స్టార్ హీరో అనే ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్న నటుడు విక్టరీ వెంకటేష్. కెరీర్ ఆరంభం నుండి వెంకీ పంధా ఇదే. మల్టీస్టారర్ సినిమాలకు పచ్చ జెండా ఊపి, ప్రస్తుతం జోరు పెంచారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘దృశ్యం’ సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. తాజాగా ‘గోపాల గోపాల’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలసి సంక్రాంతికి సందడి చేయడానికి సిద్దమయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు. ‘స్టార్ స్టేటస్ అనేది టెంపరరీ, నటుడిగా సినీ ప్రయాణంలో మన వద్దకు వచ్చిన ప్రతి మజిలీని ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి’ అంటూ వెంకీ చెప్పిన ముచ్చట్లు మీకోసం..
ప్రశ్న) ‘గోపాల గోపాల’లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?
స) కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ ఇది. దేవుడిపై కేసు వేసే ఒక సామాన్య వ్యక్తి, గోపాలరావు అనే పాత్రలో నటించాను. అక్కడ అర్ధమవుతుంది సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి అనేది. ఒక చిన్నపాటి మెసేజ్ ఇస్తూ సినిమా అంతా సరదాగా సాగిపోతుంది. సమాజంలో ఎక్కువ మంది దేవుడు అంటే భయపడతారు. దేవుడు ఎక్కడో లేడు, మన గుండెల్లోనే ఉన్నాడు అని సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశాం.
ప్రశ్న) ఫస్ట్ టైం, పవన్ కళ్యాణ్ తో కలసి వర్క్ చేశారు. ఎలా ఉంది..?
స) దేవుడి పాత్ర పోషించడానికి ఎవరు అయితే బాగుంటుంది అని డిస్కషన్ జరిగినప్పుడు పవన్ అయితే బాగుంటుందని అనుకున్నాం. కళ్ళలో ఒక ఆధ్యాత్మిక భావన ఉండాలి. ఈ క్యారెక్టర్ అతనికి బాగా సూటవుతుంది. అతను కూడా ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. పవన్ కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్లలో ‘గోపాల గోపాల’ ఒకటిగా నిలుస్తుంది. పవన్ తో మంచి రిలేషన్షిప్ ఉంది. గత 10 సంవత్సరాల నుండి ఇద్దరం కలసి ఓ సినిమా చేయాలనుకున్నాం, కుదరలేదు. మేము ఇద్దరం ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుంటాం. అలాంటి కథతోనే సినిమా చేశాం. మొదటి నుండి గోపాల క్యారెక్టర్ పవన్ చేస్తే బాగుంటుందని మా అన్నయ్య సురేష్ బాబు ప్రయత్నించారు.
ప్రశ్న) నిజ జీవితంలో మీరు దేవుడిని నమ్ముతారు. గోపాలరావు అనే నాస్తికుడి పాత్రలో నటించడం కష్టం అనిపించిందా..?
స) నాకు దేవుడిపై మొదటి నుండి విశ్వాసం ఉంది. నేను భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇలా అన్ని చదివాను. గాడ్ వర్షిప్ లో డిఫరెంట్ స్టేజిలను చూశాను. వాటిని ఈ సినిమాలో క్యారెక్టర్ ద్వారా చెప్పడానికి ఒక అవకాశం లభించింది. నాస్తికుడిగా నటించడం పెద్ద కష్టం అనిపించలేదు. నువ్వు పాత్రను ఎలా తీసుకుంటావ్ అనే విషయంపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న) శ్రేయ క్యారెక్టర్ గురించి చెప్పండి..?
స) టిపికల్ హౌస్ వైఫ్ క్యారెక్టర్లో శ్రేయ నటించింది. చాలా మంది మహిళలు, ముఖ్యంగా పెళ్ళైన వారు శ్రేయ క్యారెక్టర్ తో బాగా కనెక్ట్ అవుతారు. తను కూడా చాలా బాగా నటించింది.
ప్రశ్న) దర్శకుడిగా ‘గోపాల గోపాల’ కథకు డాలీ ఎంతవరకూ న్యాయం చేశారు..?
స) గతంలో మా బ్యానర్లో నిర్మించిన సినిమాలకు డాలీ పని చేశారు. అతనితో ఎప్పటి నుండో పరిచయం ఉంది. దర్శకుడిగా మంచి ప్రతిభను కనబరిచాడు. సన్నివేశాలను అద్బుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా కోసం డాలీ చాలా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివారు, రీసెర్చ్ చేశారు. అదంతా మీకు సినిమాలో కనబడుతుంది.
ప్రశ్న) అనూప్ రూబెన్స్ సంగీతం గురించి..?
స) సినిమాలో మూడు పాటలకు చక్కటి సంగీతం అందించాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న అతనికి ఇదొక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. ముఖ్యంగా రీ రికార్డింగ్ చాలా బాగా చేశాడు. అనూప్ మ్యూజిక్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అతనికి మంచి భవిష్యత్ ఉంది.
ప్రశ్న) ‘ఓ మై గాడ్’ కథలో తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు ఏవైనా చేశారా..?
స) పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైం కొంచం పెంచాం. స్క్రీన్ ప్లే పరంగా డిఫరెంట్ గా ఉంటుంది. కొన్ని కొత్త సీక్వెన్స్ యాడ్ చేశాం. అలాగే నా పాత్ర పరంగా ఒక ఇంట్రడక్షన్ సాంగ్, కుటుంబ నేపధ్యంలో కొన్ని సన్నివేశాలు జత చేశాం. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది.
ప్రశ్న) చాలా సున్నితమైన కథ, మత విశ్వాసాలతో ముడిపడి ఉంది. దీన్ని మీరు ఎలా డీల్ చేశారు..?
స) ఇతరుల మనోభావాలను మనం గౌరవించాల్సిన భాద్యత మనపై ఉంది. సినిమాలో ఎవరి మత విశ్వాసాలను కించపరిచే సన్నివేశాలు లేకుండా జాగ్రత్త తీసుకున్నాం. ఇటీవల సమాజంలో దొంగ స్వామిజీలు (ఫేక్ గాడ్స్) ఎక్కువ అయ్యారు. ప్రతి రోజు మనం టీవీలో అటువంటి వాటిని చూస్తున్నాం. ప్రస్తుత సమాజంలో భక్తిని కూడా వ్యాపారంలా మార్చేశారు. మన పిల్లలకు ఆధ్యాత్మిక విషయాలపై (స్పిరిచ్యువల్ నాలెడ్జ్) ఓ అవగాహనా కల్పించాలి. యువత కూడా జీవితం, ఆధ్యాత్మిక అంశాలపై క్లారిటీగా ఉన్నారు. వాటిపై ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ‘గోపాల గోపాల’ ఉంటుంది. దొంగ స్వామిజీలను ఎంకరేజ్ చేయవద్దని చెప్తున్నాం.
ప్రశ్న) మీరు, పవన్ ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించారు. మరి, అభిమానులను ఎలా శాటిస్ఫై చేశారు..?
స) ఫాన్స్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు కదా..! సినిమాను కొత్తగా చూస్తారు. వారిలో ఎటువంటి సందేహాలు లేవు. ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు.
ప్రశ్న) సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం..?
స) ఒక్క సన్నివేశం అని కాదు, నేను నటించిన గోపాలరావు క్యారేక్టరైజేషన్ సినిమాలో నాకు బాగా నచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టం. అరుదుగా లభిస్తాయి. గ్రాఫ్ ఆఫ్ క్యారేక్టరైజేషన్ బాగుంటుంది. ఇన్నోసెంట్, హానెస్ట్, న్యాచురల్ గా అతని క్యారెక్టర్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది.
ప్రశ్న) మహేష్, పవన్ లతో మీరు నటించారు. ఎవరితో బాగా కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ..?
స) ఇద్దరితోనూ… మహేష్, పవన్ ఇద్దరితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. ఇద్దరూ మంచి యాక్టర్స్. భవిష్యత్ లో కూడా వీరితో మళ్లీ కలసి నటించాలనుకుంటున్నాను.
ప్రశ్న) మరో మల్టీస్టారర్ సినిమాలో ఎప్పుడు నటిస్తారు..?
స) ఒక నటుడిగా మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. నటించం నా చేతుల్లో ఉంటుంది, కథలను మాత్రం నేను రాయలేనుగా.. మంచి కథల కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటాను. దర్శకులు అటువంటి కథలతో ముందుకు రావాలి. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.
CLICK HERE FOR ENGLISH INTERVIEW