‘ఆకాశ రామన్న’ సినిమా ద్వారా ఎడిటర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఎడిటర్ ప్రవీణ్ పూడి. ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి ఇండస్ట్రీలో ఒక టాప్ ఎడిటర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు ప్రవీణ్ పూడి బర్త్ డే సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించాం.. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ఇండస్ట్రీకి ఎలా వచ్చారు.?
స) స్వతహాగా చదువు అబ్బలేదు. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసాను. ఆ తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి మొదటగా కోటగిరి వెంకటేశ్వర రావు గారి దగ్గర అప్రెంటిస్ గా చేరాను.
ప్రశ్న) అప్రెంటిస్ నుంచి సక్సెస్ఫుల్ ఎడిటర్ గా ఎదిగిన మీ ప్రస్థానం గురించి చెప్పండి.?
స) కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర రాజకుమారుడు, చూడాలని ఉంది, సమరసింహా రెడ్డి లాంటి సినిమాలకు పనిచేసాను. ఆ తర్వాత మార్తాండ్ కె వెంకటేష్ దగ్గర పనిచేసాను. 2002 లో పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడ 6 సంవత్సరాలు పనిచేసాను. ఆ టైంలోనే జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం, జల్సా సినిమాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా చేసాను. ఆ తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర చేసాను. ఫైనల్ గా ఆకాశ రామన్న సినిమాతో ఎడిటర్ ని అయ్యాను. ఆ తర్వాత త్రివిక్రమ్ గారి జులాయి సినిమాతో నాకు బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది, మనం సినిమాలు ఇంకా పేరు తెచ్చి పెట్టాయి. త్రివిక్రమ్ గారు లేకపోతే నాకు ఈ ప్లేస్ ఉండేది కాదు.
ప్రశ్న) సినిమా పరంగా ఎడిటింగ్ కి – స్క్రీన్ ప్లే కి బాగా దగ్గర సంబంధం ఉంటుంది.? ఆ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి.?
స) నాకు తెలిసన దాని ప్రకారం స్క్రీన్ ప్లే చాలా విధాలుగా రాసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో రాసుకుంటారు. వాళ్ళు సీన్ బై సీన్ డిజైన్ చేసుకొని రాస్తారు. కానీ ఎడిటర్ అనేవాడు షాట్ బై షాట్ రాసుకోవడమే స్క్రీన్ ప్లే అని చెప్తాను. దాని ప్రకారమే ఎడిట్ చేస్తాను. స్క్రీన్ ప్లే పరంగా 3 జేనరేషన్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మనం సినిమా నాకు మరచిపోలేని అనుభవం వచ్చింది.
ప్రశ్న) మీరు ఫిల్మ్ ఎడిటింగ్ చూసారు, డిజిటల్ ఎడిటింగ్ చూసారు. ఈ రెండింటిలో ఏది కష్టం.?
స) నా పరంగా ఫిల్మ్ ఎడిటింగ్ చాలా కష్టం. ఎందుకంటే డిజిటల్ ఎడిటింగ్ లో మనం చేసినదాన్లో తప్పు ఏమన్నా ఉంది అంటే చేసింది తీసేసి మళ్ళీ ఆ సీన్ ని ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఫిల్మ్ ఎడిటింగ్ లో ఆ ఫెసిలిటీ ఉండదు. అలాగే ఫిల్మ్ ఎడిట్ చేసేవారికి మోర్ విజన్ ఉంటుంది. అది ఉంటేనే ఫిల్మ్ ఎడిటింగ్ చేయగలరు. డిజిటల్ వచ్చాక ఈజీ అయ్యింది కానీ ఎక్కువ షాట్స్ వస్తాయి, అందులో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని కాస్త కేర్ఫుల్ గా ఎడిట్ చెయ్యాలి.
ప్రశ్న) ఒక సినిమా ఫెయిల్ అయితే ఎడిటర్ దే ఎక్కువ పాత్ర అంటారు. ఈ విషయంపై మీ కామెంట్.?
స) ప్రతి సినిమాలోనూ డైరెక్టర్ పేపర్ మీద రాసుకున్నది, ఆయన తీసిన దాన్ని బట్టే మేము అలానే ఎడిట్ చేస్తాం. డైరెక్టర్ ప్రతి సీన్ ని డిఫరెంట్ షాట్స్ తో తీస్తాడు, అప్పుడు ఎడిటర్ అనేవాడు ఆ సీన్ ని ఎంత టైమింగ్ లో కట్ చెయ్యాలి, ఆ సీన్ కి ఎంత టైం ఇస్తే సరిపోతుంది అనేది చూసుకొని చెయ్యాలి. అలా చెయ్యలేకపోతే ఎడిటర్ వైపు కూడా తప్పు ఉన్నట్లే అని నేను భావిస్తాను.
ప్రశ్న) సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ లానే ఎడిటర్ గా మీకు కుడా ఒక సెపరేట్ విజన్ ఉంటుందా.?
స) కచ్చితంగా ఎడిటర్ కి కూడా ఓ విజన్ ఉంటుంది. రొమాంటిక్ సినిమాకి ఒక టైమింగ్, యాక్షన్ సినిమాకి ఒక టైపు టైమింగ్, ఇలా నవరసాలకి ఒక టైమింగ్ ఉంటుంది. కచ్చితంగా మేము చేసే సినిమాలకు అదే టైమింగ్స్ ని ఫాలో అవుతూ ఉంటాం.
ప్రశ్న) మీ కెరీర్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమిటి.?
స) అత్తారింటికి దారేది సినిమాని రిలీజ్ కి ముందు మా టీం అంతా కలిసి సినిమా చూసాం. సినిమా అయ్యాక త్రివిక్రమ్ గారు నా భుజం మీద చెయ్యి వేసి క్లైమాక్స్ సీన్ ని చాలా బాగా ఎడిట్ చేసావ్ అని అన్నారు. అది నేను మర్చిపోలేని కాంప్లిమెంట్.
ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) ప్రస్తుతం నేను త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాకి చేస్తున్నాను. అది కాకుండా నాగార్జున గారి ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి చేస్తున్నాను. అలాగే కొరియర్ బాయ్ కళ్యాణ్ ఎడిటింగ్ ని కూడా ఫినిష్ చేస్తున్నాం. అన్నీ కుదిరితే ఈ ఇయర్ లో కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాను.