ఇంటర్వ్యూ : వివి వినాయక్ – బెల్లంకొండ శ్రీనివాస్ మంచి కమర్షియల్ హీరో అవుతాడు.

ఇంటర్వ్యూ : వివి వినాయక్ – బెల్లంకొండ శ్రీనివాస్ మంచి కమర్షియల్ హీరో అవుతాడు.

Published on Jul 8, 2014 7:50 PM IST

VV-Vinayak
ప్రస్తుతతరం అగ్ర దర్శకులలో వివి వినాయక్ ఒకరు. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన వరుస విజయాల వినాయక్ తొలిసారిగా ‘అల్లుడు శీను’ చిత్రం ద్వారా ఒక కొత్త హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసే భాధ్యతను తీసుకున్నారు. అతనే బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. కమర్షియల్ అంశాలతో పాటు కామెడీని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న ఈ దర్శకుడు ‘అల్లుడు శీను’ సినిమా గురించి చెప్పిన విశేషాలు మీకోసం..

ప్రశ్న) కొత్త హీరోతో సినిమా అంటే రిస్క్ అనిపించలేదా..?

స) ‘అల్లుడు శీను’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ను పరిచయం చేయడం నా భాద్యతగా భావించాను. అది నా ధర్మం కూడా. ‘ఆది’ సినిమాతో నన్ను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్ గారు వాళ్ళబ్బాయిని నా చేతుల మీదుగా పరిచయం చేయాలని అడిగినపుడు వెంటనే ఓకే చెప్పాను. కొత్త హీరో, రిస్క్ అనే విషయాలు ఆలోచించలేదు.

ప్రశ్న) ‘అల్లుడు శీను’ షూటింగ్ టైంలో ఏమైనా టెన్షన్ ఫీల్ అయ్యారా..? కొత్త హీరో ఎలా చేశాడు..?

స) సినిమాలో సాయి శ్రీనివాస్ ఒక్కడే కొత్తవాడు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సమంత, తమన్నా ఇలా సినిమాలో అందరూ చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్న నటులు. షూటింగ్ ప్రారంభించిన ఫస్ట్ 2 డేస్ కొంచం ఎలా చేస్తాడో..? అని అనుకున్నాను. సాయి అందరితో బాగా కలసిపోయాడు. సీనియర్ నటులతో ఎటువంటి ఇబ్బంది లేకుండా, టెన్షన్ పడకుండా చాలా బాగా చేశాడు. సినిమా చూస్తుంటే మీకు ఒక కొత్త హీరోని చూసిన ఫీలింగ్ రాదు. అంత బాగా చేశాడు. మంచి డాన్సర్, ఫైటర్, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా చేశాడు. ఈ కుర్రాడిలో నేను గమనించిన విషయం ఏమిటంటే కమర్షియల్ సినిమాల్లోనే కాదు ‘శివపుత్రుడు’ లాంటి ప్రయోగాత్మక సినిమాల్లో కూడా మంచి నటనను కనబరచగలడు.

ప్రశ్న) ‘అల్లుడు శీను’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు..? కథ ఏంటి..?

స) సినిమాలో హీరో ఒక అనాధ. అతని పేరు శీను. ప్రకాష్ రాజ్ అతడిని చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు. ప్రకాష్ రాజ్ హీరోని అల్లుడు.. అల్లుడు.. అని పిలుస్తాడు. అందుకే ‘అల్లుడు శీను’ టైటిల్ పెట్టాం. దీనిపై బ్రహ్మానందంతో ఒక కామెడీ ట్రాక్ కూడా పెట్టాం. ఒక అనుకోని సంఘటన వల్ల హీరో నింద పడాల్సి వస్తుంది. ప్రకాష్ రాజ్ కు అన్యాయం జరుగుతుంది. తనపై పడిన నిందను చెరిపేస్తూ ప్రకాష్ రాజ్ కు జరిగిన అన్యాయంపై ఎలా స్పందించాడు అనేది కథ. లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ప్రశ్న) సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను తీసుకోవడానికి కారణం..?

స) ప్రస్తుతం యూత్ అందరూ సమంతను ఇష్టపడుతున్నారు. సాయి, సమంతలపై ఫోటోషూట్ చేశాం. ఇద్దరి పెయిర్ బాగుంది. హీరోయిన్ సినిమాకి అడ్వాంటేజ్ అవ్వాలని సమంతను తీసుకోవడం జరిగింది. తమన్నాను తీసుకోవాలనే నిర్ణయం మాత్రం సురేష్ గారిదే. మేం అడగ్గానే స్పెషల్ సాంగ్ చేయడం కోసం ఓకే చెప్పిన తమన్నాకు థాంక్స్. జపాన్లో తీసిన ఒక పాట కోసం సమంత చాలా కష్టపడింది. మైనస్ డిగ్రీల చలిలో డాన్సు చేసింది, తనకు కూడా థాంక్స్.

ప్రశ్న) వినాయక్ సినిమాలంటే సుమో చేజ్, భారి ఫైట్స్, హీరో డైలాగులకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ‘అల్లుడు శీను’ ఎలా ఉండబోతుంది..?

స) నా గత సినిమాలలో ఉన్నట్టే ఈ సినిమాలో కూడా అన్ని కమర్షియల్ హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. కొత్త హీరో కాబట్టి స్టార్ హీరోలు చెప్పే డైలాగులను పెట్టలేదు. ప్రతి సీన్ ప్రేక్షకులను నవ్విస్తూ.. అందంగా సాగిపోతుంది. మొదట సినిమాలో చేజ్, సుమో బ్లాస్టింగ్ లేకుండా తీయాలనుకున్నాను. ఎయిర్ పోర్ట్ లో ఒక ఇమ్మిగ్రేషన్ అధికారి కలసి ఈసారి సుమోలు బాగా పేల్చాలి. లేకపోతే ఫీల్ అవుతాం అన్నారు. అభిమానులు నా సినిమాలో ఇవి లేకపోతే ఫీల్ అవుతారని క్లైమాక్స్ ఫైట్లో ఒక చేజ్ ప్లాన్ చేశాం.

ప్రశ్న) సినిమా ఫస్ట్ కాపీ చూశారా..?

స) నేను మాత్రమే కాదు, మా యూనిట్ మొత్తం చూసాం, అలాగే సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్’తో ఉన్నాం. సినిమా విడుదల కోసం చాలా ఆత్రుతతో వెయిట్ చేస్తున్నాం. బెల్లంకొండ సురేష్ గారి ఫ్యామిలీ కూడా సినిమాను చూశారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. శ్రీనివాస్ ప్రేక్షకులకు నచ్చుతాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మంచి కమర్షియల్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది.

ప్రశ్న) చిరంజీవి గారి 150వ సినిమాకు మీరే దర్శకుడని ప్రచారంలో ఉంది..?

స) ప్రస్తుతం చిరంజీవి గారు చాలా కథలు వింటున్నారు. నాకు చిరంజీవి గారి సినిమాకు దర్శకత్వం వహించాలని ఉంది. కథ ఎలా ఉండాలి..? దర్శకుడు ఎవరు..? అనే విషయంపై చిరంజీవి గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. చాలా ప్రాసెస్ ఉంది. నాకైతే చిరంజీవి గారిని ఏదో చిన్న ఫ్లాష్ బ్యాక్, సరదా సరదాగా సాగిపోయే సినిమాలో చూడాలని ఉంది.

ప్రశ్న) నిర్మాతగా మారే ఉద్దేశ్యం ఏమైనా ఉందా..?

స) ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఒక సంవత్సరం తర్వాత లేదా మరో రెండు రెండు సంవత్సరాల తర్వాత నిర్మాతగా మారే ఉద్దేశం ఉంది. లోబడ్జెట్ లో సినిమాలు నిర్మించాలి అనుకుంటున్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అని కాదు, ఎవరైనా మంచి కథతో వస్తే సినిమాలు నిర్మిస్తాం.

అంతటితో వివి వినాయక్ తో మా ఇంటర్వ్యూని ముగించాం.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు