫర్ ఎలా వచ్చింది?
స) యష్ రాజ్ సంస్థ వారు సౌత్ లో చేస్తున్న మొదట సినిమా కోసం ఎంతో మంది నటులు వాళ్ళని అడిగినా వారు మాత్రం నన్ను సెలక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మొదట వాళ్ళు హైదరాబాద్ లోనే మీటింగ్ ఏర్పాటు చేసారు. ఏం స్టొరీ చెబుతారో`, ఎలా ఉంటుందో అని ఆసక్తిగా వెళితే వాళ్ళేమో రీమేక్ సినిమా అని చెప్పగానే కాస్త నిరుత్సాహపడ్డాను. డైరెక్ట్ సినిమా చెయ్యొచ్చు కదా అని అనుకున్నాను. సరే యష్ రాజ్ లాంటి బ్యానర్ వాళ్ళని నొప్పించకుండా ఎలా నో చెప్పాలో అర్థం కాక ఒక రోజు టైం అడిగితే వల్లేమో పరవాలేదని చెప్పి ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమా సిడి ఇచ్చి చూడమన్నారు. ఆ రోజు నైట్ సినిమా చూసాను. సినిమా అయిపోగానే వెంటనే చేస్తే ఈ సినిమానే చెయ్యాలని వెంటనే ఓకే చేసేసాను.
ప్రశ్న) మీరు ఇప్పటి వరకూ చాలా ప్రొడక్షన్స్ లో పనిచేసారు. కానీ యష్ రాజ్ సంస్థలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి?
స) ఇక్కడ మన సిస్టంలో కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకే ఈ రోజు అనుకున్నది రేపటికి, ఒక డేట్ కి అనుకున్న షెడ్యూల్స్ మరో డేట్ కి వాయిదా పడుతుంటాయి. కానీ మొదటి సారి నా కెరీర్లో టైం అంటే టైం, డేట్ అంటే డేట్ అని అనుకున్న టైంకి అన్నీ పర్ఫెక్ట్ గా పూర్తి చేసారు. ఒక్క మాటలో చెపాలంటే యష్ రాజ్ అనేది వెల్ ఆర్గనైజ్డ్ బ్యానర్.
ప్రశ్న) ఇక్కడి వారి కోసం సినిమాలో చేసిన మార్పులు ఏమిటి?
స) సినిమా కథని ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్చాం. ఇక్కడి పెళ్ళిళ్ళ సాంప్రదాయాలను ఇందులో ఫాలో అయ్యాం. అలాగే ఈ సినిమా కామెడీ వల్లనో, ఇంటర్వల్ లేదా క్లైమాక్స్ బ్లాక్ వల్లనో ఆడే సినిమా కాదు. ఈ సినిమాలో ఉండే శక్తి – శృతి అనే పాత్రల కెమిస్ట్రీ, కొన్ని మోమెంట్స్ కి ఆడియన్స్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. అలా ఓన్ చేసుకొని చూస్తారు కాబట్టే ఈ సినిమా హిట్ అవుతుంది.
ప్రశ్న) రీమేక్ అంటే నిరుత్సాహపడ్డవారు, ఈ సినిమా హిట్ అవుతుందని ఎలా నమ్మారు?
స) నా దృష్టిలో రీమేక్ అంటే పెద్ద చాలెంజ్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆడియన్స్ బ్యాండ్ బాజా బారాత్ కి కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు దానికన్నా బెటర్ ఇచ్చినా కూడా ఆ సినిమాతో పోలుస్తారు. అందుకే మేము మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. రీమేక్ అనగానే మనవాళ్ళు టెక్నికల్ గా మ్యాచ్ చెయ్యాలని చూస్తారుగానీ కంటెంట్ పరంగా ఉన్న ఒరిజినల్ మేజిక్ ని మ్యాచ్ చెయ్యరు. కానీ ఈ సినిమాలో మేము మేజిక్ మిస్ కాకుండా చేసాం. అందుకే హిట్ అవుతుందని నమ్మాను. నా వరకూ అయితే కథ కంటే తీసే విధానమే ముఖ్యం. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఎంజాయ్ చేస్తారు.
ప్రశ్న) మీరు తెలుగు హీరో అయి ఉండి, రెండు భాషల్లోనూ చేయకుండా తమిళ్ లో చేసి డబ్ చేయడానికి గల కారణం ఏమిటి?
స) అలా చేయడానికి నేనే కారణం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి రెండు భాషల్లోనూ చేయాలనుకున్నారు. కానీ నాకు డేట్స్ లేవు. ‘జెండాపై కపిరాజు’ ఫస్ట్ షెడ్యూల్ చేసాం. సెకండ్ షెడ్యూల్ కి మూడున్నర నెలల ఖాళీ ఉంది. సో నేను ఆ ఖాళీ ఉన్న టైం వాళ్ళకి ఇచ్చి సినిమా పూర్తి చెయ్యాలి అని చెప్పాను. దాంతో ఒకేసారి రెండు వెర్షన్స్ తీయలేం అని అప్పటికి వాళ్ళ దగ్గర తమిళ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. దాంతో తమిళ్ వెర్షన్ తీసేసి డబ్ చేద్దామని అనుకున్నాం. కానీ క్లైమాక్స్, కొన్ని పాటలు, కొన్ని కీలక సీన్స్ ని తెలుగులో షూట్ చేసాం.
ప్రశ్న) కానీ తెలుగు హీరో అయిఉండి తమిళ్ లో తీసి డబ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటారు?
స) ఇదే ప్రశ్నని బయట కూడా చాలా మంది అడిగారు. ఈ విషయంలో మనవాడు తమిళనాడుకు వెళ్లి సినిమా తీసాడని గర్వపడాలి. నేను మాత్రం కాస్త గర్వంగా ఫీలయ్యాను. ఎందుకంటే ఎంతో మంది తమిళ హీరోలు ఇక్కడి వచ్చి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడి హీరోలు మాత్రం అక్కడ ఎలాంటి అవకాశం దక్కించుకోలేకపోయారు. కానీ నాకు ఆ అవకాశం దక్కించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే తమిళ్ లో ఇది నా మూడో సినిమా అయినా వాళ్ళ ఆదరణ మాత్రం చాలా బాగుంది.
ప్రశ్న) దాదాపు అతి తక్కువ టైంలో మీ మూడు సినిమాలు వస్తున్నాయి. ఎలా ఫీలవుతున్నారు?
స) అంటే ముందు ఇలా ఏం ప్లాన్ చేసుకోలేదు. పైసా కాస్త ఆలస్యం కావడం వల్ల ఇలా అన్ని ఒకేసారి వస్తున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఒక్కో పాత్రకి అస్సలు సంబంధం ఉండదు. నేను ఎంతో వైవిధ్యమైన పాత్రలు చేసిన సినిమాలు ఒకేసారి రాకుండా ఆలస్యంగా వస్తే నా పెర్ఫార్మన్స్ కి పెద్ద గుర్తింపు ఉండదేమో కానీ ఇలా రావడం వల్ల నా పెర్ఫార్మన్స్ కి మంచి గుర్తింపు వస్తుందని నమ్మకంగా ఉన్నాను. అందుకే హ్యాపీ గా ఫీలవుతున్నాను.
ప్రశ్న) సిమ్రాన్ గారు ఈ సినిమాలో ఓ పాత్ర పోషించారు. ఆమె పాత్ర, నటన గురించి చెప్పండి?
స) సిమ్రాన్ గారు కూడా సినిమాలో మాలానే ఓ మ్యారేజ్ ఆర్గనైజర్ గా కనిపిస్తారు. సిమ్రాన్ గారిది చాలా చిన్న పాత్ర, కానీ సినిమాకి చాలా కీలకం. ఆమె వల్లే సినిమా మరో లెవల్ కి వెళుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఆమెకి పెద్ద అభిమానిని. సినిమా సెట్లోకి ఆమె వచ్చినప్పుడు ఆమెతో ఎలా మాట్లాడాలా, నేను తనకి పెద్ద అభిమానిని అని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే ఆమె నా దగ్గరికి వచ్చి మా అబ్బాయిలు నీకు పెద్ద ఫాన్స్ అని చెప్పింది. దాంతో అంతా సెట్ అయిపొయింది.
ప్రశ్న) ఈ సినిమాలో లిప్ లాక్ గురించి చెప్పండి? దానికి మీ భార్య ఒప్పుకున్నారా?
స) నేను చేసే సినిమాలు నా కుటుంబంతో కలిసి చూడాలనుకుంటాను. అందుకే ఎక్కడా వల్గారిటీకి చోటు ఉండదు. ఈ సినిమాలో లిప్ లాక్ అనేది కథకి చాలా అవసరం. చెప్పాలంటే అదే సినిమాకి మెయిన్ సీన్. అందుకోసం ఆ సీన్ చేసాం. కానీ ఎక్కడా ఇబ్బంది కరంగా ఉండదు. చూడటానికి చాలా కవితాత్మకంగా ఉంటుంది. అలాగే ఇంట్లో చెప్పి పర్మిషన్ తీసుకున్నాకే చేసాను.
ప్రశ్న) ఇటీవలే ఓ టీవీ చానల్ లో త్రిష నాకు నానితో నటించాలని ఉందని చెప్పింది? దీనిపై మీ కామెంట్?
స) (నవ్వుతూ) అది కాంప్లిమెంట్ గా తీసుకుంటాను. కచ్చితంగా త్రిషతో చేసే అవకాశం వస్తే సినిమా చేస్తాను.
ప్రశ్న) మీ డ్రీం రోల్స్ గురించి చెప్పండి?
స) చెప్పాలంటే ఒకటి ఉంది కానీ అది జరగదు.అది చెప్తే మీరు కూడా నవ్వుతారేమో. నాకు గ్లాడియేటర్ లాంటి సినిమా చేయాలని ఉంది. అలాంటి సినిమా తీస్తే ఒక్క రాజమౌళినే చేయాలి. కానీ అలాంటి సినిమా ఆయన చేసేస్తున్నారు. ఇలాంటప్పుడే నాకు నేను కాస్త పొడవుగా ఉంటే బాగుండేదే అని అనుకుంటాను. అది కాకుండా అంటే సినిమా సినిమాకి ఏదో ఒక కొత్తదనం ఉండాలనుకుంటాను. అదే నా డ్రీం.
ప్రశ్న) ‘పన్నాయిరుం పద్మినియుం’ సినిమా మీరే చేస్తున్నారా? మీ తదుపరి సినిమాలేమిటి?
స) ‘పన్నాయిరుం పద్మినియుం’ సినిమా రీమేక్ రైట్స్ కొన్నాను. ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. కానీ ఆ సినిమా నేను చేయాలా, వేరే వాళ్ళు చేయాలా అనేది నిర్ణయించుకోలేదు. అలాగే కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. ముందు ‘జెండాపై కపిరాజు’ రిలీజ్ అయ్యాక కాస్త విరామం తీసుకొని ఏ సినిమా చేయాలా అనేది నిర్ణయించుకుంటాను.
అంతటితో నానికి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం
రాఘవ
CLICK HERE FOR ENGLISH VERSION