స్వతహాగా ఇంజనీరింగ్ కుర్రాడు.. అందరిలానే సాఫ్ట్ వేర్ బాటపట్టాడు కానీ సినిమా మీద మక్కువతో సాఫ్ట్ వేర్ కి బై చెప్పి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ‘స్నేహ గీతం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే ప్రస్తుతం నిర్మాతగా పలువురు యంగ్ టాలెంట్ పీపుల్ కి అవకాశాలు ఇస్తున్నాడు. మధుర శ్రీధర్ నిర్మాణ సంస్థలో త్వరలో మన ముందుకు రానున్న సినిమా ‘లేడీస్ & జెంటిల్ మెన్’. ఈ మూవీ జనవరి 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేము మధుర శ్రీధర్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆయన లేడీస్ & జెంటిల్ మెన్ లాంటి బోల్డ్ కాన్సెప్ట్ తో మూవీ చెయ్యడానికి గల కారణం మరియు తన తదుపరి సినిమాల గురించి తెలియజేసిన విశేషాలు మీకోసం..
ప్రశ్న) అసలు లేడీస్ & జెంటిల్ మెన్ అనే సినిమా ఎలా మొదలైంది.? మీరు ఈ సినిమా చేయడానికి గల కారణం ఏమిటి.?
స) బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా తర్వాత ఓ మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాని నిర్మించాలి అనుకున్నాను. స్వతహాగా తమిళ్, మలయాళం, మరాఠీలలోలానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు రావాలని కోరుకునే వాన్ని నేను.. అదే టైంలోనే సంజీవ్ రెడ్డి ఈ సినిమా కథని చెప్పాడు. సైబర్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో సినిమా మొదలు పెట్టాం.
ప్రశ్న) మీరూ రైటర్, డైరెక్టర్.. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మీరెంతవరకూ ఇన్వాల్వ్ అయ్యారు.?
స) ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నా ఇన్వాల్వ్ మెంట్ ఏమీలేదు. ఈ సినిమా పరంగా నేను ఒక మెంటార్ ని మాత్రమే.. ఏది మంచి ఏది చెడు అని చెప్పడం, అలాగే ఒక మార్కెటింగ్ మీద ఐడియా ఉంది కాబట్టి ఎంతలో చెయ్యాలి, సినిమా లెంగ్త్ ఎలా ఉండాలనే విషయాలు మాత్రమే చెప్పాను.
ప్రశ్న) ఈ సినిమా కోసం రైటర్, డైరెక్టర్ గా కొత్తవారికే చాన్స్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి.? అలాగే నటీనటులను కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న వారిని తీసుకోవడానికి గల కారణం ఏమిటి.?
స) ఈ సినిమాకి కథ అందించిన రైటర్ సంజీవ్ రెడ్డి, డైరెక్టర్ మంజునాథ్ ఇద్దరూ నా దగ్గర పనిచేసినవారే.. ఇద్దరూ బాగా హార్డ్ వర్క్ చేస్తారు. నా పరంగా హార్డ్ వర్క్ చేసే మనస్తత్వం ఉంటే చాలు, క్రియేటివిటీ, టాలెంట్ అనేవి ఆటోమాటిక్ గా వాళ్ళలో ఉంటాయని నమ్ముతాను. అందుకే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను. వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి చేసారు. సినిమా అవుట్ పుట్ చూసాను, అనుకున్న కాన్సెప్ట్ కి పూర్తి న్యాయం చేసారు. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాలో హీరోయిజం అనేది ఏమీ ఉండదు.. ఈ మూవీకి కథే హీరో.. అందుకే ఈ సినిమా కథ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో పెద్ద స్టార్స్ ని కాకుండా కొత్తవారినే తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.
ప్రశ్న) ఈ సినిమా ట్రైలర్, పోస్టర్ చూస్తుంటే ఓ బోల్డ్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేసారని అనిపిస్తోంది.? మరి ఇలాంటి బోల్డ్ సినిమా టాలీవుడ్ ని ఎంతవరకూ ఎఫెక్ట్ చేస్తుందని అంటారు.?
స) మీరన్నది నిజమే.. ఇదొక బోల్డ్ అండ్ హార్డ్ హిట్టింగ్ కథ..నాకు తెలిసి గత 5 సంవత్సరాల్లో ఇలాంటి ఓ బోల్డ్ అండ్ హార్డ్ హిట్టింగ్ సినిమా రాలేదు. అలాగే కచ్చితంగా ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త సినిమాలకు నాంది పలుకుతుంది. మాయ సినిమా ఇక్కడ కొంచెం ఆడకపోయినా, ఇప్పుడు బాలీవుడ్ లో మర్డర్ 4గా వెళ్తోంది. ఆ సినిమాకి కొత్త కాన్సెప్ట్ ఇవ్వడం వలెనే బాలీవుడ్ కి వెళుతోంది. నా పరంగా మనం కనుక ఓ కొత్త పాయింట్ తో కథని రాసుకోగలిగితే ఆ సినిమాకి ఇతర భాషల్లో కూడా డిమాండ్ ఉంటుంది. ఆ విషయంలో నాకు మాయ సినిమా ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది.
ప్రశ్న) ఈ సినిమా ద్వారా మీరు చెప్పనున్న సరికొత్త పాయింట్ ఏమిటి.?
స) ఈ సినిమాలో మేము చెబుతున్న కొత్త పాయింట్ ఏమిటి అంటే ‘ఇంటర్నెట్ అనేది మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది’. అందుకే మూడు డిఫరెంట్ స్టొరీలను ఎంచుకున్నాం. ఒక స్టూడెంట్ తన సహచర్యం కోసం, ఒక కాల్ సెంటర్ ఉద్యోగి మనీ కోసం, ఒక హౌస్ వైఫ్ తన హ్యాపీ నెస్ కోసం వెతుకున్న ముగ్గురు ఇంటర్నెట్ యూజర్స్ కథే ఇది. పూరి జగన్నాధ్ ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అందుకే సినిమా మొదలవ్వగానే పూరి వాయిస్ ఓవర్ లో ఓ డైలాగ్ ఉంటుంది ‘ఉదయం లేవగానే పేస్ కూడా కడక్కుండానే ఫేస్ బుక్ చూస్తారు, వాటర్ కూడా తాగకుండానే వాట్సప్ చెక్ చేస్తుంటారు’. ఈ డైలాగ్ ఈ సినిమా కాన్సెప్ట్ ని రెప్రజెంట్ చేస్తుంది.
ప్రశ్న) మీ ప్రకారం లేడీస్ & జెంటిల్ మెన్ సినిమా మేజర్ హైలైట్స్ ఏమవుతాయి.?
స) ఈ సినిమా హైలైట్స్ అంటే చూసే ఆడియన్స్ ఓ కొత్త జోనర్ మూవీ చూస్తారు. ఎప్పుడు అవుట్ అఫ్ ది బాక్స్ లో సినిమా రావట్లేదని చాలా మంది అంటూ ఉంటారు. కచ్చితంగా ఇది టాలీవుడ్ కి అవుట్ అఫ్ ది బాక్స్ మూవీ అవుతుంది. మనకు ఆడియన్స్ పరంగా ఎ,బి, సి సెంటర్స్ అనే లైన్స్ ఉన్నాయి.. కానీ లేడీస్ & జెంటిల్ మెన్ లాంటి కాన్సెప్ట్ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తే ఎ,బి,సి సెంటర్స్ అనే తేడాని చెరిపేసే మొదటి సినిమా అవుతుంది.
ప్రశ్న) ఈ మధ్య డైరెక్టర్ గా కంటే నిర్మాతగానే ఎక్కువ బిజీ అయినట్టున్నారు.? దానికి కారణం ఏమిటి.?
స) బ్యాక్ బెంచ్ స్టూడెంట్ తర్వాత ప్రొడక్షన్ వైపు అడుగెయ్యాలనుకున్నాను. వరుసగా మాయ, లేడీస్ & జెంటిల్ మెన్, ఓం మంగళం మంగళం సినిమాలలో బిజీ అవ్వడం వలన డైరెక్షన్ కి కాస్త గ్యాప్ ఇచ్చాను. అలాగే ఈ సారి నేను డైరెక్టర్ గా చేసే సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాను. నన్ను ఎగ్జైట్ చేసే కథ రాగానే సినిమా చేస్తాను. ఓం మంగళం మంగళం తర్వాత నా డైరెక్షన్ లో వచ్చే సినిమా గురించి ఆలోచిస్తాను.
ప్రశ్న) మీరొక డైరెక్టర్ మరియు నిర్మాత.. ఈ రెండిటిలో మీకు ఎక్కువగా కంఫర్టబుల్ ఏది.?
స) నా వరకూ అయితే రెండూ ఒకటే.. రెండూ కంఫర్టబుల్ గానే అనిపిస్తాయి. నా పరంగా ప్రతి ఒక్క క్రియేటర్ కి ఓ ముగింపు డే ఉంటుంది. అప్పుడు నేను కథని చెప్పడంలో కాస్త తడబడచ్చు. కానీ నేను ఫిల్మ్ మేకర్ గా ఉండాలి కాబట్టి ప్రొడక్షన్ కూడా చేస్తున్నాను. ఉదాహరణకి కరణ్ జోహార్, రామ్ గోపాల్ వర్మ, సంజయ్ లీల భన్సాలి అప్పుడప్పుడు వారికి నచ్చిన కథలకి దర్శకత్వం వస్తూనే మధ్యలో తమ ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తుంటారు. వారిలానే నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. దానికోసమే డైరెక్టర్ గా, ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తున్నాను.
ప్రశ్న) మీ డైరెక్టర్ గా చేయాలనుకున్న ‘దాన కర్ణ’ సినిమా ఏమయ్యింది.?
స) ‘దాన కర్ణ’ సినిమా ఆగిపోలేదండి, ఆ సినిమా కథకి సరిపోయే హీరో సమస్య అవుతోంది. పలువురు హీరోలు ఆ కాన్సెప్ట్ సినిమా చేయడానికి అంత సముఖత చూపలేదు. అలా అని కొత్త వారితో చేద్దామా అంటే మాయ తర్వాత అంత ధైర్యం చేయలేకున్నాను. ఇంకో 2,3 సంవత్సరాల్లో మల్టీ ప్లెక్స్ కల్చర్ బాగా పెరుగుతుంది. అప్పుడు ఎలాంటి కథనైనా ఆదరిస్తారు. అందుకే సరైన టైం, సరైన హీరో కోసం ఎదురు చూస్తున్నాను.
ప్రశ్న) తెలుగు నుంచి హిందీకి వెళ్ళిన మాయ సినిమా స్టేటస్ ఏంటి.? మహేష్ భట్ ఏమన్నా మార్పులు చేసారా.?
స) మహేష్ భట్ పెద్దగా మార్పులు ఏమీ చెయ్యలేదు. ఓవరాల్ గా ఒక నాలుగైదు మార్పులు చేసారు అంతే కానీ కథకి మరింత హాట్ నెస్, గ్లామర్ ని జత చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఫిబ్రవరి చివరికల్లా ఆ సినిమా నటీనటుల వివరాలు మరియు సెట్స్ పైకి వెళ్ళే వివరాలు తెలుస్తాయి.
ప్రశ్న) ఓ బోల్డ్ కాన్సెప్ట్ ని అటెంప్ట్ చేసారు, మరి రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ బాగా టెన్షన్ పడుతున్నారు.?
స) నవ్వులు… నిజం చెప్పాలి అంటే రిలీజ్ విషయంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉన్నాను.. సినిమాని తలచుకున్నప్పుడు చాలా నమ్మకంగా ఉన్నాను, కానీ ఓ బోల్డ్ కాన్సెప్ట్ చెబుతున్నాం ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే చిన్న టెన్షన్ ఉంది. కావున రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నాను..
ప్రశ్న) చివరిగా ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు.?
స) ‘లేడీస్ & జెంటిల్ మెన్’ అనే సినిమా ఓ బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. సినిమాలో అనవసరపు ట్రాక్స్ ఏమీ లేకుండా, సుత్తి లేకుండా షార్ట్ అండ్ స్వీట్ గా 1 గంట 56 నిమిషాల్లో అనుకున్న కాన్సెప్ట్ ని చెప్పి ముగించేసాము. ఓ కొత్త కాన్సెప్ట్ మీద వచ్చే సినిమాల కోసం ఎదురు చూస్తున్నవారు, రెగ్యులర్ సినిమాలకు విసిగిపోయిన వారు వెంటనే వెళ్లి చూసే సినిమా, కచ్చితంగా వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ కి చూపించాలనుకుంటున్నారు. మేము ఓ కొత్త కాన్సెప్ట్ తీసాము దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం..
అంతటితో మధుర శ్రీధర్ తో మా ప్రత్యేక ఇంటర్వ్యూని ముగించి, సినిమా మంచి విజయాన్ని విజయాన్ని అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..
CLICK HERE FOR ENGLISH INTERVIEW