తన పదేళ్ళ కెరీర్లో చేసింది కేవలం 5 సినిమాలు మాత్రమే, కానీ మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ చేసిన 5వ సినిమా ‘1-నేనొక్కడినే’. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. సుకుమార్ ఈ సినిమాకి సంబందించిన విశేషాలు, ఈ మూవీ టైంలో మహేష్, గౌతమ్ లతో తన అనుభవాలని, తన రాబోయే సినిమా విశేషాలను మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) మహేష్ బాబు కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ ఇదే.. అంత ఖర్చు పెట్టడానికి గల నమ్మకం ఏమిటి?
స) 14 రీల్స్ వారితో కలిసి పనిచేయడం ఎంతో లక్కీ అని చెప్పాలి. వాళ్ళు లేకపోయి ఉంటే ఈ సినిమా ఇంత రిచ్ గా వచ్చేది కాదు. నాకు వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ తెలియదు కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు ఇది ఎందుకు అని అడగలేదు. సింపుల్ గా చెప్పాలంటే ‘కథ ఈ బడ్జెట్ ని డిమాండ్ చేస్తుంది’. కానీ కథ డిమాండ్ చేసినా చాలా మంది నిర్మాతలు అంత బడ్జెట్ పెట్టరు. మేము చాలా యాక్షన్ సీక్వెన్స్ లను లండన్ లో, అలాగే అక్కడి మెయిన్ బ్రిడ్జ్ దగ్గర షూట్ చేసాము. నిర్మాతలే కథ కోసం మీరు ముందుకెళ్ళండి అని భరోసా ఇచ్చారు.
ప్రశ్న) కథ రాసుకునేప్పుడు డైరెక్టర్ చాలా విషయాలు అనుకుంటారు. కానీ సినిమా పూర్తయ్యేటప్పటికి అవి మారిపోతుంటాయి. మరి ‘1’ ఎలా వచ్చింది?
స) మాములుగా అలాంటి సమస్యలు సినిమా తీసేటప్పుడు కావలసిన వసతులు లేనప్పుడే జరుగుతుంది. నేను ఈ సినిమా విషయంలో అలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కొన్ని చోట్ల బడ్జెట్ ఎక్కువవుతుందని నేను అనుక్కన్నప్పటికీ నిర్మాతలు మాత్రం సింపుల్ గా ఓ నవ్వు నవ్వి, మీరు చేయండి అని ప్రోత్సహించేవారు.
ప్రశ్న) సినీ అభిమానుల్లో మహేష్ బాబుకి ఓ ఇమేజ్ ఉంది. 1 అనేది ఎలాంటి సినిమా అని అభిమానులు ఆశించవచ్చు?
స) ఈ సినిమాలో సెపరేట్ గా పంచ్ డైలాగ్స్ లాంటివి ఏమీ ఉండవు. కానీ మంచి ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. మహేష్ బాబు నేను కథ ఎలా చెప్పానో అలానే తీయమన్నాడు. అందులో అసహజంగా అనిపించే పంచ్ డైలాగ్స్, మరే ఇతర ఎలిమెంట్స్ జత చేయొద్దని చెప్పాడు. మహేష్ బాబు ‘చేసేది ఏదో అది 100% చెయ్యాలి. మీరు ఎలా అనుకున్నారో అలా చేయండి’ అని అన్నాడు.
ప్రశ్న) మీరు ఎంచుకునే కథలన్నీ కాస్త అసాధారణంగా ఉంటాయి. మీకు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అంటే ఇష్టం ఉండదా?
స) అలా ఏం లేదు. నేను కూడా పూర్తి కమర్షియల్ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించాలనుకుంటాను. కానీ నా ఆలోచనలు వేరేలా ఉంటాయి. ‘100% కామెడీ సినిమా చేద్దాం అనుకోని ట్రాక్ మారిపోయిన సందర్బాలు ఉన్నాయి’. బహుశా నాకు ఓ కొత్త స్టొరీని ఎఫ్ఫెక్టివ్ గా తీయగలిగిన సత్తా, ఆలోచనలు ఉన్నాయేమో అందుకే రెగ్యులర్ సినిమాల జోలికి వెళ్ళడం లేదు.
ప్రశ్న) మాములుగా బి, సి సెంటర్ ప్రేక్షకులకి మీ సినిమాలను అర్థం చేసుకోవడం కాస్త కష్టతరం అంటారు. ఇప్పుడు ‘1’ విషయంలో ఏమన్నా మార్పు ఉందా?
స) నేను కావాలని అనుకోని ‘ఇంటెలిజెంట్’ సినిమాలు చేయడం లేదు. నేను అందరికీ నచ్చేలా ఉండాలనే తీస్తాను, కానీ దురదృష్ట వశాత్తు నేను అనుకున్నది జరగడం లేదు. కానీ ‘1’కి నాకు వేరే విధమైన రిపోర్ట్ వస్తుంది. ఇది భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కావున ఈ సినిమాని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.
ప్రశ్న) ఇప్పటికే చాలా మంది అడిగే ఉంటారు కృతి సనన్ ని ఎందుకు తీసుకున్నారు అని…
స) మాకు లండన్ షెడ్యూల్ కోసం ఎక్కువగా డేట్స్ ఇచ్చే వాళ్ళు కావాలి. అప్పటికి అంత ఎక్కువ డేట్స్ ఇచ్చే కథానాయికలు ఎవరూ లేరు. దాంతో కొత్త హీరోయిన్ ని తీసుకుందాం అని అనుకున్నాం. మేము చాలా మందిని చూసాక చివరిగా కృతిని సెలెక్ట్ చేసాం. తను ఇంజనీరింగ్ లో 89% మార్కులు తెచ్చుకున్న మంచి స్టూడెంట్. మహేష్ బాబుకి నటుడిగా మంచి మెమొరీ పవర్ ఉంది, అలాగే డైలాగ్స్ ఫాస్ట్ గా చెప్పగల గ్రిప్ ఉంది. అలాంటప్పుడు మహేష్ బాబుకి సమానంగా చేయగల హీరోయిన్ కావాలి. కృతి సనన్ చాలా బాగా చేసింది.
ప్రశ్న) ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేసారు. వారితో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
స) వాళ్ళు చాలా ప్రొఫెషనల్ మరియు వారితో పనిచేయడం మంచి అనుభవం. వాళ్ళు సీన్ విని టెక్ చెయ్యడానికి ముందు చాలా సార్లు రిహార్సల్ చేసి ఆ తర్వాత చేసేవారు. ఎక్కువగా టేబుల్ డిస్కషన్స్ జరిగేవి. మేము ఏమి కావాలో వారికి చెప్పాక వాళ్ళు పని మొదలు పెట్టి పర్ఫెక్ట్ గా పూర్తి చేసేవారు. అలాగే వాళ్ళతో పనిచేయడం కూడా చాలా సులభమే..
ప్రశ్న) గౌతమ్ ని ఈ సినిమా కోసం తీసుకున్నప్పుడు ఏమన్నా భయపడ్డారా?
స) నేను కాస్త భయపడ్డాను. మొదట్లో అనుకున్న దానికి గౌతమ్ చేయగలడా లేదా అని ఆందోళన పడ్డాను. గౌతమ్ ఓ స్టార్ కుమారుడు, అప్పటికి నటనలో అతనికి ఎలాంటి ట్రైనింగ్ లేదు. కానీ గౌతమ్ తన టాలెంట్ తో మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు. గౌతమ్ ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండటం వల్ల మా పని మరింత సులువై పోయింది.
ప్రశ్న) మీరు ప్రతిసారి దేవీశ్రీ ప్రసాద్ ని తీసుకుంటారు. దానికి ఏమన్నా స్పెషల్ కారణం ఉందా?
స) నన్ను బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళలో దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. మా ఇద్దరి ఆలోచనలు ఒకలానే ఉంటాయి. నాకు మ్యూజిక్ సెన్స్ పెద్దగా లేదు. నేను ఎప్పుడైతే సినిమా థీమ్, సీన్స్ చెబుతుంటానో అప్పుడే తను అర్థం చేసుకొని మంచి మ్యూజిక్ ఇస్తాడు. దేవీశ్రీ నా పనిని మరింత సులువు చేసేస్తాడు. ఎప్పుడూ సాధ్యమైనంత వరకూ మంచి మ్యూజిక్ ఇస్తాడు.
ప్రశ్న) మీరు జూ. ఎన్.టి.ఆర్ తో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నారు?
స) నేను ఎన్.టి.ఆర్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ తీయాలనుకున్నాను. ఆ దిశలోనే వర్క్ జరుగుతోంది. ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. ఆ సినిమా వివరాలు తర్వాత తెలియజేస్తాను.
ప్రశ్న) పవన్ కళ్యాణ్ సినిమా ఏమైంది? అభిమానులు మీ కాంబినేషన్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు..
స) (నవ్వులు).. పవన్ కళ్యాణ్ ఒక బిజీ స్టార్.. ఇప్పటి వరకూ ఆయనతో ఓ సినిమా గురించి చర్చించలేదు. నాకు ఆయనతో పనిచేయడం అంటే ఇష్టం కానీ అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి..
ప్రశ్న) ఇప్పుడున్న దర్శకులలో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు?
స) (ఆలోచిస్తే) అది రాజమౌళి అని చెప్పాలి.. దర్శకులలో ఆయన ఇప్పుడు మరో లెవల్లో ఉన్నాడు. ఆయన తన సినిమా కోసం పెట్టే ఎఫర్ట్ మాటల్లో చెప్పలేనిది. నేను ‘ఈగ’ సినిమా చూసినప్పుడు థ్రిల్ అయ్యాను.
ప్రశ్న) మీరు మా పాఠకులకు, సినీ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
స) ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా స్టార్టింగ్ మిస్ అవ్వకండి. ప్రతి సీన్ మీకు బాగా కనెక్ట్ అవుతుందని గ్యారంటీ ఇవ్వగలను. అలాగే సినిమా చాలా కొత్తగా ఉంటాడని, ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను.
అంతటితో సుకుమార్ తో మా ఇంటర్వ్యూని ముగించి, ‘1-నేనొక్కడినే’ సినిమా సక్సెస్ కావాలని సుకుమార్ కి అల్ ది బెస్ట్ చెప్పాము
ఇంటర్వ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం – రాఘవ
CLICK HERE FOR ENGLISH INTERVIEW