సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ సీనియర్ విలక్షణ నటుల్లో నాజర్ కూడా ఒకరు. తన 20 ఏళ్ళ కెరీర్లో ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలని పోషించి, ఎన్నో అవార్డ్స్ ను కూడా అందుకున్నారు. నాజర్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెగ్యులర్ సినిమాలు కాకుండా టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాలో నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుకోకుండా కలిసిన నాజర్ గారితో కాసేపు ముచ్చటించాము.. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ముందుగా, ఇటీవలే యాక్సిడెంట్ కి గురైన మీ అబ్బాయి ఎలా కోలుకుంటున్నాడు.?
స) ఆ దేవుడి దయ వల్ల చాలా త్వరగానే కోలుకుంటున్నాడు..
ప్రశ్న) గతంలో మీరు చాలా నెగటివ్ మరియు సీరియస్ రోల్స్ చేసిన మిమ్మల్ని ‘బాద్షా’ సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ చేయడానికి ప్రోత్సహించింది ఎవరు.?
స) ‘బాద్షా’ సినిమాలో నేను చేసిన పాత్రకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, నేను ఈ పాత్ర చేయడానికి ప్రధమ కారణం శ్రీను వైట్ల. చెప్పాలంటే శ్రీను వైట్ల ఐడియానే అది. అతనే నన్ను కామెడీ పాత్రలకి పరిచయం చేసాడు..
ప్రశ్న) ప్రస్తుతం మీరు తెలుగులో చేస్తున్న పాత్రలకు మీరే డబ్బింగ్ చెప్పుకుంటున్నారా.?
స) అవును..’బాద్షా’ తర్వాత నుంచి నేను చేస్తున్న అన్ని తెలుగు సినిమాలకు స్వయంగా నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను..
ప్రశ్న) ‘ఆగడు’లో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) ‘దూకుడు’, ‘బాద్షా’ తర్వాత శ్రీను వైట్ల మరో సూపర్బ్ పాత్రని నాకు ‘ఆగడు’లో డిజైన్ చేసారు. ఈ సినిమాలో కూడా నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. కానీ ఇందులో నా పాత్రని తీర్చిదిద్దిన విధానం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ప్రశ్న) మరి బాహుబలి గురించి చెప్పండి.. ఈ పీరియాడిక్ సినిమాలో మీరు ఎలాంటి పాత్ర చేస్తున్నారు.?
స) ‘బాహుబలి’ సినిమాలో రానాకి తండ్రిగా నటిస్తున్నాను. సినిమాలో ఉండే కీలక పాత్రల్లో నాది ఒకటి అవుతుంది.
ప్రశ్న) బాహుబలి సినిమా ఎలా రెడీ అవుతోంది. అలాగే రాజమౌళితో కలిసి పనిచేయడం ఎలా ఉంది.?
స) బాహుబలి సినిమా చాలా బాగా రెడీ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. రాజమౌళి తో నేను చేస్తున్న మూడవ సినిమా ఇది. రాజమౌళి లాంటి జీనియస్ లతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది.
ప్రశ్న) ఈ వయసులో కూడా మీరు ఇంత ఎనర్జీగా, కంటిన్యూగా వర్క్ చేయడానికి గల కారణం ఏమిటి.?
స) చాలా చోట్ల నాకు ఇదే ప్రశ్న ఎదురవుతోంది, అలా ఎందుకు అడుగుతున్నారా అనేది నాకు అర్థం కావడం లేదు. మేము ఈ ఆర్ట్ ని లవ్ చేస్తాము, అందుకే ఎంతో ఇష్టంగా రోజూ పనిచేస్తాం. అలా పని చేసేటప్పుడు బోర్ కొట్టడం, అలసిపోవడం అనేది ఉండదు..
ప్రశ్న) మీ బాలీవుడ్ కెరీర్ గురించి చెప్పండి.?
స) ఎప్పుడైతే నాకు కొన్ని ఆసక్తికరమైన ఆఫర్స్ వస్తాయో అప్పుడు నేను బాలీవుడ్ వెళ్లి సినిమాలు చేసి వచ్చేస్తాను. అది పక్కన పెడితే ఇక్కడ ఎప్పుడూ నా సినిమాలతో బిజీగా ఉంటాను.
ప్రశ్న) మీరు చేస్తున్న తదుపరి సినిమాలు ఏమున్నాయి.?
స) రాజమౌళి ‘బాహుబలి’, ఎన్.టి.ఆర్ ‘రభస’, మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయి..
అంతటితో నాజర్ తో మా ఇంటర్వ్యూని ముగించి ఆయన కెరీర్ ఇలానే ముందుకు సాగాలని అల్ ది బెస్ట్ చెప్పాము..