ప్రత్యేక ఇంటర్వ్యూ : శశాంక్ వెన్నెలకంటి – ఎన్.టి.ఆర్ మొదటి సినిమాలో ఎన్.టి.ఆర్ కి డబ్బింగ్ చెప్పాను.!

ప్రత్యేక ఇంటర్వ్యూ : శశాంక్ వెన్నెలకంటి – ఎన్.టి.ఆర్ మొదటి సినిమాలో ఎన్.టి.ఆర్ కి డబ్బింగ్ చెప్పాను.!

Published on Jun 23, 2014 1:24 PM IST

Sashankh-Vennalkeanti
టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు కూడా బాగానే ప్రాముఖ్యత ఉంది. కచ్చితంగా ప్రతి నెలా రెండు, మూడు డబ్బింగ్ సినిమాలు అన్నా విడుదలవుతాయి. ఇలాంటి డబ్బింగ్ సినిమాలతో 90% సంబంధం ఉన్న వ్యక్తి శశాంక్ వెన్నెలకంటి. ‘గజినీ’ సినిమా నుంచి గత వారం వచ్చిన ‘ఇంద్రుడు’ సినిమా వరకూ శశాంక్ ఏదో రకంగా డబ్బింగ్ సినిమాలకు పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకూ శశాంక్ దాదాపు 100 కి పైగా సినిమాలకి డైలాగ్స్ మరియు డబ్బింగ్ చెప్పారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన ఫేమస్ లిరిసిస్ట్ వెన్నెలకంటి కుమారుడు. డైలాగ్ రైటర్ గా ప్రస్తుతం చెన్నైలో బిజీగా ఉన్న శశాంక్ వెన్నెలకంటితో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీ కెరీర్ ప్రారంభం గురించి చెప్పండి.. అసలు రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎలా ఎంటర్ అయ్యారు?

స) వెన్నెలకంటి కుమారుడిగా చెన్నైలో నేను అందరికీ తెలుసు. అలా అనుకోకుండానే నేను సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయిపోయాను. నేను చాలా చిన్నతనం నుండే డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాను. మొదట్లో శింబుకి చెప్పాను, ఎన్.టి.ఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’లో కొన్ని చోట్ల ఎన్.టి.ఆర్ కి డబ్బింగ్ చెప్పాను. అది కాకుండా నేను మంచి స్టూడెంట్, అలాగే బుక్ బాగా ఎక్కువగా చదివేవాన్ని. అలా రైటింగ్ మొదలుపెట్టాను. అలా కొద్ది రోజులకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా డైలాగ్స్ రాయడం కూడా మొదలు పెట్టాను.

ప్రశ్న) అసలు మీకు ‘గజినీ’ సినిమా అవకాశం ఎలా వచ్చింది?

స) ‘గజినీ’ కంటే ముందే చాలా సినిమాలకు పనిచేసాను కానీ ‘గజినీ’ నా లైఫ్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ‘గజినీ’ సినిమా తెలుగు వెర్షన్ ని నాన్నగారు పాటలు రాశారు, అలా నాకు డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అంతే కాకుండా అదే సంవత్సరం వచ్చిన ‘మన్మధ’, ‘పందెం కోడి’ సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వడంతో బాగా బిజీ అయిపోయాను.

ప్రశ్న) ఇప్పటి వరకూ మీకు బాగా టఫ్ గా అనిపించిన డబ్బింగ్ వాయిస్ ఎవరిది?

స) చాలా సినిమాలకు డబ్బింగ్ చాలా టఫ్ గా అనిపించింది. కానీ నాకు బాగా టఫ్ అనిపించినది మాత్రం విశ్వరూపం సినిమాలో రాహుల్ బోస్ కి వాయిస్ అందించినప్పుడే.. కమల్ హాసన్ గారు నన్ను చాలా ట్రైన్ చేసారు అలాగే డబ్బింగ్ కోసం చాలా వాయిస్ మాడ్యులేషన్స్ ట్రై చేసారు.

ప్రశ్న) డబ్బింగ్ సినిమాలకు డైలాగ్స్ ఎలా రాస్తారు. సినిమా మొత్తం చూసి సీన్ కి తగ్గట్టు రాస్తారా లేక లిప్ సింక్ అయ్యేలా రాస్తారా.?

స) నా డైలాగ్స్ అన్ని సీన్ మీద డిపెండెంట్ అయ్యి ఉంటాయి. కొన్ని చోట్ల నేను లిప్ సింక్ ని బట్టి రాయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల సీన్ కి తగ్గట్టు పంచ్ డైలాగ్స్ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకి సింగం లో సీన్ కి తగ్గట్టు పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ రాసాను.

ప్రశ్న) రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయ్యారు కానీ ఎందుకు ఇంకా డైరెక్షన్ వైపు అడుగులు వేయలేదు?

స) నేను యంగ్ గా ఉన్నప్పుడు జెమిని టీవీలో వచ్చే కొన్ని సీరియల్స్ లో నటించాను. అందులో ఒక సీరియల్ ని 30 ఎపిసోడ్స్ ని నేనే డైరెక్ట్ చేసాను. దాంతో డైరెక్షన్ మీద ఆసక్తి పెరగడంతో కమల్ హాసన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. ఆయన దగ్గర రెండు సినిమాలకు పనిచేసాను.

ప్రశ్న) కమల్ హాసన్ తో పనిచేయడం ఎలా ఉంది?

స) ఆయనలా ముందే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఉండే నటున్ని, డైరెక్టర్ ని నేను నా లైఫ్ లో చూడలేదు. నేను ఇప్పుడు ఏమన్నా నేర్చుకొని ఉన్నాను అంటే అది ఆయన వల్లే.. తన సినిమాల విషయంలో, సినిమా కోసం ప్రిపేర్ అయ్యేది చాలా అడ్వాన్స్ గా ఉంటుంది, అలాగే ఎంతో స్పూర్తిని ఇచ్చేలా ఉంటుంది. ఒక్క మాటలో కమల్ గారి గురించి చెప్పాలంటే ‘ప్రతి ఒక్కరికి ఆయన నడిచే లైబ్రరీ లాంటి వాడు’.

ప్రశ్న) ఎప్పుడు మీరు డైరెక్ట్ తెలుగు సినిమాకి డైలాగ్స్ రాస్తారు? అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

స) నేను ఇప్పటికే నాని ‘జెండాపై కపిరాజు’కి రాసాను. ప్రస్తుతం నేను స్లోగా హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాను, అలాగే ఇక్కడ ఓ డబ్బింగ్ స్టూడియో ప్రారంభించనున్నాను. నా స్టూడియోలో వాయిస్ ఉంటుంది, అలాగే స్క్రిప్ట్ బ్యాంకు కుడా ఉంటుంది. ఎవరైనా వచ్చి వాళ్ళ వాయిస్ డెమో ని రికార్డ్ చేయవచ్చు, అలాగే వారి స్క్రిప్ట్స్ ని కూడా ఇవ్వవచ్చు. అలాగే డిస్నీ వెండార్ షిప్ ని కూడా తీసుకొని వారి టీవీ షోస్ పై కూడా పనిచేద్దాం అనుకుంటున్నాను.

ప్రశ్న) డబ్బింగ్, రైటింగ్ మరియు డైరెక్షన్ ఈ మూడింటిలో మీకు బాగా ఇష్టమైనది ఏది?

స) అనుమానం లేకుండా డబ్బింగ్ అనే చెప్తాను.. ఎందుకంటే డబ్బింగ్ ని నేను ఒక మెడిటేషన్ లా ఫీలవుతాను. ఆ తర్వాతే రైటింగ్, డైరెక్షన్ వస్తుంది.

ప్రశ్న) డైరెక్టర్ గా ఏమన్నా సినిమాలు చేతిలో ఉన్నాయా?

స) నేను ప్రస్తుతం భారతీరాజా గారితో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ ని కో డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేసాను. అలాగే కొన్ని స్టోరీస్ లైన్ లో ఉన్నాయి. వాటిని త్వరలోనే ఫైనలైజ్ చేస్తాను.

ప్రశ్న) మీ ఫేవరేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు ఎవరు?

స) చాలా మందే ఉన్నారు.. ముఖ్యంగా చెప్పాల్సింది రవి శంకర్, ఎస్.పి బాలు గారు, సవిత నాకు బాగా నచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ లు.

ప్రశ్న) మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం మరియు తెలుగులో మీ ఫేవరేట్ నటుడు ఎవరు?

స) నేను అన్ని సినిమాలను చూడటానికి ఇష్టపడతాను. నేను నాగార్జున చాలా పెద్ద అభిమానిని, అలాగే ఆయనతో ఓ సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీరు డబ్బింగ్ చెబుతున్న తదుపరి సినిమాలేమిటి? అలాగే వాటికి మీరు డైలాగ్స్ రాసారా?

స) ప్రస్తుతం నాలుగైదు సినిమాలకు డబ్బింగ్, రైటర్ గా పనిచేస్తున్నాను. అవే ‘గోలీ సోడా’, సిద్దార్థ్ ‘జిగర్థాండ’, కార్తి ‘మద్రాస్’, సూర్య ‘అంజాన్’. ఇవి కాకుండా యువి క్రియేషన్స్ వారు అనుష్కతో చేసే మూవీకి కూడా ఆఫర్ వచ్చింది.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం శశాంక్ వెన్నెలకంటికి ఆల్ ది బెస్ట్ చెప్పాం..

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు