సమీక్ష : 1234 అందరూ ఇంజనీర్లే.. – లెస్ కామెడీ ఓవర్ ట్రాజిడీ

సమీక్ష : 1234 అందరూ ఇంజనీర్లే.. – లెస్ కామెడీ ఓవర్ ట్రాజిడీ

Published on Apr 13, 2013 12:51 AM IST
1234 విడుదల తేదీ : 12 ఏప్రిల్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : రాజేష్ లింగం
నిర్మాత : ఆర్. సత్యనారాయణ
సంగీతం : గంగై అమరన్
నటీనటులు : ప్రియా ఆనంద్, నందా, ఆజాద్, యామిని..

2010లో తమిళంలో ‘పుగైప్పడం’ పేరుతో విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద బిలో యావరేజ్ సినిమాగా నిలిచిన ఈ సినిమాని తెలుగులో ‘1234’ అందరూ ఇంజనీర్లే అనే ఉపశీర్షికతో డబ్ చేసి ఈ రోజు విడుదల చేసారు. రాజేష్ లింగం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియా ఆనంద్, నందా, ఆజాద్, యామిని, అమ్జద్, శివం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గంగై అమరన్ సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగులో ఆర్ సత్యనారాయణ అనువదించి విడుదల చేసారు. ఇంతకీ ఈ సినిమాకి 1234 అనే టైటిల్ ఎందుకు పెట్టారు, ఇంతకీ ఈ ఇంజనీర్లు ఏం చేసారు అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో జరుగుతుంది కానీ ఎవరు ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పాడు అని మాత్రం అడగకండి ఎందుకంటే సినిమాలో ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరికి తమ ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నారు అనే విషయాన్ని చూపించలేదు. ఇక కథలోకి వస్తే కోడై కెనాల్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్. ఆ కాలేజ్ లో ఇంజనీరింగ్ చెయ్యడానికి వచ్చి ఫ్రెండ్స్ గా మారిన 7 గురి లైఫ్ లో ఏమేమి సంఘటనలు జరిగాయనేదే ఈ సినిమా కథ. షైనీ జార్జ్ (ప్రియా ఆనంద్), కృష్ణ(అమ్జద్), నందా(నందా), గురు(శివం), బాల(హరీష్), గౌరీ(మ్రినాలినీ), క్రితికా రావు(యామిని) లు మంచి ఫ్రెండ్స్. వీళ్ళు తమ నాలుగేళ్ల ఇంజనీరింగ్ డేస్ ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. టూర్లు, సీనియర్లతో గొడవలు, రాగింగ్, అమ్మాయిలకు బీట్ వెయ్యడం లాంటివి వీళ్ళ ఎంజాయ్ మెంట్ లోని కొన్ని పార్ట్స్. అదే గ్యాంగ్ లో ఎవరికీ తెలియకుండా షైనీ – కృష్ణ లవ్ చేసుకుంటారు.

ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిన టైంలో కృష్ణ – షైనీలు తమ ప్రేమ గురించి ఫ్రెండ్స్ కి చెబుతారు. అప్పుడు వాళ్ళ గ్యాంగ్ లో అనుకోని ఓ విషాదం చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన తర్వాత ఫ్రెండ్స్ అందరూ విడిపోదాం అనుకుంటారు. అసలు ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన ఆ విషాదం ఏమిటి? చివరికి వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే విడిపోయారా? లేక కలిసే ఉన్నారా? అనేదే మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

ప్రియా ఆనంద్ నటన బాగుంది అలాగే ఆమె లుక్ చాలా నాచురల్ గా ఉంది. గౌరీ, గురు, క్రితికా రావు పాత్రలు పోషించిన వారు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడా కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని కొంతవరకూ నవ్వించగలిగారు. లెక్చరర్ స్టూడెంట్స్ ని మోటివేట్ చేసే సీన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా చివరి 20 నిమిషాల వరకూ 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ సినిమాని పోలి ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకూ మన గ్రామాల్లో ఉండే ఎడ్ల బండి కంటే స్లోగా వెళుతుంది. అంత స్లోగా పోతుంటే థియేటర్లో ప్రేక్షకులకి బోర్ కొట్టి ఎలాగో ఏసీ ఉందికదా అని అలా ఓ కునుకు తీస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో చాలా సొల్లు కామెడీ, కొంతమంది నటీనటులు విచిత్రమైన హావ భావాలతో, నటనతో ప్రేక్షకుల్ని భయపెట్టారు.  ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ స్లోగా సాగడమే కాకుండా క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్, ట్రాజెడీ సన్నివేశాలు ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టుకునేలా చేసాయి. క్షమించాలి కన్నీళ్లు పెట్టుకునేలా అంటే మీరు నిజంగా అంత సెంటిమెంట్ ఉందనుకునేరూ, ఈ సినిమాకి వచ్చి బలైపోయాం కదా అని ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

డైరెక్టర్ రాజేష్ ఎన్నుకున్న కథని శేఖర్ కమ్ముల ఎప్పుడో అత్యద్భుతంగా చూపించేయడం వల్ల మన తెలుగు ఆడియన్స్ కి సినిమా చూస్తున్నత సేపు హ్యాపీ డేస్ సినిమానే గుర్తొస్తుంది. డైరెక్టర్ రాజేష్ లింగంకి తొలి సినిమా కావడం, దర్శకత్వం పట్ల అవగాహన లేకపోవడం వల్ల తను అనుకున్న కథకి కనీస న్యాయం కూడా చెయ్యలేక పొయ్యాడు. సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. జరుగుతూ ఉన్న సీన్ పూర్తి కాకముందే మరో సీన్ కి వెళ్ళిపోవడం, చాలా సీన్స్ అసలు ఈ సీన్ కథకి అవసరమా అనే అనుమానాన్ని కలుగజేస్తాయి. ఎడిటింగ్ లో జరిగిన తప్పో లేక డబ్బింగ్ లో జరిగిన తప్పో లేక దర్శకుడే అలా తీసాడో తెలియదు గానీ సినిమాలో ముందు రావాల్సిన సీన్స్ తరువాత రావడం, తరువాత రావాల్సిన సీన్స్ ముందు రావడం వల్ల ఆడియన్స్ అసలు ఏం జరుగుతోందా అనే గందరగోళంలో పడతారు.

సినిమా క్లైమాక్స్ మొదటి 5 నిమిషాలు చూసి ఆడియన్స్ పర్లేదే అనుకునే లోపు దాన్ని ఇంకో 10 నిమిషాలకి పైగా సాగదీయడం వల్ల ఆడియన్స్ కి తొక్కలో సినిమా అనే ఫీల్ వచ్చేస్తుంది. సినిమా సీన్ టు సీన్ ఆడియన్ ఊహించేలా ఉండడం. 90% తమిళ సినిమాల్లో లాగానే ఈ సినిమాని క్లైమాక్స్ ని కూడా ట్రాజిడీతో ముంగించడం తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేరు. చివరిగా అసలు ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. టైటిల్ కి కథకి ఏ మాత్రం సంబంధం లేదు.

సాంకేతిక విభాగం :

రాజేష్ లింగం రాసుకున్న కథ పక్కన పెడితే, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లాగా ఈ సినిమా స్క్రీన్ ప్లే కి కూడా నెగటివ్ మార్క్స్ వెయ్యాలి. కథ, స్క్రీన్ ప్లే కి తగ్గట్టునే డైరెక్షన్ కూడా చాలా అధ్వానంగా ఉంది. స్క్రీన్ ప్లే తర్వాత సినిమాకి మరో మేజర్ మైనస్ ఎడిటింగ్. తమిళ్ కంటే తెలుగు వెర్షన్ బాగుండాలనే ఉద్దేశంతో ఓ ఎడిటర్ ని పెట్టి కొంత భాగం కత్తిరించారు కానీ ఉపయోగం లేకుండా పోవడమే కాకుండా చాలా దారుణంగా తయారయ్యింది. సినిమా మొత్తం కొడై కెనాల్ లో తీసినా సినిమాటోగ్రాఫర్ మాత్రం ఒకటి రెండు సీన్స్ లో తప్ప మిగతా సీన్స్ లో ఆ ఫీల్ మరియు ఆ లుక్ ని తీసుకురాలేకపోయాడు. డైలాగ్స్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. గంగై అమరాన్ అందించిన పాటల్లో ఒక మెలోడీ సాంగ్ పరవాలేదు కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

తీర్పు :

1234 అందరూ ఇంజనీర్లే అనే సినిమా బాక్స్ ఆఫీసు వద్ద చెప్పినట్లు నాలుగు రోజులు కూడా ఆడదు. ప్రియా ఆనంద్, మరో ఇద్దరి నటుల నటన తప్పితే సినిమాలో చెప్పుడానికి, చూడటానికి ఏమీ లేదు. కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మొదటి నుండి చివరి వరకూ సినిమా స్లోగా ఉండడం ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. ఈ సినిమాకి వెళ్ళడం కంటే ఇంట్లో కూర్చొని డివిడిలో మళ్ళీ ఓ సారి ‘హ్యాపీ డేస్’ సినిమా చూస్తే మీకు ఫీల్ కి ఫీలు వస్తుంది, మనీ కూడా సేవ్ అవుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు