ప్రత్యేక ఇంటర్వ్యూ : సుజీత్ – ‘రన్ రాజా రన్’ టామ్ అండ్ జెర్రీ ఫార్మాట్ లో ఉంటుంది.!

ప్రత్యేక ఇంటర్వ్యూ : సుజీత్ – ‘రన్ రాజా రన్’ టామ్ అండ్ జెర్రీ ఫార్మాట్ లో ఉంటుంది.!

Published on Jul 29, 2014 4:00 PM IST

Sujeeth
సుమారు 40దాకా లఘు చిత్రాలు తీసి యు ట్యూబ్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘రన్ రాజా రన్’. ‘మిర్చి’ తో సూపర్ హిట్ అందుకున్న యువి క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ఆగష్టు 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుజీత్ తో ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆయన ఈ చిత్ర విశేషాలనుమాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా షార్ట్ ఫిల్మ్స్ ప్రపంచంలోకి ఎలా ఎంటర్ అయ్యారు?

స) నాకు మామూలుగా స్టొరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. 2005, 2006 టైంలో అందరికీ యు ట్యూబ్ అంటే బాగా క్రేజ్ ఉండేది. అప్పుడే నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసాను. దానికి ఒక్క రోజులోనే లక్ష క్లిక్స్ వచ్చాయి. అది చూసి షాక్ అయ్యాను. అప్పటి నుంచి ఒక టీంని ఫాం చేసుకొని షార్ట్ ఫిల్మ్స్ చేసాను. కొద్ది రోజుల తర్వాత డి.ఎఫ్.టి(డిప్లమో ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ) చేసాను. ఆ తర్వాత యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఏదన్నా షార్ట్ ఫిల్మ్ చెయ్యాలని ‘రన్ రాజా రన్’ చేసాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా చేద్దామని హైదరాబాద్ వచ్చాను.

ప్రశ్న) ఈ సినిమా ఎలా మొదలైంది.?

స) నా మొదటి సినిమాగా ఓ లవ్ స్టొరీ అనుకున్నాను. మొదట యువి క్రియేషన్స్ కి అదే చెప్పను, కానీ కాన్సెప్ట్ పరంగా దానికి కాస్త బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అందుకే దాన్ని ఆపక్కన పెట్టాను. యువి క్రియేషన్స్ వాళ్ళు కాస్త కొత్తగా డిఫరెంట్ గా స్క్రిప్ట్ ఉంటే చెప్పు అనగానే నా దగ్గర ఓ కాన్సెప్ట్ ఉందని చెప్పాను. చెప్పాలంటే అప్పటికి నా దగ్గర ఎలాంటి కథ లేదు. ఒక వారంలో వస్తానని చెప్పి 6 రోజుల్లో కథ మొత్తం రాసుకొని వచ్చి చెప్పాను. ఆ కథ వాళ్ళకి బాగా నచ్చేయడంతో వెంటనే సినిమా మొదలైంది.

ప్రశ్న) ‘రన్ రాజా రన్’ కథాంశం గురించి చెప్పండి.?

స) ముందుగా ఈ సినిమా గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి. టైటిల్స్ ఒకటే అయినా ఈ సినిమాకి నేను తీసిన ‘రన్ రాజా రన్’ షార్ట్ ఫిల్మ్ కి దీనికి అస్సలు సంబంధం ఉండదు. ఇక కథలోకి వెళితే దాదాపు 50 మందితో బ్రేకప్ అయిన ఓ అబ్బాయి. తను ఇష్టపడి ప్రపోజ్ చేయ్యాలకునేలోపు వాళ్ళకి పెళ్లై పోతుంటుంది, ఇలాంటి సమస్య ఫేస్ చేసే అమ్మాయి. వీరిద్దరికి పరిచయం అయిన తర్వాత వారి జర్నీ ఎలా టర్న్ అయ్యింది అనేదే ఈ సినిమా. లవ్, కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. చెప్పాలంటే ‘రన్ రాజా రన్’ సినిమా ‘టామ్ అండ్ జెర్రీ’ ఫార్మాట్ లో ఉంటుంది.

ప్రశ్న) ఎప్పుడు సీరియస్ పాత్రలు చేసే శర్వానంద్ ని ఎలా ఈ సినిమాకి ఎంచుకున్నారు? అలాగే సినిమాలో శర్వానంద్ పాత్ర గురించి చెప్పండి.?

స) మొదట నేను శర్వాని తీసుకోవాలని అనుకున్నాను. అది వంశీకి సజెస్ట్ చెయ్యగానే ఏదైనా కొత్తగా చూపిస్తే హిట్ అవుతాం అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. మీరన్నట్టు శర్వానంద్ ఎక్కువ సీరియస్ పాత్రలే చేసారు. సత్య సెట్లో సీరియస్ లుక్లో ఉన్నప్పుడు ఈ కథ చెప్పాను. అంతా విన్నాక బాగుంది కానీ నేను సెట్ అవుతానా అన్నాడు. నా దగ్గర నుంచి నువ్వు రాసుకున్న హీరో పాత్రకి న్యాయం చేయగలవా అని అడిగారు? నేను చెయ్యగలను అన్నాకే ఆయన సైన్ చేసాడు. చెప్పాలంటే శర్వానంద్ రియల్ గా చాలా జోష్ గా, జోవియల్ గా ఉంటారు. తన ఒరిజినల్ పాత్రనే ఈ సినిమాలో చూపించడానికి ట్రై చేసాను.

ఇక ఇందులో శర్వా చేసిన పాత్ర పేరు రాజా హరిశ్చంద్ర. ఎప్పుడూ నిజాలే చెబుతుంటాడు. అలా చెప్పడం వల్లే తనకి 50 మంది అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. తను నిజాలు చెప్పడం వల్ల ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు అన్నది మీరు సినిమాలో చూడాలి.

ప్రశ్న) హీరోయిన్ సీరత్ కపూర్ ని ఎలా ఎన్నిక చేసారు.?

స) ఈ సినిమా హీరోయిన్ పాత్ర రాసుకున్నప్పుడు హీరోయిన్ రెగ్యులర్ గా ఉండకూడదు అనుకున్నాను. ఎందుకంటే రిచ్ గర్ల్ లుక్ ఉండాలి, అలాగే పేస్ చూడగానే పొగరుబోతు అనే ఫీలింగ్ రావాలి అలాంటి అమ్మాయి కోసం వెతికాం. ముందుగా తెలుగమ్మాయిలను చూసాం ఫైనల్ గా ఓ ఆడిషన్ లో ఈ ముంబై భామని సెలెక్ట్ చేసాం. సీరత్ చాలా డెడికేషన్ ఉన్న హీరోయిన్. తనకి తెలుగు రాకపోయినా కూర్చొని బాగా తెలుగు నేర్చుకొని, ప్రతిది బాగా అర్థం చేసుకొని ఈ సినిమా చేసింది.

ప్రశ్న) అసలు తెలుగులో ఎవరికీ తెలియని జిబ్రాన్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని ఎలా ఎంపిక చేసారు.?

స)) ముందుగా ఇక్కడ ఉన్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తోనే పనిచేసాను. వాళ్ళ దగ్గర నుంచి 2/3 పాటలు బాగా వస్తున్నాయి కానీ ఆ తర్వాత అంతగా సెట్ అవ్వడం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న టైంలో.. నాకు బాగా నచ్చి నేనొక తమిళ్ సాంగ్ ని నా కాలర్ ట్యూన్ గా పెట్టుకొని ఉండేవాడిని.. ఈ పాట చాలా బాగుంది కదా అసలు ఇది చేసింది ఎవరు? ఏమిటా? అని వెతికితే ఆ పాట చేసింది జిబ్రాన్ అని తెలిసింది. ఆ తర్వాత నిర్మాతలకి చెప్పి జిబ్రాన్ కి కథ చెప్పాను. తనకి కథ కంటే నా బిహేవియర్ ఇంకా బాగా నచ్చడంతోవెంటనే ఈ సినిమాకి ఒప్పుకున్నాడు.

ప్రశ్న) ‘మిర్చి’ లాంటి హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ తో పనిచేయడం ఎలా ఉంది.?

స) ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ అందుకున్నారు, వాళ్ళతో ఎలా ఉంటుందో అని మొదట భయపడ్డాను, కానీ వాళ్ళలో అలాంటి ఫీలింగ్ ఏమీ ఉండదు. మీతో కలిసి పోతారు. నేను కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పిన ప్రతిదానికి వాళ్ళు పూర్తి సపోర్ట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. యువిక్రియేషన్స్ టీంలో ముగ్గురు ఉంటారు. అందులో వంశీకృష్ణ గారికి స్క్రిప్ట్ మీద సూపర్బ్ నాలెడ్జ్. కథకి సంబంధించి అన్ని జాగ్ర్తత్తలు ఆయన తీసుకుంటారు. ప్రమోద్ గారు లోకేషన్స్, నటీనటులు ఎప్పుడు ఎక్కడికి రావాలి అనే విషయాలను పర్ఫెక్ట్ గా డీల్ చేస్తాడు. ఇక వివేక్ ఆయన ఫైనాన్సియల్ పరంగా ఎక్కడ ఎంత కర్చు పెట్టాలి? అవసరమా కాదా? అనేది చూసుకుంటారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆ ముగ్గురు ఇచ్చిన సపోర్ట్ కి నా స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను.

ప్రశ్న) ఈ చిత్ర టీంతో చేసిన జర్నీ తర్వాత ఈ సినిమాకి సంబందించిన ప్రముఖుల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చెప్తారు.?

స) ప్రమోద్ – వంశీ కృష్ణ – వండర్ఫుల్ ప్రొడక్షన్ టీం

శర్వానంద్ – మంచి నటుడు, నటుడికంటే అమేజింగ్ హ్యూమన్ బీయింగ్.

సీరత్ కపూర్ – హార్డ్ వర్కింగ్ హీరోయిన్.

జిబ్రాన్ – ఓ మ్యూజిక్ బ్యాంకు

మధి – వెరీ గుడ్ పర్సన్, అణాకు అన్నయ్య లాంటివారు.

ప్రశ్న) ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ ఏమవుతాయి.?

స) నా పరంగా ఓ సినిమాకి ఎప్పుడు కథే హైలైట్ అంటాను. ఈ సినిమాకి కూడా కథ – స్క్రీన్ ప్లే మేజర్ హైలైట్స్ అవుతాయి. అలాగే మధి సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్, చివరి 30 నిమిషాల థ్రిల్లింగ్ మోమెంట్స్ హైలైట్ అవుతాయి. నాకు తెలిసి వీటన్నిటికంటే శర్వానంద్ ఎక్కువ హైలైట్ అవుతారు.

ప్రశ్న) చాలా షార్ట్ ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేసారు, ఇప్పుడేమో సినిమాకి దర్శకత్వం వహించారు. మీ పరంగా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయడం కష్టమా.? లేక సినిమా డైరెక్ట్ చేయడం కష్టమా.?

స) చెప్పాలంటే సినిమా చేయడమే కాస్త సులభం అనిపిస్తుంది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ పరంగా లోకేషన్స్, సెట్టింగ్స్, స్క్రిప్ట్ ఇలా అన్ని పనులు నేనే చూసుకోవాలి. అదే సినిమా విషయానికి వస్తే ప్రతి డిపార్ట్ మెంట్ కి ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళందరికీ క్లారిటీగా మనకి ఏమి కావాలో చెప్తే అది వాళ్ళు చేసేస్తారు. అప్పుడు మనకు డైరెక్షన్ కాస్త సులభం అయిపోతుంది.

ప్రశ్న) ఇక నుంచి మీ నుంచి రాబోయే సినిమాలు కూడా ఇదే జోనర్ లోనే ఉంటాయా? అలాగే మీరు డైరెక్ట్ చెయ్యాలి అనుకునే హీరోలు ఎవరన్నా ఉన్నారు.?

స) ఇదే జోనర్ లోనో లేదా ఒకే జోనర్ లోనో సినిమాలు చేయాలని లేదు. ఒక్కో సినిమాకి ఒక్కో జోనర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది థ్రిల్లర్, నెక్స్ట్ లవ్ ఎంటర్టైనర్, ఆ తరువాత హర్రర్ ఇలా అనుకుంటున్నాను. ఇక హీరోస్ అంటే అందరితోనూ చేయాలని ఉంది. నా వారకూ నేను రాసుకునే కథలు ఎక్కువగా యంగ్ హీరోస్ అయిన నితిన్, నాని, రామ్, శర్వానంద్ మొదలిన వారికి ఎక్కువగా సూట్ అవుతాయి.

ప్రశ్న) చివరిగా ఈ సినిమా చూడాలనుకునే వారికి మీరేం చెప్తారు.?

స) ‘రన్ రాజా రన్’ అనే సినిమాలో లవ్ ట్రాక్ ఉంటూనే థ్రిల్లింగ్ మోమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉంటే సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. థియేటర్ కి వచ్చిన వారికి ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండేలా ఈ సినిమాని తీసాం. ఫ్యామిలీ మొత్తం వచ్చి హ్యాపీ గా చూడదగిన చిత్రం ‘రన్ రాజా రన్’.

అంతటితో మా ప్రత్యేక ఇంటర్వ్యూని ముగించి ‘రన్ రాజా రన్’ సినిమా మంచి విజయం సాధించాలని సుజీత్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు