‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మరో స్వచ్చమైన తెలుగు టైటిల్ ‘లక్ష్మీ.. రావే మాఇంటికి’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాడు యువ హీరో నాగ శౌర్య. నంద్యాల రవి దర్శకత్వంలో గిరిధర్ నిర్మించిన ఈ సినిమాలో అవికా గొర్ హీరోయిన్ గా నటించింది. ఈ శుక్రవారం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి హీరో నాగ శౌర్య మీడియాతో సమావేశం అయ్యారు. హీరో చెప్పిన సంగతులు మీకోసం…
ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?
స) ఈ సినిమాలో నేను సాయి అనే క్యారెక్టర్ చేశాను. ‘లక్ష్మీ… రావే మాఇంటికి’ కథలో సాయి క్యారెక్టర్ లేకపోతే సినిమాకు అర్ధం లేదు. ‘బొమ్మరిల్లు’ లాంటి ఇంట్లో ఇడియట్ లాంటి క్యారెక్టర్ నాది. చాలా ఎనర్జిటిక్ రోల్. అన్ని రకాల ఎమోషన్స్ పలికించడానికి ఆస్కారం ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ తర్వాత మరో స్వచ్చమైన తెలుగు సినిమాలో నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది.
ప్రశ్న) ‘లక్ష్మీ… రావే మాఇంటికి’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు..?
స) మా సినిమాలో హీరోయిన్ పేరు లక్ష్మీ. సినిమా మొత్తం ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే.. ఆ అమ్మాయి చుట్టూ నేను తిరుగుతాను కాబట్టి. మా ఇంటికి రమ్మంటూ నేను ఆ అమ్మాయిని వెంట పడతాను. అందుకే ‘లక్ష్మీ… రావే మాఇంటికి’ అనే టైటిల్ ఎంపిక చేశాం.
ప్రశ్న) మీరు ఈ సినిమా అంగీకరించడానికి గల కారణం ఏంటి..?
స) సాయి అనే కుర్రాడి క్యారేక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. ఇడియట్ సినిమాలో రవితేజ గారు నటించిన క్యారెక్టర్ తరహాలో నా క్యారెక్టర్ ఉంటుంది. కథ, మాటలు, కాస్ట్ & క్రూ ఇలా అందరూ ఎంపిక (సెలెక్ట్) అయిన తర్వాత నన్ను ఎంపిక చేసుకున్నారు. ఒక మంచి అవకాశం నా దగ్గరికి రావడంతో వెంటనే అంగీకరించాను.
ప్రశ్న) అవికా గొర్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?
స) ఆ అమ్మాయికి వచ్చిన అవార్డులు ఆమె ప్రతిభ గురించి చెప్తాయి, నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమి లేదు. హీరోయిన్ గా ఆమెకు రెండవ సినిమా. చిన్నప్పటి నుండి నటిస్తున్న అనుభవం వలన మా సినిమాలో అద్బుతంగా నటించింది. ఆ అమ్మాయితో కలసి నటించడం సంతోషంగా ఉంది.
ప్రశ్న) నంద్యాల రవి గారి డైరెక్షన్ గురించి చెప్పండి..?
స) షూటింగ్ ప్రారంభమైన సమయంలో కొంచం భయం ఉండేది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాలు మంచి హిట్టయ్యాయి. ఈ సినిమా కూడా బాగా రావాలని కోరుకునేవాడిని. ఎడిటింగ్ రూంలో సినిమా చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నంద్యాల రవి గారు అద్బుతంగా సినిమాను తెరకెక్కించారు. నాతో కొత్తగా చేయించారు.
ప్రశ్న) సినిమాలో హైలైట్స్ ఏంటి..?
స) ప్రతి ఒక్క అమ్మాయికి సినిమా చూసిన తర్వాత వాళ్ళ తండ్రి గుర్తొస్తారు. తండ్రికి కూతురు గుర్తొస్తుంది. క్లైమాక్స్ లో డైలాగులు సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తాయి. అవికా గొర్, రావు రమేష్ లు అద్బుతంగా నటించారు. కెఎం రాధాకృష్ణన్ స్వరపరిచిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. రీ రికార్డింగ్ కూడా బాగా చేశాడు.
ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి..?
స) ‘చింతకాయల రవి’ ఫేం యోగి దర్శకత్వం చేస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. 20 రోజులు షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలకు కొంచం భిన్నమైన సినిమా. నందిని రెడ్డి గారి దర్శకత్వంలో ఒకటి, సాయి అనే నూతన దర్శకుడితో మరొక సినిమా అంగీకరించాను.
ప్రశ్న) కెరీర్ ఆరంభంలోనే మీరు విజయవంతమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు..?
స) నేను నటించిన సినిమాలు విజయాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. రెస్పాన్సిబిలిటీ పెరిగింది. కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదే సమయంలో ఓ భయం కూడా ఉంది. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి.
ప్రశ్న) సినిమాలలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు..?
స) యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాకు ఇన్స్పిరేషన్. చాలా చిన్న వయసులో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు. అతనిలో ఓ కసి ఉంటుంది. డైలాగ్ డెలివరీ, నటనపై కమాండ్ నాకు చాలా ఇష్టం. ఇక సినిమాలలోకి రావడానికి ముఖ్య కారణం నాగార్జున గారు. చిన్నప్పటి నుండి నాగార్జున గారి అభిమాని.
ప్రశ్న) చివరగా.. ‘లక్ష్మీ… రావే మాఇంటికి’ సినిమాపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి..? లోపల టెన్షన్ పడుతున్నట్టు ఉన్నారు..?
స) ఈ సినిమాకు పని చేసిన అందరికీ లక్ష్మీ కటాక్షంతో పాటు మంచి పేరు లభించాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో..? అని చిన్న టెన్షన్ ఉండండి. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది. ప్లాప్ సినిమా అయితే గొడవే లేదు. ఎందుకంటే, మనకి సినిమా గురించి ముందే తెలిసిపోతుంది కాబట్టి పెద్దగా ఆలోచించం. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.
CLICK HERE FOR ENGLISH INTERVIEW