ప్రత్యేక ఇంటర్వ్యూ : చిన్ని చరణ్ – ప్రేక్షకుడు పెట్టే డబ్బుకంటే వాళ్ళ టైంకె ఎక్కువ విలువ ఇస్తాను.

ప్రత్యేక ఇంటర్వ్యూ : చిన్ని చరణ్ – ప్రేక్షకుడు పెట్టే డబ్బుకంటే వాళ్ళ టైంకె ఎక్కువ విలువ ఇస్తాను.

Published on May 8, 2014 12:02 PM IST

chinni-charan
పాటల రచయితగా ఇండస్ట్రీకి పరిచయమై ‘రచ్చ’, ‘డాన్’, ‘కేడీ’, ‘స్నేహ గీతం’, ‘స్టైల్’ లాంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ రాసిన చిన్ని చరణ్ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. చిన్న చిన్న సినిమాలకు మ్యూజిక్ చేస్తూ సరైన గుర్తింపు రాకపోవడంతో తనలోని మరో టాలెంట్ ని బయట పెట్టి రైటర్, డైరెక్టర్ గా చేసిన ప్రయత్నమే ‘అదీలెక్క’. చిన్ని చరణ్ దర్శకుడిగా మారి చేస్తున్న ఈ అదీలెక్క సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం..

ప్రశ్న) అసలు మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?

స) మాది చాలా బీద కుటుంబం. కాలేజ్ చదువుకునే రోజుల్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి ఎప్పటికి ఓ మంచి స్థాయికి వస్తాం. అసలు అది జరిగేపనేనా అని ఆలోచించి.. నేను కాలేజ్ మానేసి హైదరాబాద్ వచ్చేసాను. అలా వచ్చిన నాకు ఉన్న ఒక్కటే టార్గెట్ నేను రాసే పాటలు సినిమాల్లో రావాలి. అలా చేసే వాడిని లిరిసిస్ట్ అంటారని కూడా అప్పటికి నాకు తెలియదు. ఆ టైంలోనే నేను ‘ఆయుధం’ సినిమా కోసం ‘ఇదేమిటమ్మ మాయా మాయా’ పాట రాశాను. ఆ పాట హిట్ అవ్వడంతో అక్కడి నుండి నా సినిమా ప్రయాణం మొదలైంది.

ప్రశ్న) పాటల రచయిత నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యారు?

స) ఆయుధం కోసం వందేమాతరం శ్రీనివాస్ గారి దగ్గర పనిచేసినప్పుడు నేను పాటలే ఎందుకు రాయాలి నేనే మ్యూజిక్ చెయ్యచ్చు కదా అని అనిపించింది. దాంతో అక్కడి నుండి మణిశర్మ గారి దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరం పనిచేసి కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత యువన్ శంకర్ రాజా గారి దగ్గర 1 సంవత్సరం పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ కి వచ్చి ఆఫర్స్ ట్రై చేసాను. మొదట్లోనే చాలా పెద్ద సినిమాలకు అవకాశం వచ్చింది కానీ ఎందుకో తెలియదు చివరి నిమిషంలో నన్ను మార్చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలకు మ్యూజిక్ చేసాను.

ప్రశ్న) మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంకా సరైన బ్రేక్ రాని టైంలో డైరెక్టర్ ఎందుకయ్యారు?

స) నాకు మామూలుగా కష్టపడి పనిచేయడమే తెలుసు తప్ప వెళ్లి అందరి దగ్గరికి తిరిగి అవకాశాలు తెచ్చుకోవడం తెలియదు. అందుకే నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. అలాగే నేను ఒక్కడినే కాకుండా ఇంటి దగ్గర నా చుట్టూ ఉండే అందరినీ వారికి ఏదో లైఫ్ ఇస్తానని తీసుకొచ్చేసాను. వారందరూ నాపైనే డిపెండెంట్ అయి ఉన్నారు. కావున ఏదో చెయ్యాలి అని ఒక సంవత్సరం ఆలోచించాక మనమే కథ రాద్దాం అని రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని ఈ కథ రాసాను. మొదట వేరే దర్శకులని అనుకున్నాం కానీ వాళ్ళు కథకి సరైన న్యాయం చేసేలా అనిపించలేదు. ఇక అందరూ నన్నే చేయమనడంతో ట్రై చేశాను. ఇక మీరు చూసి చెప్పాలి.

ప్రశ్న) డైరెక్టర్ గా మారడమే పెద్ద రిస్క్, అది సరిపోదు అన్నట్టు మళ్ళీ ఎందుకు నిర్మాతగా కూడా మీరే రిస్క్ తీసుకున్నారు?

స) అది కూడా అనుకోకుండా జరిగిందే.. ముందు వేరే నిర్మాతలు ఈ సినిమా చేస్తాం అన్నారు కానీ వాళ్లు చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో ఈ సినిమాని ఆపలేక ఎలాగైనా పూర్తి చేయాలని నేనే సొంత బ్యానర్ లో చేసాను. నాతో పాటు ఈ సినిమాకి మా బావ అయిన ప్రవీణ్ కూడా ఈ సినిమాకి నిర్మాత. తను లండన్ లో ఉన్నాసరే మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేనున్నా అంటూ పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా మా టీం తరపున తనకి థాంక్స్ చెబుతున్నాం.

ప్రశ్న) ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా మీ తమ్ముడు మహిని ఎందుకు తీసుకున్నారు?

స) ఈ విషయంలో కూడా ముందు వేరే వాళ్ళని అనుకున్నాం వాళ్లకి కథ కూడా చెప్పాను.. వాళ్ళకి నచ్చలేదో లేక చేయడం ఇష్టం లేదో నో అనేసారు. మా తమ్ముడు మహి నా స్టూడియోలోనే సౌండ్ ఇంజనీర్ గా చేస్తాడు. తనకి యాక్టర్ అవ్వాలని ఉండేది. నాకు ఎప్పుడో ఓ సారి చెప్పాడు, అది గుర్తుకు వచ్చి నా పాత్రకి బాగా సెట్ అవుతాడు అని తెలిసి ఫైనల్ గా తనని తీసుకున్నాం.

ప్రశ్న) ఈ సినిమాలో చేసిన మరో హీరో మనోజ్ నందం, విలన్ పాత్ర చేసిన నిక్కి మరియు హీరోయిన్స్ గురించి చెప్పండి?

స) మనోజ్ నాకు ముందు నుంచే తెలుసు.. మా సినిమాకి కమర్షియల్ గా అతను హెల్ప్ అవుతాడు మరియు సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర ఉంటుంది దానికి మ్యాచ్ అయ్యేలా హీరో ఉండాలి అని అతన్ని తీసుకున్నాం. మనోజ్ కూడా కథ నచ్చే ఈ సినిమా చేసాడు. అలాగే సినిమాలో చేసిన హీరోయిన్స్ కూడా కొత్తవారే, వాళ్ళు కూడా బాగా చేసారు. విలన్ పాత్ర నిక్కికి బాగా సెట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత అందరూ అతన్ని జూనియర్ సుధీప్ అంటారని నమ్ముతున్నాను.

ప్రశ్న) అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది?

స) ఈ సినిమా అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. మనోజ్ పాత్ర టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, మహి పాత్ర మన సాంప్రదాయాలకు విలువను ఇచ్చేలా, పల్లెటూరి విలువను చెప్పేలా ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాని కమర్షియల్ గా చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా.

ప్రశ్న) సుద్దాల అశోక్ తేజ, కృష్ణుడు పాత్రల గురించి చెప్పండి?

స) సుద్దాల ఆశోక్ తేజ గారిది చిన్న పాత్ర అయినా అందరినీ ఆలోజింపజేసేలా ఉంటుంది. ఆయన సినిమాలో కూడా ఓ పాటల రచయితలా కనిపిస్తారు. అలాగే కృష్ణుడు పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అతని పాత్రలో ఒక సస్పెన్స్ ఉంది అది మీరు స్క్రీన్ పైనే చూడాలి.

ప్రశ్న) కామెడీకి పెద్ద పీట వేసినట్టున్నారు.. ఆ కామెడీ కథలో భాగమా లేక సెపరేట్ ట్రాక్స్ వేసారా? అలాగే ఇందులో భూతు కామెడీ ఉండే అవకాశం ఉందా?

స) అవును ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ కామెడీ కథలో భాగమే తప్ప సెపరేట్ ట్రాక్ కాదు. అలాగే సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి అన్నీ కథలో భాగమే. అలాగే ఈ సినిమాలో ఎలాంటి భూతు కామెడీ ఉండదు. కుటుంబసమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా ‘అదీలెక్క’.

ప్రశ్న) ఇక నుంచి డైరెక్టర్ గా కొనసాగానున్నారా? తదుపరి చేయబోయే సినిమాలు ఏమన్నా ఉన్నాయా?

స) ఇక డైరెక్టర్ గానే చేయాలి అని ఏమీ అనుకోలేదండి.. ప్రస్తుతం రెండు సినిమాలు చేయాలని అనుకున్నాం. అవే ‘తీన్ పత్తా’, ‘రిఫ్రెష్’. కానీ ఈ సినిమా రిజల్ట్ ని బట్టి అవి ఎప్పుడు మొదలుతాయనేది చెప్తాను.

ప్రశ్న) డైరెక్టర్ గా మారిపోయారు ఇక మ్యూజిక్ చేస్తారా?

స) అయ్యో ఎందుకు చేయనండి.. నా మొదటి ప్రాధాన్యత సంగీతానికే. తర్వాతే డైరెక్షన్. మంచి ఆఫర్స్ వస్తే మళ్ళీ డైరెక్షన్ చెయ్యను. కానీ నాకు మామూలుగానే ఆఫర్స్ తక్కువ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయానని ఎవరూ నా దగ్గరికి రారేమో(నవ్వుతూ)..

ప్రశ్న) చివరిగా ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకి ఏమి చెప్పాలనుకుంటారు?

స) ప్రస్తుతం రాష్ట్రం ఎన్నికలతో, ఎగ్జామ్స్ తో, ఎండలతో వేడెక్కి ఉన్నారు. ఆ వేడి నుంచి కాస్త రిలాక్స్ అవుదాం అనుకోని వచ్చే వారు ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఈ సినిమా ఉంటుంది. బాగా నవ్వుకునే కామెడీ, మనం మరిచిపోతున్న సాంప్రదాయాలను, పల్లెటూరి వాతావరణాన్ని ఒకసారి నెమరువేసుకొని హ్యాపీగా బయటకి వచ్చే సినిమా ఇది. నేను ‘థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు పెట్టే డబ్బు కంటే వారు ఖర్చు పెట్టే సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’. కావున ఈ సినిమా చూసిన ప్రేక్షకులు వారి 2 గంటల సమయాన్ని వృధా చేయలేదు అని మాత్రం ఫీలవుతారని గట్టిగా నమ్ముతున్నాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి తన మొదటి ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాం..

ఇంటర్వ్యూ– రాఘవ

 

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు