‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్న హీరో నాగశౌర్య, ఈమధ్యే ‘జాదూగాడు’తో మాస్ అవతారం కూడా ఎత్తారు. ఇక ఆ సినిమా అనుకున్నంతగా మెప్పించకపోవడంతో, మళ్ళీ తనదైన స్టైల్లో అబ్బాయితో అమ్మాయి పేరుతో ఓ లవ్ స్టోరీని రిలీజ్‌కు రెడీ చేసేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో నాగ శౌర్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) జాదూగాడు లాంటి మాస్ సినిమా తర్వాత మళ్ళీ మీ రూట్లోకి వచ్చారేం?
స) జాదూగాడు రిజల్ట్ చూశాం కదా! ప్రేమకథల్లోని ఇన్నోసెన్స్ నా స్టైల్‌కు సరిగ్గా సరిపోతుంది. దానికి బీ,సీ సెంటర్లన్న తేడా కూడా ఉండదు. ఆ నమ్మకంతోనే వరుసగా నా నాలుగు సినిమాలనూ ప్రేమకథలనే సిద్ధం చేశా. రేపు రిలీజ్ అవుతోన్న అబ్బాయితో అమ్మాయి, కళ్యాణ వైభోగమే సినిమాలతో పాటు.. జ్యోఅచ్యుతానంద, ఒక్క మనసు ఇలా వరుసగా ప్రేమకథలే!
ప్రశ్న) అబ్బాయితో అమ్మాయి ఎలా ఉండబోతోంది?
స) అబ్బాయితో అమ్మాయి ఈ జనరేషన్ ప్రేమకథ. ఈ జనరేషన్ యూత్ ఫేస్బుక్ ప్రేమల్లో ఎలా పడిపోతున్నారు? అందులో ఉన్న మంచి ఎంత? చెడు ఎంత? అన్న అంశాలను ప్రస్తావించే సినిమా. చూడ్డానికి అర్బన్ నేపథ్యంలా ఉన్నా, ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే లవ్‌స్టోరీ.
ప్రశ్న) దర్శకుడు రమేష్ వర్మ గురించి చెప్పండి?
స) రమేష్ వర్మ గారికి సినిమాపైన విపరీతమైన నాలెడ్జ్ ఉంది. పక్కాగా, అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై ఆవిష్కరించగలిగారు. పోస్టర్స్ డిజైన్‌లో ఆయన ప్రతిభ వల్లే మొదట్లో ఎవ్వరికీ తెలియని ఈ సినిమా ఈ రోజు ఈ స్థాయి క్రేజ్ సంపాదించుకుంది.
ప్రశ్న) ఇప్పటివరకూ మీరు చేసిన సినిమాలను చూసుకుంటే ఇప్పుడు ఎక్కడున్నారనిపిస్తోంది?
స) నేనింకా జీరో దగ్గరే ఉన్నా అండీ. 2016లో నావి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో ఒక మెట్టు ఎక్కుతానని అనుకుంటున్నా. ఆ నాలుగూ ప్రేమకథలే అయినా దేనికదే డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ప్రస్తావిస్తూ వస్తాయి. 2016 నా కెరీర్‌కి చాలా స్పెషల్!
ప్రశ్న) అబ్బాయితో అమ్మాయి మేజర్ హైలైట్స్ ఏంటి?
స) ముందే చెప్పినట్లు, ఇది ఈ జనరేషన్ ప్రేమకథ. ఈ జనరేషన్ ప్రేమలను చెప్పడం వల్ల ఇప్పటి తరం వారంతా తమను తాము ఆయా పాత్రల్లో చూసుకొని కనెక్ట్ అవుతారు. అదే ఈ సినిమాకు హైలైట్. ఇళయరాజా మ్యూజిక్ కూడా ఓ హైలైట్‌గా నిలుస్తుంది.
ప్రశ్న) మీ తదుపరి సినిమాల విశేషాలు చెప్పండి?
స) కళ్యాణ వైభోగమే అనే సినిమా వచ్చే నెల్లోనే విడుదలవుతుంది. ఇక ఒక్క మనసు నేనెప్పటికీ గుర్తుంచుకునే ఓ అందమైన లవ్‌స్టోరీ. జ్యోఅచ్యుతానంద ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళుతుంది.