ఇంటర్వ్యూ : నాగ చైతన్య – గతంలో నేను కొన్ని తప్పులు చేసాను..

ఇంటర్వ్యూ : నాగ చైతన్య – గతంలో నేను కొన్ని తప్పులు చేసాను..

Published on May 9, 2013 10:15 PM IST

Naga-Chaithanya

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘తడాఖా’ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో సునీల్ నాగచైతన్య అన్నయ్యగా కనిపిస్తాడు. ఈ సినిమాలో తమన్నా, ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్ గా నటించారు. ‘తడాఖా’ మంచి విజయాన్ని అందుకొని, తనకి బ్రేక్ ఇస్తుందని నాగ చైతన్య ఎంతో నమ్మకంగా ఉన్నాడు. రేపు సినిమా రిలీజ్ అవుతున్న కారణంగా ఈ రోజు నాగ చైతన్య మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీరు సినిమా ఫైనల్ వెర్షన్ చూసారా?

స) చూసాను. ప్రసాద్ లాబ్స్ లో ఫుల్ సినిమా చూసాను. సినిమా ఫైనల్ వెర్షన్ తో నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. సినిమా చూసిన తర్వాత నా నమ్మకం ఇంకా బలపడింది. ‘తడాఖా’ నాకు పెద్ద బ్రేక్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలను.

ప్రశ్న) ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఏమేమి ఆశించవచ్చు?

స) ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు పెద్ద హైలైట్ అవుతాయి. అవి కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే ఫీల్ ఉంటుంది. స్టొరీలో ఉండే ఎమోషనల్ సీన్స్, అలాగే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ప్రశ్న) ‘వెట్టై’ సినిమాని అలాగే రీమేక్ చేసారా లేక స్టొరీ లో ఏమన్నా మార్పులు చేసారా?

స) తెలుగు వెర్షన్ కోసం చిన్న చిన్న మార్పులు చేసాం. తెలుగులో తమిళ్లో కంటే ఎక్కువ కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండాఫ్ లో చాలా వరకూ మార్పులు ఉంటాయి. అలాగే నా పాత్రలో కూడా మార్పు ఉంటుంది. తమిళ్ వెర్షన్ ఆర్య పాత్రలో పోల్చుకుంటే నా పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ లో సునీల్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది.

ప్రశ్న) వీటన్నిటితో సినిమా ఇంకా బెటర్ అయ్యిందని అనుకుంటున్నారా?

స) విషయం ఏమిటంటే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తేడాలున్నాయి. రీమేక్ సినిమా కదా అని సీన్ టు సీన్ మక్కికి మక్కీ దించినట్టు దించలేదు. మొదట కథని బాగా స్టడీ చేసి, ఇక్కడి వాళ్ళకి ఎలా చెప్తే కనెక్ట్ అవుతుందో చూసి వారికి తగ్గట్టు మార్చి తీశాము.

ప్రశ్న) మీకు మాస్ పాత్రలు చేయడం అంటే ఇష్టమా?

స) అవును. నాకు మాస్ పాత్రలంటే చాలా ఇష్టం. కానీ నా టాలెంట్ నిరూపించుకునే మాస్ పాత్రలు గతంలో రాలేదు. నా గత సినిమాల్లో రీచ్ అయ్యేంత మాస్ పాత్రలు లేవు. ఆ సినిమాలన్నీ మల్టీ ప్లెక్సుల్లో, ఎ సెంటర్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ సినిమాతో మాస్ హీరోగా సక్సెస్ అవుతాను.

ప్ర) ఇలాంటి సినిమాకి డైరెక్టర్ డాలీనే సరైన ఎంపిక అని మీరు నమ్ముతున్నారా?

స) అవును. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలో అతని టేకింగ్ నాకు బాగా నచ్చింది. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అతను కూడా నాలాగే మాస్ డైరెక్టర్ గా నిరూపించుకోవాలని సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే డాలీ డైరెక్టర్ లింగుస్వామికి పెద్ద ఫ్యాన్. కావున ఈ సినిమా రీమేక్ కి డాలీనే సరైన చాయిస్ అని ఎంచుకున్నాము.

ప్రశ్న) మీరు సక్సెస్ అందుకొని కొంత కాలం గడిచిపోయింది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని ఏమన్నా ఒత్తిడికి లోనయ్యారా?

స) ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సినిమా సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ ఉన్నా సరికాదు. ఇలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం వల్ల నటుడిగా నేను కాస్త నిరాశకు గురయ్యాను. గతంలో నేను కొన్ని తప్పులు చేసాను, ప్రస్తుతం వాటన్నిటినీ మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెండు సినిమాలన్నా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అలా అని నా దగ్గరికి వచ్చిన ప్రతి స్క్రిప్ట్ కి ఓకే చెప్పను. మంచి కథ అయితేనే ఓకే చెప్తాను.

ప్రశ్న) ‘ఆటో నగర్ సూర్య’ ఏమయ్యింది?

స) సినిమా పూర్తయ్యింది, త్వరలోనే రిలీజ్ అవుతుంది.

ప్రశ్న) సునీల్ తో కలిసి పని చెయ్యడం ఎలా ఉంది?

స) సునీల్ నా బ్రదర్ లాంటి వారు. అతను తోటి వారిని బాగా ప్రోత్సహించే మనస్తత్వం కలవాడు, నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అలాగే సునీల్ సూపర్బ్ డాన్సర్.

ప్రశ్న) ఒక నటుడిగా మీరు ఇంకా మెరుగు పరుచుకోవాల్సింది ఉందని అనుకుంటున్నారా?

స) అవునండి. నటుడుడనే వాడు సినిమా సినిమాకి నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి నటుడు ఎప్పటికప్పుడు తనని తానూ మెరుగు పరుచుకోవాల్సి ఉంటుంది ‘లేదంటే కెరీర్ అక్కడితో ఆగిపోతుంది’ (నవ్వుతూ)..

ప్రశ్న) మీ అన్ని సినిమాల్ని ఎ.ఎన్.ఆర్ గారు చూస్తారా? మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు?

స) నా వరకూ ఎ.ఎన్.ఆర్ గారు చాలా గొప్ప మూవీ క్రిటిక్. ఆయన చాలా నిక్కచ్చిగా మాట్లాడే మనిషి, అలాగే ఏమీ దాచుకోకుండా ఫీడ్ బ్యాక్ ఇస్తారు. చెప్పాలంటే సినిమా చూసి మొదట నాకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ చెప్పి ఆ తర్వాత సినిమాలోని మంచి వాటి గురించి చెప్తారు.

ప్రశ్న) విమర్శలను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారా?

స) నేను విమర్శలను చాలా ఓపెన్ గా తీసుకుంటాను. వాటి వల్లే నన్ను నేను మెరుగు పరుచుకోగలుగుతున్నాను. కొంతమంది సినిమా బాలేదని చెప్తారు, అప్పుడు సినిమాలో ఏమేమి తప్పులు జరిగాయో చూసుకుంటాను. మనల్ని మార్చుకోవడానికి చెప్పే ఫీడ్ బ్యాక్ ఎప్పుడూ మంచిదే.

ప్రశ్న) ఈ సినిమా తర్వాత మీరు చేస్తున్న సినేమాలేమిటి?

స) మా ఫ్యామిలీ మొత్తం చేస్తున్న ‘మనం’ జూన్ లో మొదలవుతుంది. ఎవ్వరూ ఊహించలేని లైన్ తో వస్తున్న ఈ సినిమా అందరినీ థ్రిల్ చేస్తుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ప్రశ్న) ‘గుండమ్మ కథ’ రిమేక్ సంగతి ఏమయ్యింది? ఆ సినిమా ఆపై మీరు ఇంకా ఆసక్తిగానే ఉన్నారా?

స) ‘గుండమ్మ కథ రీమేక్ చెయ్యాలని తారక్ కి నాకు ఆసక్తి ఉంది’ కానీ ఆ సినిమాని డీల్ చేయగల సరైన డైరెక్టర్, సరైన నటీనటులు కావాలి. ఇవన్నీ దొరకగానే కచ్చితంగా సినిమా చేస్తాము.

ప్రశ్న) బాలీవుడ్ కి వెళ్ళడానికి మీరేమన్నా ప్లాన్స్ వేసుకుంటున్నారా?

స) (నవ్వుతూ) అలాంటిదేమీ లేదు. ఇక్కడే నేను హ్యాపీ గా ఉన్నాను, బాలీవుడ్ కి వెళ్ళే ఎలాంటి ప్లాన్స్ లేవు.

ప్రశ్న) మీ కథల ఎంపికలో నాగార్జున గారి పాత్ర ఉంటుందా?

స) నాన్నగారు నాకు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. నాకు స్క్రిప్ట్ నచ్చితే నేను ఆయనకి చెప్తాను అప్పుడు ఆయన నాకు కొన్ని ఐడియాలు ఇస్తారు. నేను నాన్న గారితో అసలు చర్చించకుండా చేసిన ఒకే ఒక్క సినిమా ‘ఆటోనగర్ సూర్య’.

ప్రశ్న) నాగార్జున గారు కొత్త వారిని, కొత్త కొత్త టెక్నిక్స్ ని ప్రోత్సహించడంలో ముందుంటారు, మీరు కూడా ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తారా?

స) నేను టాలెంట్ ఉన్న కొత్త వారిని ప్రోత్సహిస్తాను. చాలా కొత్తరకమైన కథలు, టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే నా మనసుకు హత్తుకునే కథ వస్తుందో అప్పుడు కచ్చితంగా వారితో కలిసి పని చేస్తాను. ప్రయోగాల విషయానికొస్తే ప్రతి సినిమా ఓ ప్రయోగమే. ఎందుకంటే ఒక సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అని సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ ఎవ్వరికీ తెలియదు.

ప్రశ్న) తమన్నాతో కలిసి పని చేయడం ఎలా ఉంది? తమన్నా మీతో పని చేయడం డార్లింగ్ తో పని చేసినట్టే అన్నారు..

స) (నవ్వుతూ) నాకు కూడా తమన్నా డార్లింగ్ లాంటిదే. మా కాంబినేషన్లో ‘100% లవ్’ సక్సెస్ అయ్యింది. ఎప్పుడైతే సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ చేస్తామో అప్పుడు వారిద్దరి మధ్యా కెమిస్ట్రీ ఇంకా బెటర్ అవుతుంది.

ప్రశ్న) మేరు సోషల్ నెట్వర్క్స్ లో లేరు. మీ ఫ్యాన్స్, సినీ ప్రేమికులను ఎలా సంప్రదిస్తారు?

స) నేను ఎలాంటి సోషల్ నెట్వర్క్స్ లో లేను. అలా అని నేను ఫ్యాన్స్ కి దూరంగా ఉన్నానని కాదు. నేను అందరికీ అందుబాటులో ఉంటాను, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. నాకు తెలిసి అందరూ ఫ్యాన్స్ తో మాట్లాడటం కంటే పబ్లిక్ లో వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడతారని నేను నమ్ముతాను. నాకు తెలిసి అది చెయ్యడానికి నా బాడీ ఉంది మిగతావి అవసరం లేదు.

ప్రశ్న) మీ హాబీస్ ఏమిటి?

స) నాకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం, నా దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది. నాకు అవి అంటే చాలా ఇష్టం. అలాగే బాడీ ఫిట్ నెస్ కార్యకలాపాలు అంటే చాలా ఇష్టం.

ప్రశ్న) సినిమా రేపు రిలీజ్ కానుంది? మీరేమన్నా భయపడుతున్నారా?

స) అవును. ‘తడాఖా’ సినిమా మీద బాగా అంచనాలున్నాయి, అందుకే కాస్త టెన్షన్ గా ఉంది. కానీ నేను చెప్పినట్టుగా మేమంతా సినిమా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాము. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

అంతటితో నాగ చైతన్య ఇంటర్వ్యూని ముగించారు. నాగార్జున గారిలానే నాగ చైతన్య కూడా ఎంతో సున్నితంగామాట్లాడే వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగిన జెంటిల్ మెన్. సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు