ఇంటర్వ్యూ : అదా శర్మ – ‘S/O సత్యమూర్తి’లో ఎలాంటి లిప్‌లాక్ సీన్ లేదు!

ఇంటర్వ్యూ : అదా శర్మ – ‘S/O సత్యమూర్తి’లో ఎలాంటి లిప్‌లాక్ సీన్ లేదు!

Published on Apr 18, 2015 5:39 PM IST

Adah--Sharma
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య గత వారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన అన్ని చోట్లా మంచి కలెక్షన్లతో సినిమా హిట్ దిశగా దూసుకెళుతోంది. ‘S/O సత్యమూర్తి’ విజయం సాధించిన సందర్భంగా ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా మెరిసిన అదా శర్మతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘S/O సత్యమూర్తి’లో మీ రోల్‌కి ఎలాంటి స్పందన వస్తోంది?

స) చాలా మంచి స్పందన వస్తోందండీ. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. త్రివిక్రమ్ గారు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. సినిమా చూసిన ప్రేక్షకులు నా రోల్ బాగుందని చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నా మొదటి సినిమా ‘హార్ట్ అటాక్‌’కు ఇచ్చినట్టుగానే ఈ సినిమాకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు.

ప్రశ్న) హీరోయిన్ కావాలన్న ఆలోచన ఎప్పుడు పుట్టింది?

స) చిన్నప్పట్నుంచీ ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో ఉండేదాన్ని. ఓసారి సర్కస్‌లో పనిచేయాలని, మరోసారి డ్యాన్సర్ అవ్వాలని ఏదేదో అనుకునేదాన్ని. టెన్త్ క్లాస్‌కి వచ్చిన తర్వాత సినిమాలకుండే క్రేజ్ చూసి హీరోయిన్ అవ్వాలని ఫిక్సయ్యా. మొదట్లో ఫ్యామిలోలో ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆ తర్వాత నా అభిప్రాయాన్ని గౌరవించి నాకు సపోర్ట్ చేశారు.

ప్రశ్న) అల్లు అర్జున్‌తో కలిసి నటించడం గురించి చెప్పండి?

స) అల్లు అర్జున్ యాక్టింగ్ అయినా, డ్యాన్స్ అయినా అద్భుతంగా చేస్తారు. డ్యాన్స్ చేస్తున్నపుడు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా భలే పలికిస్తారు. అల్లు అర్జున్‌ డ్యాన్స్ చేస్తుంటే.. అది చూసి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూండడం వల్లే ఆయన అంత బాగా యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ చేయగలుగుతున్నారు.

ప్రశ్న) సమంత, నిత్యామీనన్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది?

స) నాకు ఎప్పట్నుంచో సమంత, నిత్యామీనన్‍లు అంటే ఇష్టం. నాకిష్టమైన హీరోయిన్లు ఎవరంటే.. సమంత, నిత్యామీనన్‌ల పేర్లే చెప్పేదాన్ని. అలాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడమంటే సంతోషమే కదా! ఇద్దరూ చాలా అందంగా ఉండడమే కాక, అద్భుతంగా నటిస్తారు. ఈ సినిమాలో నిత్యా మీనన్‌తో కలిసి నటించే అవకాశం రాలేదు. అయితే సమంతతో మాత్రం కలిసి నటించా. కమర్షియల్ సినిమాల్లో కూడా హీరోయిన్ రేంజ్ పెంచింది సమంత. సమంత, నిత్యా మీనన్ ఇద్దరిని చూసి చాలా నేర్చుకున్నా.

ప్రశ్న) ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?

స) చేసిన పాత్రే మళ్ళీ చేయాలంటే నాకు నచ్చదు. ప్రతీ సినిమాకూ కొత్తదనం ఉండేలా చూసుకుంటా. హర్రర్, లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఇలా రకరకాల జానర్ సినిమాల్లో రకరకాల పాత్రలు చేశా. ఒక పాత్రతో మరో పాత్రకు సంబంధం ఉండదు. ఇకముందు కూడా డిఫరెంట్ పాత్రలనే ఎంచుకుంటా.

ప్రశ్న) ఈ సినిమాలో మీకూ అల్లు అర్జున్‌కు మధ్యగల లిప్‌లాక్ సీన్ డిలీట్ చేశారని టాక్?

స) లేదు. ఈ సినిమాలో నాకూ, అల్లు అర్జున్‌కు మధ్య ఎలాంటి లిప్‌లాక్ సన్నివేశాన్నీ షూట్ చేయలేదు. అలాంటప్పుడు అది సినిమాలో ఉండే చాన్స్ గానీ, డిలీట్ చేసే పని గానీ లేదు.

ప్రశ్న) బికినీలో నటించాల్సి వస్తే.. ఓకే చెబుతారా?

స) ఈ ప్రశ్నకు నేనే సమాధానం చెప్పినా ఇబ్బందే. స్క్రిప్ట్ డిమాండ్ చేసి బికినీ ధరించాల్సి వచ్చినప్పుడు నాకే అభ్యంతరం లేదు. ఇప్పటివరకైతే ఆ అవసరం రాలేదు. అలాంటి అవసరం ఉంటే తప్పకుండా బికినీలో కనిపిస్తా.

ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి?

స) ప్రస్తుతం చాలా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. జాగ్రత్తగా సినిమాలను సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పటివరకూ ఆది ‘గరమ్’, పీవీపీ బ్యానర్‌లో ‘క్షణం’ అనే సినిమాలు ఫైనల్ అయ్యాయి. ఇవికాక తెలుగులో మరో రెండు సినిమాలు, ఒక తమిళ సినిమా డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తా.

ఇక అక్కడితో అదా శర్మతో మా ఇంటర్వ్యూ ముగిసింది. ‘S/O సత్యమూర్తి’ విజయం సాధించిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అదా శర్మ భవిష్యత్ ప్రాజెక్టులకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు