సమీక్ష : ఖైదీ – ఎమోషన్ తో సాగే యాక్షన్ థ్రిల్లర్ !

సమీక్ష : ఖైదీ – ఎమోషన్ తో సాగే యాక్షన్ థ్రిల్లర్ !

Published on Oct 26, 2019 3:02 AM IST
Khaidi movie review

విడుదల తేదీ : అక్టోబర్ 25, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : కార్తీ, నరైన్,రమణ, దీనా తదితరులు

దర్శకత్వం : లోకేష్ కనకరాజ్

నిర్మాత‌లు : ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, తిరుప్పూర్ వివేక్

సంగీతం : శ్యామ్ సీఎస్

సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్

ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్

 

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

కేవలం కథను మాత్రమే నమ్ముకుని చేసిన సినిమా ఇది. జీవిత ఖైదు చేయబడిన ‘ఢిల్లీ’ (కార్తీ) అనే ఖైదీ తన జీవితంలో మొదటిసారి తన కూతురుని చూడటానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంతో ఆశతో జైలు నుండి బయల్దేరతాడు. కానీ మధ్యలో అనుకోకుండా అతనికి పోలీసుల ప్రాణాలనే కాపాడాల్సిన పరిస్థితి వస్తోంది. దానికి మొదట్లో అతను అంగీకరించకపోయినా చివరికీ కూతురు భవిష్యత్తు కోసం ఆ పనికి పూనుకుంటాడు. ఈ క్రమంలో పోలీసులను చంపడానికి తిరుగుతున్న డ్రగ్ గ్యాంగ్స్ నుండి ‘ఢిల్లీ’ వాళ్ళను ఎలా సేవ్ చేశాడు ? సేవ్ చేసే క్రమంలో ఎలాంటి సంఘటనలను అవరోధాలను అతను ఎదుర్కోవాల్సి వచ్చింది ? ఇంతకీ అతను ఆ సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి అతన్ని ఏ ఎమోషన్ బలంగా ముందుకు నడిపించింది ? అనేది ఈ సినిమా స్టోరీ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా కథ మొత్తం ఒక రాత్రి నాలుగు గంటల సమయంలోనే జరుగుతున్నా స్క్రీన్ ప్లే చాల వరకూ టైట్ గానే సాగుతుంది. పైగా నైట్ ఎఫెక్ట్ లో అది కూడా చాల యాక్షన్ సీన్స్ ను దట్టమైన అటవీ ప్రాంతంలో చూపించాల్సి వచ్చినా ఎక్కడా సీన్ మూడ్ చెడకుండా లైటింగ్‌ ను సహజంగా కనిపించేలా సెట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి కథ సింపుల్ గా ఉన్న ప్రతి సీక్వెన్స్ లో ప్లే ఇంట్రస్టింగ్ గా ఉంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. ఇక కార్తీ, ఖైదీ పాత్రలో అద్భుతంగా నటించారు. క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కూతురు మీద ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశంలో అలాగే తన గతం వివరించే సీన్ లో మరియు కూతుర్ని కలుసుకునే సీన్ లో కార్తీ నటన ఎమోషనల్ గా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

అయితే కమర్షియల్‌ సినిమా అనగానే ప్రధానంగా ముచ్చటించుకునే హీరోయిన్‌, సాంగ్స్ మరియు కామెడీ ఈ సినిమాలో లేకపోయినా.. వాటికి మించిన కథ, బలైమన ఎమోషన్, అలాగే ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో ఉన్నాయి. కేవలం కథ డిమాండ్‌ మేర సన్నివేశాలను రాసుకున్న దర్శకుడు లోకేష్‌ డెడికేషన్‌ ను మెచ్చుకోవాల్సిందే.

ఈ మధ్య వస్తోన్న సినిమాల్లో చాల వరకూ యాక్షన్‌ బేస్డ్‌ సినిమాలే అయినా ఖైదీ మాత్రం డైహార్డ్‌ యాక్షన్‌ అభిమానులను కూడా ఆకట్టుకునే యాక్షన్ మూవీ. రెగ్యూలర్ సినిమా లెక్కలను పక్కన పడేసి.. కథలోని పాత్రల మధ్య సంఘర్షణనే నమ్ముకుని… పైగా ఆ సన్నివేశాలను అలాగే తెరకెక్కించడం అంటే.. అది ఒక రేర్‌ అటెంప్టే. అనవసరపు సన్నివేశాలను ఇరికించకుండా కథకు అనుగుణంగా సినిమా మొదటి ఫ్రేమ్‌ నుండి చివరి ఫ్రేమ్‌ వరకూ దర్శకుడు సినిమాని బాగా నడిపాడు. ఇక కార్తీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

మంచి స్టోరీతో, దర్శకుడు మంచి అటెంప్ట్ చేసినా కథలో పెద్ద స్పాన్ లేకపోవడంతో సినిమాలో ఎక్కువగా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను పెట్టే అవకాశం మిస్ అయింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో కంటెంట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే ఆ స్థాయిలో ఆకట్టుకోదు. అయితే సెకెండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ డ్రా బ్యాక్ ను చాల కవర్ చేసింది. కానీ మొత్తంగా సినిమాలో పెద్దగా కమర్షియక్ ఎలిమెంట్స్ (సెకెండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ లో వచ్చే సీన్స్ మినహా) లేకపోవడం రెగ్యూలర్ కమర్షియల్ మూవీస్ ను ఇష్టపడేవారిని ఈ సినిమా ఎంత ఆకట్టుకుంటుందనేది చూడాలి.

పైగా మెయిన్ ప్లాట్ లోనే లాజిక్ మిస్ అవ్వడం సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్. పోలీసులకు డ్రగ్స్ ఇవ్వడం.. డ్రగ్ గ్యాంగ్ వారిని చంపడానికి తిరగడం.. అన్నిటికి మించి ఏకంగా పోలీస్ స్టేషన్ మీద రౌడీ గ్యాంగ్స్ వచ్చి అతి దారుణంగా దాడి చేయడం ఇవ్వన్ని పక్కా సినిమాటిక్ గానే సాగుతాయి. ఇలాంటి ఫీల్ గుడ్ ఎమోషన్ థ్రిల్లర్ లో ఇలాంటి సిల్లీ ట్రీట్మెంట్ ను రాసుకోకుండా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ మొదలైన చాల సేపటి తరువాత గాని ప్రేక్షకుడు కథలోకి ఇన్ వాల్వ్ అవ్వలేడు. పైగా ఆ సీన్స్ అన్ని కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, రిలీఫ్ కి కూడా ఎలాంటి కామెడీ లేకపోవడంతో ఫస్ట్ హాఫ్ కొంతవరకు నిరాశ పరుస్తోంది. ఇక తండ్రి కూతుర్ల మధ్య ఎమోషన్ సెకెండ్ హాఫ్ లో బాగా ఎలివేట్ చేసినా.. ఆ ఎమోషన్ని ఫస్ట్ హాఫ్ లో కూడా ఆ రేంజ్ లోనే ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్ గా ఉండేది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే కెమెరామెన్ సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో యాక్షన్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆయన. అలాగే శ్యామ్ సీఎస్ అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉంది. హీరో తన కూతురు కోసం ఎంతగా పరితప్పిస్తున్నాడో ఆయన తన నేపథ్య సంగీతంతో అంతే బాగా ఎలివేట్ చేశారు. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడు లోకేష్ మంచి సినిమా తీశారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన సినిమా తీసి ఉంటే ఈ సినిమా కమర్షియల్ గా కూడా మరో స్థాయిలో ఉండేది.

 

తీర్పు :

విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బలమైన యాక్షన్ అండ్ ఎమోషన్ తో పాటు కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాల వరకూ ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో చాల సన్నివేశాలు బోర్ గా సాగడం, కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం, కొన్ని కీలకమైన సీక్వెన్స్ లో లాజిక్ మిస్ అవడం లాంటి అంశాలు సినిమా రిజల్ట్ ను దెబ్బ తీశాయి. అయితే కార్తీ అద్భుతమైన నటనతో పాటు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వ పనితనం కూడా సినిమా స్థాయిని పెంచాయి. ఓవరాల్ గా యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మరి మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తోందో చూడాలి.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు