సమీక్ష : 3 – ప్రేక్షకుడి సహనానికి పరీక్ష

సమీక్ష : 3 – ప్రేక్షకుడి సహనానికి పరీక్ష

Published on Mar 30, 2012 8:53 PM IST
విడుదల తేది : 30 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్: 2/5
దర్శకుడు : ఐశ్వర్య ధనుష్
నిర్మాత : కె. విమలా గీత
సంగిత డైరెక్టర్ : అనిరుద్
తారాగణం : ధనుష్, శృతి హాసన్

ధనుష్, శృతి హాసన్ జంటగా ఐశ్వర్య ధనుష్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘3’. తమిళ్లో 3 పేరుతో వచ్చిన చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేసారు. ఈ చిత్రాన్ని తెలుగులో నట్టి కుమార్ ఈ రోజే విడుదల చేయగా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:
ప్రభు, భానుప్రియల ఏకైక ముద్దుల కొడుకు రామ్ (ధనుష్). ఇంటర్ చదువుతున్న రామ్, జనని (శృతి హాసన్)ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. జనని కూడా రామ్ ని ప్రేమిస్తుంది. వీరి ప్రేమను పెద్దలు మొదట్లో తిరస్కిరిస్తారు. తప్పనిసరి పరిస్తుతుల్లో వారు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తరువాత వీరి ప్రేమను పెద్దలు కూడా ఆదరిస్తారు. ఇక్కడినుండి కథ అనుకోని మలుపు తిరుగుతుంది. రామ్ ప్రవర్తన వింతగా ఉండటంతో అతని స్నేహితుడు శంకర్ డాక్టర్ ని సంప్రదించగా రామ్ విపరీతమైన కోపం మరియు విపరీతమైన ఆనందం లక్షణాలు ఉండే బైపోలార్ డిజార్డర్ అనే జబ్బుతో బాధ పడుతున్నట్లు చెబుతాడు. రామ్ బైపోలార్ డిజార్డర్ నుండి బైట పడ్డాడా? చివరికి ఏమైంది అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:
తెలుగులో అస్సలు క్రేజ్ లేని ధనుష్ సినిమాలకి ఇంత హైప్ ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే కేవలం కొద్ది నెలల క్రితం విడుదలైన ‘కొలవెరి’ అనే పాట వల్ల ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. ధనుష్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలు పోషించాడు. చిత్ర మొదటి భాగం అంతా ఇంటర్ చదివే కుర్రాడి పాత్రలో చిత్ర రెండవ భాగం అంతా బైపోలార్ డిజార్డర్ జబ్బుతో బాధ పడే పేషెంట్ పాత్రలో బాగా నటించాడు. శృతి హాసన్ చాలా అందంగా ఉంది. చిత్ర మొదటి భాగంలో అమాయకమైన కాలేజ్ యువతిగా చక్కటి నటన ప్రదర్శించింది. అనిరుద్ సంగీతంలో కొలవేరి మరియు కన్నులదా, పోవె పో పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బావుంది.

మైనస్ పాయింట్స్:
తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించని కథను దర్శకురాలు ఎంచుకుంది. కొలవేరి వల్ల ఇంత క్రేజ్ వచ్చింది కదా అని చాలా ఆశించి వచ్చిన ప్రేక్షకుడుకి మొదటి సన్నివేశంలోనే విషాదంతో రాబోయే ముప్పెనని సూచనగా ఇచ్చారు. చిత్ర మొదటి భాగంలో ఎంటర్టైన్మెంట్ కొంత వరకు ఉన్నప్పటికీ రెండవ భాగంలో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే స్థాయిలో ఉంటుంది. బైపోలార్ డిజార్డర్ జబ్బుతో బాధపడే పేషెంట్ గా ధనుష్ నటన బావున్నప్పటికీ అది తెలుగు ప్రేక్షకులకి ఏ మాత్రం నచ్చని విధంగా ఉంటుంది. శృతి హాసన్ నటన చిత్ర మొదటి భాగం వరకు బావున్నప్పటికీ చాలా సన్నివేశాల్లో ఏడుస్తూనే ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆమె ఏడుపు చూడలేక ఏడ్వాల్సిన పరిస్థితి. వీటన్నికీ తోడు భయంకరమైన విశాదంతపు ముగింపు ఉండటం తెలుగు ప్రేక్షకులకు అస్సలు రుచించని విషయం. సినిమాలో స్క్రీన్ప్లే లోపాలు చాలా ఉన్నాయి. ప్రేక్షకుడిని ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో తెలియని గందరగోళంలో పడేస్తుంది. రెండు సినిమాలు చూస్తున్నామా అనే అనుమానం వస్తుంది. మిగతా నటీ నటుల్లో శంకర్ పర్వలేధనిపించాగా మిగతావారు మాత్రం ఏడుస్తూ సహనాన్ని పరీక్షించారు.

సాంకేతిక విభాగం:
ఎడిటింగ్ చాలా నాసిరకంగా ఉంది, చాలా జంప్ కట్స్ ఉన్నాయి. డైలాగులు సాధారణంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మాత్రం పరవాలేదు. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి. ఐశ్వర్య ధనుష్ ఎంచుకున్న బైపోలార్ డిజార్డర్ కాన్సెప్ట్ కి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఆమె డైరెక్షన్లో మరో సినిమా వస్తుందంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

తీర్పు:
3 గంటలు సరదాగా గడుపుదామని మీరు 3 సినిమాకి వెళ్తే మాత్రం మిమ్మల్ని తప్పకుండ నిరాశ పరుస్తుంది. మొదటిభాగం వరకు పరవాలేధనిపించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించని రెండవ భాగంతో సహనాన్ని పరీక్షిస్తుంది. 3 సినిమాకి వెళ్ళకుండా ఉండటమే ఉత్తమం. చివరగా ఈ సినిమాకి 3 టైటిల్ ఎందుకు పెట్టారో వారికే తెలియాలి.

123తెలుగు.కాం రేటింగ్ : 2/5

Clicke Here For ‘3’ English Review

అశోక్ రెడ్డి -ఎం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు