సమీక్ష : హ్యాపీ బర్త్ డే – సెలబ్రేషన్స్ అంతగా లేవు !

సమీక్ష : హ్యాపీ బర్త్ డే – సెలబ్రేషన్స్ అంతగా లేవు !

Published on Mar 18, 2017 1:02 AM IST
Happy Birthday movie review

విడుదల తేదీ : మార్చి 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : పల్లెల వీరా రెడ్డి

నిర్మాతలు : కె. మహేష్

సంగీతం : సంతోష్ రెడ్డి

నటీనటులు : చెన్నమనేని శ్రీధర్, సంజన, జ్యోతి సేధి

చెన్నమనేని శ్రీధర్, సంజన, జ్యోతి సేధి, శ్రావణ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రదారులుగా పల్లెల వీరా రెడ్డి తెరకేకించిన చిత్రమే ఈ ‘హ్యాపీ బర్త్ డే’. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

యాడ్ ఫిల్మ్ దర్శకుడైన రాహుల్ (శ్రీధర్), మోడల్ రియా (జ్యోతి సేధి) లు తమ పుట్టినరోజు వేడుకను గెస్ట్ హౌస్ లో సరదగా జరుపుకుందామని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇంతలోపే ఆ ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరో రాహుల్ ను తీవ్రంగా కొట్టి పడేస్తాడు.

ఆ కాసేపటికే రియా పై కూడా ఎవరో దాడి చేస్తారు. అలా ఆ జంటపై దాడి చేసింది ఎవరు ? ఆ దాడికి కారణం ఏమిటి ? రాహుల్, రియాలు చేసిన తప్పేమిటి ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే సెకండాఫ్లో రివీల్ చేయబడే రాహుల్, రియాల గతం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. వారి గత జీవితాల్లో చోటుచేసుకున్న ప్రేమ కథల్లోని వ్యక్తులు ప్రస్తుతంలో వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశారు అనే పాయింట్ ను దర్శకుడు పట్టుకోవడం బాగుంది. అలాగే నటుడు శ్రీధర్, జ్యోతి సేధిల మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది.

ప్రధాన పాత్రల్లో నటించిన శ్రీధర్, శ్రావణ్ రాఘవేంద్ర, రియాలు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రాణం అనుకున్న తమ ప్రేమికుల చేతిలో మోసపోయిన ఇద్దరు ప్రేమికులు పడే బాధను వ్యక్తపరచడంలో శ్రావణ్ రాఘవేంద్ర, సంజన గల్రానిలు మంచి నటన కనబరిచారు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ ముందు జరిగే సాన్నివేశానికి సెకండాఫ్ కథనంతో ఒక జస్టిఫికేషన్ ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అలాగే ఫస్టాఫ్లోని ఒకటి రెండు సన్నివేశాలతో హర్రర్ సినిమా చూస్తున్న ఫీల్ కలిగింది. చిత్ర రన్ టైమ్ కూడా తక్కువే అవడం ప్రేక్షకులకు బాగా కలిసొచ్చే మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఓపెన్ అయినా మొదటి 15 నిముషాలు ఏం జరుగుతుందో అర్థం కాదు. దర్శకుడు పల్లెల వీరా రెడ్డి సినిమాను స్టార్ట్ చేయడం హర్రర్ చిత్రంలా చేసి ఇంటెర్వెల్ ముందు వరకు దాన్ని ఒక తీరు తెన్నూ లేకుండా నడపడంతో తారా స్థాయి చిరాకు ఏర్పడింది. నటీనటుల గతంలోని ప్రేమ కథల్లో కొన్ని అంశాలకు ఏమాత్రం లాజిక్స్ ఉండవు. ఇక వాసి రెడ్డి సత్యానంద్ కెమెరా పనితనం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్.

ఒక గోడకు నాలుగు దెయ్యపు బొమ్మల్ని తగిలించి కెమెరాను ముందుకు, వెనక్కు లాగుతూ నటీనటుల మీదకన్నా వాటి మీదే ఎక్కువ షాట్స్ తీశాడు. ఆ షాట్స్ వలన ప్రయోజనమేమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. ఇక సెకండాఫ్ స్టోరీ కాస్త బాగుంది అనుకునేలోపు కనీసం ఊహకందని విధంగా దర్శకుడు ఇచ్చిన ఎండ్ షాట్ అస్సలు అర్థం కాలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పల్లెల వీరా రెడ్డి రాసుకున్న కథ అయితే చెప్పడానికి బాగుంటుంది కానీ దాన్ని ఆయన స్క్రీన్ మీద ప్రేజెంట్ చేసిన విధానం ఏమంత ఆకట్టుకునేదిగా లేదు. సంతోష్ రెడ్డి సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు. మహేంద్ర నాథ్ ఎడిటింగ్ బాగోలేదు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘హ్యాపీ బర్త్ డే’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో పెద్దగా మెరుపులు ఏవీ కనిపించలేదు. సెకండాఫ్ లో రివీల్ అయ్యే చిన్నపాటి ట్విస్ట్, శ్రీధర్, సంజన, జ్యోతి సేధి, శ్రావణ్ రాఘవేంద్రల నటన ఇందులో ప్లస్ పాయింట్స్ గా ఉన్నా దర్శకుడు ఫస్టాఫ్ ను డీల్ చేసిన విధానం, వాసి రెడ్డి సత్యానంద్ కెమెరా జిమ్మిక్కులు, ఊహకందని క్లైమాక్స్ షాట్ సినిమా రిజల్ట్ ను నెగెటివ్ గా మార్చేశాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ హ్యాపీ బర్త్ డే అనే టైటిల్ చూసి థియేటర్లోకి వెళితే మాత్రం ఆశించిన స్థాయి సెలబ్రేషన్స్ దొరకవు.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు