సమీక్ష : 143 హైదరాబాద్ – కాస్త బోర్.. కాస్త సస్పెన్స్..

సమీక్ష : 143 హైదరాబాద్ – కాస్త బోర్.. కాస్త సస్పెన్స్..

Published on May 25, 2013 3:50 AM IST
143-Hyderabad విడుదల తేదీ : 24 మే 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : ఆనంద్ చక్రవర్తి
నిర్మాత : శ్రీనివాస దామెర, లక్ష్మణ్
సంగీతం : ‘ సెల్వ గణేష్
నటీనటులు : ఆనంద్ చక్రవర్తి, దన్సిక, జగన్, లక్ష్మీ నాయర్, అర్జున్ రామ్సి..


ఆనంద్ చక్రవర్తి, దన్సిక, జగన్, లక్ష్మీ నాయర్, అర్జున్ రామ్సి ప్రధాన పాత్రల్లో నటించిన ‘143 హైదరాబాద్’ అనే డబ్బింగ్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2010 డిసెంబర్లో ‘నిల్ గవాని సెల్లతేయ్’ పేరుతో తమిళంలో విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఒక సైకో కిల్లర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని 1974 లో వచ్చిన ‘ది టెక్సాస్ చైన్ సా మాసకర్’ సినిమాని స్పూర్తిగా తీసుకొని తీసారు. ఆనంద్ చక్రవర్తి డైరెక్ట్ చేస్తూ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. సెల్వ గణేష్ మ్యూజిక్ అందించిన ఈ ‘143 సినిమా హైదారాబాద్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

శాం(ఆనంద్ చక్రవర్తి) – ఓ బిజినెస్ మాన్, అరుణ్(అర్జున్ రామ్సి) – ఒక ఆవారా కుర్రాడు, జో(దన్సిక) – ఓ హీరోయిన్, మిలో(జగన్) – గర్ల్ ఫ్రెండ్ కోసం అన్వేషించే ఓ జులాయి, ప్రియ(లక్ష్మీ నాయర్) – ఆర్కియాలజిస్ట్.. కట్ చేస్తే వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. ప్రియా టెంపుల్స్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కోసం అని ప్రియ లండన్ నుండి వైజాగ్ లో ఉన్న తన ఫ్రెండ్ జో వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇలా కలిసిన ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ హాలిడే ట్రిప్ కోసం గోవా వెళ్లాలని ప్లాన్ చేసారు. ఇంతలో ప్రియ హైదరాబాద్ కి దగ్గర్లోని తెల్లూరు టెంపుల్ కి వెళితే తన ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఫ్రెండ్స్ ని అడిగితే వాళ్ళు కూడా ముందు టెంపుల్ కి వెళ్లి అక్కడి నుండి గోవా వెళ్దామని ప్లాన్ చేస్తారు.

అనుకున్న దాని ప్రకారం తెల్లూరు టెంపుల్ కి బయలు దేరిన వారికి మార్గ మధ్యంలో ఓ అనుకోని సంఘటన ఎదురవుతుంది. దానినుండి బయటపడదామని ప్రయత్నించి వారు ఇంకా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటారు. అక్కడ ఎవరో ఓ గుట్టు తెలియని వ్యక్తి వీళ్ళ బ్యాచ్ లోని ఒక్కొక్కర్ని చంపేస్తుంటాడు. ఆ ఐదు మంది ప్రెండ్స్ ఎదుర్కొన్న సంఘటన ఏంటి? అసలు చంపుతున్నది ఎవరు? ఎందుకు చంపుతున్నాడు? సమస్యలో చిక్కుకున్న 5 మంది ఫ్రెండ్స్ లో ఎంతమంది బతికి బయట పడ్డారు? అనేదే మిగిలిన కథాంశం..

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో కీలక పాత్రలు పోషించిన ఆనంద్ చక్రవర్తి, దన్సిక నటనలు బాగున్నాయి. ముఖ్యంగా దన్సిక తనకు ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. భయపడే సన్నివేశాల్లో హావ భావాలు బాగా పలికించింది. అజగం పెరుమాళ్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రకి తగ్గట్టు నటించారు. జగన్, లక్ష్మీ నాయర్, అర్జున్ రామ్సి లు తమ పరిధిమేర నటించారు. సెకండాఫ్ లో వచ్చే థ్రిల్స్ బాగున్నాయి, అలాగే సెకండాఫ్ ని డైరెక్టర్ చాలా బాగా డీల్ చేసాడు. ముఖ్యంగా చంపేది ఎవరు అని రివీల్ చేసినప్పుడు అతనిపై ఓ పాటని షూట్ చేసారు. పాటలో లిరిక్స్ ఎలా ఉన్నా విజువల్స్ మాత్రం బాగున్నాయి. డైరెక్టర్ ఎంచుకున్న స్టొరీ లైన్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాలోని వారి ఇంట్రడక్షన్, వారి మధ్య వచ్చే రొటీన్ సీన్స్ తోనే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే స్టార్టింగ్ సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే ఓ సీన్ తప్ప మిగతా అంతా ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా కాస్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నవ్వించాలని ట్రై చేసారు కానీ అవి నవ్వు తెప్పించకపోగా ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి. సినిమానే సాగదీస్తున్నారు అంటే ఆ టైములో మన రేడియో ఎఫ్ఎం లలో చెప్పినట్టు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అన్నట్టు వరుసగా మూడు సాంగ్స్ వచ్చి ఆడియన్స్ ని బయటకి వెళ్ళేలా చేసాయి.

సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే క్లైమాక్స్ ఫైట్ సినిమాకి చాలా కీలకం కానీ ఆ ఫైట్ అంత ఎఫెక్టివ్ గా లేదు. సెకండాఫ్ మొత్తం హై రేంజ్ లో సస్పెన్స్ చూపించి క్లైమాక్స్ ని మాత్రం చాలా సింపుల్ ముగించేయడం ఆడియన్స్ కి కొంతవరకు నిరాశ కలిగిస్తుంది. సినిమాలో మొదటి నుంచి సస్పెన్స్ లేకపోవడంతో ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైనింగ్ అన్నా ఉండేలా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది. తమిళ్ వెర్షన్లో 140 నిమిషాలు ఉన్న సినిమాని తెలుగులో బాగా ఎఫెక్టివ్ గా రావాలని 120 నిమిషాలకే కుదించడంతో చాలా చోట్ల ఒక సీన్ పూర్తికాకముందే, మరో సీన్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటి సీన్స్ సినిమా ఫ్లోని, ఆడియన్ ఫీల్ ని పోగొడతాయి. డైరెక్టర్ సినిమాలో నటించకుండా ఒక్క దర్శకత్వం మీదే దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా టెక్నికల్ టీం గురించి మాట్లాడాలంటే మొదటగా డైరెక్టర్ ఆనంద్ చక్రవర్తి గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ సెకండాఫ్ ని రాసుకున్న విధానం చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని బాగా చూపించారు. అలాగే ఈ సినిమా ద్వారా ఓ మంచి మెసేజ్ ని కూడా ఇచ్చాడు. డైరెక్టర్ చేసిన తప్పేమిటంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి కమర్శియల్ ఎలిమెంట్స్ జోడించాలని తను సెకండాఫ్ లో చెప్పాలనుకున్న 1 గంట సినిమా కోసం మరో గంట ఫస్ట్ హాఫ్ ని జోడించడం, దాన్ని అంతంతమాత్రంగా రాసుకొని దానికన్నా దారుణంగా తీయడం వల్ల ఫస్ట్ హాఫ్ విషయంలో ఫెయిల్ అయ్యాడు.

జె లక్ష్మణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. తమిళ్ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు వెర్షన్లో దాదాపు 25 నిమిషాలకి పైఆ కట్ చేసినా ఎడిటర్ ఫస్ట్ హాఫ్ ని మాత్రం మెప్పించేలాగా ఎడిట్ చేయలేకపోయ్యాడు. సెల్వ గణేష్ అందించిన పాటలు ఎ ఒక్కటీ ఆకట్టుకోకపోయినా సస్పెన్స్ ఎపిసోడ్స్ కి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్సిక్ ఇచ్చాడు. డైలాగ్స్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘143 హైదరాబాద్’ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా, సెకండాఫ్ చాలా సస్పెన్స్ గా సాగుతుంది. సెకండాఫ్ చాలా ఫాస్ట్ గా సాగడం, ఆకట్టుకునే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్, దన్సిక నటన ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. చాలా బోర్ కొట్టించే ఫస్ట్ హాఫ్, అంతకన్నా ఘోరంగా అనిపించే పాటలు, ఏ మాత్రం ఎంటర్టైనింగ్ లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది కానీ పరమ చెత్తగా అనిపించే ఫస్ట్ హాఫ్ ని మీరు భరించగలిగితే సెకండాఫ్ ని ఎంజాయ్ చేస్తారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు