ఇంటర్వ్యూ : ఆది – తండ్రినయ్యాక అంతా కొత్తగా కనిపిస్తోంది!

ఇంటర్వ్యూ : ఆది – తండ్రినయ్యాక అంతా కొత్తగా కనిపిస్తోంది!

Published on Dec 22, 2015 11:51 PM IST

aadi
ప్రముఖ నటుడు సాయికుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న ఆది తాజాగా ‘గరమ్’ అనే సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. దర్శక, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సాయి కుమార్ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. నేడు తన పుట్టినరోజు జరుపుకుంటోన్న ఆది.. గరం సినిమా గురించి, కెరీర్ గురించి తెలిపిన విశేషాలు..

ప్రశ్న) ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈమధ్యే తండ్రి కూడా అయ్యారు. ఎలా ఉందీ ఫీలింగ్?

స) నా జీవితంలోకి కూతురు రూపంలో ఓ కొత్త వెలుగు వచ్చింది. అంతా కొత్తగా ఉంది. అసలు ఈ ఫీలింగ్‌ను చెప్పడానికి నాకు మాటలు కూడా దొరకడం లేదు. నా ఆలోచనల్లో కూడా మార్పు కనిపిస్తోంది. నాన్నపై మరింత గౌరవం పెరిగింది.

ప్రశ్న) కొంత గ్యాప్ ఇచ్చి ‘గరం’ సినిమాతో వస్తున్నారు. ఈ గ్యాప్‌కి కారణం ఏంటి?

స) ఈ గ్యాప్ అనుకొని తీసుకుంది. ‘గరం’ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. దీంతో అందరి డేట్స్ కుదుర్చుకొని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చూసి సినిమాను పూర్తి చేసేసరికి కొంత టైమ్ పట్టింది. దీంతో అనుకోకుండానే సినిమా ఆలస్యమైంది.

ప్రశ్న) మొదటిసారి మీ సొంత ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేశారు. ఆ అనుభవం ఎలా ఉంది?

స) బాగుందండీ. శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన కథ వినగానే నేను, నాన్నగారు ఏ ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అయ్యామో, అదే దర్శకుడు మదన్ కూడా ఇష్టపడ్డారు. ఇంత ఎమోషన్ ఉన్న కథను మనమే ఎందుకు నిర్మించకూడదూ? అన్న ఆలోచనతో ఈ సినిమాను స్వయంగా మేమే నిర్మించాం. మేమే స్వయంగా నిర్మాతలం కావడంతో ఖర్చు విషయంలోనూ ఎక్కడా వెనుకాడకుండా కథకు కావాల్సినది సమకూర్చాం.

ప్రశ్న) గరం సినిమా ఏం చెప్పబోతోంది?

స) ఈ సినిమా ఏం చెప్పబోతోందనేది సస్పెన్స్ అండీ. ఒక మంచి ఎమోషన్ ఉంది. అదే ఈ సినిమాకు హైలైట్. ఇకపోతే క్యారెక్టరైజేషన్‌ను హైలైట్ చేస్కొని నేను ఈమధ్య కాలంలో సినిమా చేయలేదు. ‘గరం’లో వరాలబాబు అనే క్యారెక్టర్‌ను హైలైట్ చేస్తూ సినిమా నడుస్తుంది. కచ్చితంగా ఈ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) తెలుగులో స్టార్ హీరోలకు ఏడో సినిమా స్పెషల్. మీకు ఆ సెంటిమెంట్‌పై ఏమైనా నమ్మకం ఉందా?

స) ఈ సెంటిమెంట్ గురించి నాతో కూడా చాలా మంది చెప్పారు. నాకిది ఏడో సినిమా. ఈ సినిమా నా కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్. మంచి విజయం సాధిస్తుందన్న ధీమాతోనే ఉన్నా. ఇక సెంటిమెంట్ ప్రకారం ఇంకా పెద్ద హిట్ అయితే.. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి!

ప్రశ్న) చుట్టాలబ్బాయ్ ఎంతవరకు వచ్చింది? కొత్తగా ఇంకేం చేయబోతున్నారు?

స) ‘చుట్టాలబ్బాయ్’ 40% పూర్తైంది. ఆ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇకపోతే త్వరలోనే ప్రయోగం లాంటిదేదైనా చేయాలనుంది. కమర్షియల్‌గా కూడా వర్కవుట్ అయ్యే ప్రయోగమేదైనా చేయాలని ప్లాన్ చేస్తున్నా!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు