ఇంటర్వ్యూ : ‘ఆగడు’ నిర్మాతలు – ఎదురులేని పోలీస్ గా మహేష్ బాబు నటన హైలైట్ అవుతుంది.

ఇంటర్వ్యూ : ‘ఆగడు’ నిర్మాతలు – ఎదురులేని పోలీస్ గా మహేష్ బాబు నటన హైలైట్ అవుతుంది.

Published on Sep 17, 2014 10:06 PM IST

Producers
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమన్నా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సినిమా ‘ఆగడు’. కొత్త తరహా పబ్లిసిటీ కార్యక్రమాలతో ట్రెండ్ సృష్టిస్తున్న నిర్మాతలు సినిమా విజయంపై చాలా ధీమాగా ఉన్నారు. ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో నిర్మించిన ‘ఆగడు’ అభిమానుల అంచనాలను తప్పకుండా చేరుకుంటుందని నిర్మాతలు చెప్పారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట మీడియాతో సమావేశం అయ్యారు. ఆ విశేషాలు మీకోసం.

ప్రశ్న) మహేష్ బాబుతో మీరు చేస్తున్న మూడో సినిమా ‘ఆగడు’. ఆయనతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?

స) వరుసగా మహేష్ బాబుతో మూడు సినిమాలు చేసే అవకాశం లభించడం మా అదృష్టం. ఆయనతో వర్క్ అంటే చాలా సరదాగా సాగిపోతుంది. యూనిట్ లో ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశారు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మహేష్ బాబుతో కాసేపు మాట్లాడితే మనలో తెలియని ఉత్శాహం వస్తుంది. భవిష్యత్ లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం.

ప్రశ్న) ‘ఆగడు’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు..? సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..?

స) ఎవ్వరు ఆపలేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో, ఎదురులేని మనిషిగా మహేష్ బాబు నటించారు. అందుకే ‘ఆగడు’ అనే టైటిల్ పెట్టాం. సిఐ శంకర్ పాత్రలో మహేష్ బాబు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తారు. మహేష్ పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తొలి సినిమా ఇది. ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్. వినోదానికి లోటు ఉండదు. మహేష్ బాబు చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మహేష్ బాబు నటన సినిమాకి హైలైట్ అవుతుంది.

ప్రశ్న) కొందరు ఈ సినిమాను ‘గబ్బర్ సింగ్’ సినిమాతో పోలుస్తున్నారు. దీనిపై మీ స్పందన..?

స) ‘ఆగడు’, ‘గబ్బర్ సింగ్’ రెండు సినిమాలలో కామన్ థింగ్, హీరో పోలీస్ గా నటించడం. అంతే తప్ప రెండు సినిమాలకు సంబంధం లేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మహేష్ క్యారెక్టర్ చిత్రీకరణ, డైలాగులపై శ్రీను వైట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. సినిమా చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.

ప్రశ్న) బళ్ళారి మైనింగ్ ఏరియాలలో షూటింగ్ చేశారు. సినిమాలో మైనింగ్ వ్యవహారాలపై, రాజకీయాలపై సెటైరికల్ సన్నివేశాలు ఉన్నాయా..?

స) సినిమాలో ఎవ్వరి మీద సెటైరికల్ సన్నివేశాలు ఉండవు. మైనింగ్, రాజకీయాల మీద ఎటువంటి సన్నివేశాలు ఉండవు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, కొన్ని సన్నివేశాలు బళ్ళారి ఏరియాలో చిత్రీకరించాం. ఆ లొకేషన్లలో షూట్ చేయాలనే నిర్ణయం దర్శకుడు శ్రీను వైట్ల గారిదే.

ప్రశ్న) బళ్ళారిలో షూటింగ్ చేసినప్పుడు మహేష్ బాబు అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి..?

స) టోటల్ ‘ఆగడు’ సినిమా షూటింగ్ టైంలో మహేష్ బాబు మాకు చాలా సపోర్ట్ చేశారు. లడఖ్ లో ఒక సాంగ్ షూట్ చేశాం. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే బళ్ళారిలో దుమ్ము ధూళి మధ్య షూటింగ్ చేయడం కొంచం కష్టమైంది. ఇబ్బందికర పరిస్థితులలో కూడా మహేష్ బాబు షూటింగ్ చేశారు. సినిమా బాగా రావడం కోసం చాలా కృషి చేశారు. మహేష్ అందించిన సపోర్ట్ మాటల్లో చెప్పలేం.

ప్రశ్న) ఈ సినిమా ‘దూకుడు’ సీక్వెల్ అనుకోవచ్చా..?

స) ఈ సినిమా ‘దూకుడు’ సీక్వెల్ కాదండి. కంప్లీట్ ఒక కొత్త కథతో శ్రీను వైట్ల ‘ఆగడు’ను తెరకెక్కించారు. ఇప్పటివరకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమాలలో మోస్ట్ స్టైలిష్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ‘ఆగడు’. అభిమానులకు విజువల్ ట్రీట్ ఈ సినిమా.

ప్రశ్న) తమన్ సంగీతం గురించి చెప్పండి..?

స) సంగీత దర్శకుడిగా ఇది తమన్ 50వ సినిమా. పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యాకా పాటలకు ఇంకా మంచి పేరు వస్తుంది. బ్యూటిఫుల్ లొకేషన్లలో షూట్ చేశాం. అదే విధంగా తమన్ రీ రికార్డింగ్ కూడా అద్బుతంగా చేశాడు. ఇటివలే ఫస్ట్ కాపీ చూశాం. సినిమా ష్యూర్ షాట్ హిట్ అవుతుంది. అని అన్నారు.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి ‘దూకుడు’ తరహాలో ‘ఆగడు’ కూడా ఘన విజయం సాదించాలని ఆశిస్తూ నిర్మాతలకు అల్ ది బెస్ట్ చెప్పాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు