సమీక్ష : ఎం.ఎల్.ఏ – రెగ్యులర్ కమర్షియల్ సినిమా

సమీక్ష : ఎం.ఎల్.ఏ – రెగ్యులర్ కమర్షియల్ సినిమా

Published on Mar 24, 2018 3:41 PM IST
MLA movie review

విడుదల తేదీ : మార్చి 23, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : కళ్యాణ్ రామ్, కాజల్

దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్

నిర్మాత : భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి

సంగీతం : మణిశర్మ

సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మురెళ్ళ

ఎడిటర్ : తమ్మిరాజు

కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎం.ఎల్.ఏ’. ఈరోజె విడుదలైన ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎంతమేర ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

కథ:

కొన్ని అనుకోని కారణాల వల్ల ఇందు (కాజల్) ఇంట్లోనుండి బయటికి వచ్చి ఒక కంపెనీకి ఎం.డి అవుతుంది. అక్కడ కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) ఇందును చూసి ప్రేమిస్తాడు. కొంతకాలం తరువాత ఇద్దరు ఇష్టపడతారు. ఒక సందర్భంలో ఇందు తల్లితండ్రులు ఇందుతో పెళ్లి జరగాలంటే ఎం.ఎల్. ఏ అవ్వాలని కళ్యాణ్ కు షరతు పెడతారు. అసలు ఇందు తల్లిదండ్రులు కళ్యాణ్ కు ఎం.ఎల్.ఏ అవ్వాలనే కండిషన్ ఎందుకు పెట్టారు ? ఎం.ఎల్.ఏ అవ్వడానికి కళ్యాణ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

కథానాయకుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. నటుడిగా అయన చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫిట్ గా కనిపిస్తూ సరికొత్త లుక్స్ తో ఆకట్టుకున్నారు. మాస్ డైలాగ్స్ బాగా చెప్పి అలరించాడు. రవికిషన్ కు కళ్యాణ్ రా కు మధ్యన జరిగే సన్నివేశాలు చాలా బాగా పండాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడ మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చారు.

కాజల్ అందం, అభినయం బాగున్నాయి. ద్వితీయార్థంలో పల్లెటూరు అమ్మాయిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి మెప్పించింది. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్విల కామెడి పరువాలేదు. మంచి లొకేషన్లలో చిత్రీకరించిన మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట బాగుంది.

ఇంటర్వెల్ సన్నివేశం బాగుంది. దాని వలన సెకండాఫ్ మీద ఆసక్తి పెరిగింది. ఇక ద్వితీయార్థంలో పేద ప్రజలకు హీరో చేసే మేలు, వారి కోసం ఆలోచించే విదానం బాగున్నాయి. నిర్మాతలు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను రూపొందించి క్వాలిటీ సినిమాను అందించారు.

మైనస్ పాయింట్స్ :

అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం ఎంఎల్ఎ అవ్వాలనుకోవడం కొత్త పాయింట్. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ రాసుకున్న ఈ లైన్ బాగున్నా దాన్ని తెరమీద ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరుకు విఫలమయ్యాడని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు, స్క్రీన్ ప్లే రెగ్యులర్ గా ఉంది. అందుచేత సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కథకు పెద్దగా కనెక్ట్ కాలేడు.

హీరో విలన్ తో ఛాలెంజ్ చేసి ప్రజలకు మంచి చేయటం వంటి అంశాలని ఇదివరకే చాలా సినిమాల్లో మనం చూసాం. ఈ సినిమా కూడా అదే ధోరణిలో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కంపెనీలో చాలా సన్నివేశాలు సినిమాకు అవసరం లేదనే భావన కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగున్నా, అప్పుడే సినిమాలోని అసలు కథ మొదలైనా తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుల్లకు సులభంగా తెలిసిపోతుంటుంది. దీంతో సినిమా పట్ల పెద్దగా ఎగ్జైట్మెంట్ అనేది కలుగదు.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాతో దర్శకుడిగా మారిన ఉపేంద్ర మాధవ్ తను రాసుకున్న పిల్లలకు ఆస్తులు ఇస్తే అవి ఉంటేనే బ్రతుకుతారు, అదే చదువు ఇస్తే ఎలాగైనా బ్రతుకుతారు వంటి డైలాగ్స్ బాగున్నాయి. కానీ దర్శకుడిగా మాత్రం జస్ట్ ఓకే అనే పనితనం మాత్రమే కనబర్చాడు. రొటీన్ స్టోరీని ఎంచుకుని పర్వాలేదనే రీతిలో సినిమాను తెరకెక్కించారు.

ప్రసాద్ మురెళ్ళ కెమెరా పనితనం బాగుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాకు పనిచేసిన ఆయన ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. మణిశర్మ పాటలకు అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. పైన చెప్పినట్టు నిర్మాణ విలువలు మంచి స్థాయిలోనే ఉన్నాయి.

తీర్పు:

మొత్తం మీద ఈ ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం అక్కడక్కడా అలరించిన రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనొచ్చు. కళ్యాణ్ రామ్, రవికిషన్ ల మద్యన నడిచే సన్నివేశాలు, ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్న స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే వలన ఇందులో ఎలాంటి కొత్తదనం దొరకదు. కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని కోరుకునే వారికి ఈ చిత్రం సరిపోతుంది కానీ కొత్తదనం ఆశించేవారు మాత్రం వేరే ఆప్షన్ చూసుకోవడం మంచిది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు