సమీక్ష : 7 టు 4 – జస్ట్ ఓకే క్రైమ్ థ్రిల్లర్!

సమీక్ష : 7 టు 4 – జస్ట్ ఓకే క్రైమ్ థ్రిల్లర్!

Published on Apr 1, 2016 9:00 PM IST
7 to 4 review

విడుదల తేదీ : ఏప్రిల్ 1 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : విజయ్ శేఖర్ సంక్రాంతి

నిర్మాత : మిల్క్ మూవీస్

సంగీతం : శ్రీమతి స్నేహలతా మురళి

నటీనటులు : ఆనంద్ బచ్చు, రాజ్ బాలా, రాధికా, లౌక్య


ఆనంద్ బచ్చు, రాజ్ బాలా, రాధికా, లౌక్య ప్రధాన పాత్రల్లో నటించగా విజయ్ శేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘7 టు 4’. రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా ఒకే రాత్రిలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఒకే రాత్రి నేపథ్యంలో జరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

హైద్రాబాద్ నగరంలో రాత్రి వేళల్లో ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని పట్టుకొని వారికి చిత్ర విచిత్రమైన శిక్షలు వేస్తూ ఓ టీమ్ పని చేస్తుంటుంది. నరసింహా (ఆనంద్), రవి (రాజ్ బాలా), దుర్గ (లౌక్య), లిల్లీ (రాధికా) ఈ నలుగురూ కలిసి అనుమానితులుగా కనిపించే వ్యక్తులను, పోలీసులు టార్గెట్ చేసి ఉన్న దుండగులను, గతంలో అత్యాచారాలకు పాల్పడిన ముఠాలను వెంటాడి వారికి తాము ఎన్నుకున్న పద్ధతుల్లో శిక్షలు వేస్తుంటుంది.

అలా ఆ టీమ్ ఒకరోజులో రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకూ చేసే ప్రయాణం చుట్టూ తిరిగే కథే ‘7 టు 4’. ఈ టీమ్ ఎందుకు ఏర్పడిందీ? పోలీస్ డిపార్ట్‌మెంట్‌కీ, ఈ టీమ్‌కీ ఉన్న సంబంధం ఏంటి? వీరి ఒకరోజు ప్రయాణంలో ఎదురైన పరిస్థితులేంటీ? అన్న ప్రశ్నలకు సమాధానాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథ ద్వారా చెప్పాలనుకున్న ఆలోచన గురించి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సమాజాన్ని కుదిపేస్తోన్న అత్యాచారాలపై ఓ టీమ్ చేసే పోరాటంతో కథ చెప్పాలన్న ప్రయత్నం అభినందనీయం. ఇక ఆ కథను ఒకేరాత్రిలో జరిగే వివిధ సంఘటనలతో చెప్పడం కూడా బాగుంది. అత్యాచారాలకు పాల్పడేవారికి వేసే శిక్షలు కూడా కమర్షియల్ పంథాలో నడిచే సినిమాలను ఇష్టపడేవారికి బాగా నచ్చుతాయి. 100 నిమిషాల లోపే ఉన్న రన్‌టైమ్ కూడా ఓ ప్లస్ పాయింట్.

నటీనటులంతా కొత్తవారైనా తమ తమ పరిధిలో అంతా బాగానే నటించారు. ఆనంద్, రాజా, లౌక్య, రాధికా.. అందరూ తమ పాత్ర అవసరానికి తగ్గట్టుగా బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే కథలో ఒక పాయింట్‌ తప్ప ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ ఎక్కడా కనిపించకపోవడం గురించి చెప్పాలి. సినిమా మొత్తం రెండు, మూడు సస్పెన్స్ ఎలిమెంట్స్, కాస్త హింస కలిపి ఎమోషనే లేని పోలీస్ ఆపరేషన్‌లా కనిపిస్తుంది. దానికి తోడు చాలాచోట్ల వచ్చిన సన్నివేశాలే మళ్ళీ మళ్ళీ వస్తున్నట్లుగా కనిపిస్తుంటాయి. క్యారెక్టరైజేషన్స్ కూడా బలంగా ఉన్నట్లు కనిపించవు.

సెకండాఫ్‌ మొదలైనప్పట్నుంచీ, ప్రీ క్లైమాక్స్ వరకూ సినిమా బోరింగ్‌గా సాగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి హడావుడిగా సినిమాను ముగించేయడం కూడా ఓ మైనస్‍గా చెప్పుకోవచ్చు. ఇక కొన్ని చోట్ల హింస మరీ ఎక్కువైనట్లు కనిపించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసేది మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. పాటలన్నీ కథ పరంగా వచ్చేవే కాకుండా వినడానికి కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఉషా ఉతప్ పాడిన టైటిల్ సాంగ్ సినిమాకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. పూర్తిగా ఒకేరాత్రిలో జరిగే కథకు కావాల్సిన మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ ప్రభాత్ సరిగ్గా పట్టుకున్నారు. కొన్నిచోట్ల కెమెరా యాంగిల్స్ విషయంలో కొత్తదనం చూపే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా ఉంది.

దర్శక, నిర్మాత విజయ్ శేఖర్ విషయానికి వస్తే, ఒక సామాజిక అంశంపై నడిచే కథ చెప్పాలన్న అతడి ఆలోచన బాగుంది. అయితే ఆ కథను పూర్తి స్థాయి సినిమాగా మలిచేంత ఎమోషన్‍ను ఆయన కథలో చూపలేకపోయారు. దర్శకుడిగా అక్కడక్కడా ఆకట్టుకున్నా, పూర్తి స్థాయిలో మాత్రం కేవలం ఫర్వాలేదనిపించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

థ్రిల్లర్ కథాంశాల్లో చాలావరకూ ఒకే ఒక్క అంశం మేజర్ హైలైట్‌గా నిలుస్తూ, వాటిచుట్టూ చిన్న చిన్న కథలతో సినిమా నడుస్తూంటుంది. ‘7 టు 4’ సరిగ్గా అలాంటి ఒక్క పాయింట్‌నే హైలైట్‌గా చేస్కొని తెరకెక్కిన థ్రిల్లర్. సామాజిక అంశంతో ముడిపడిన కథ, అనవసర విషయాలకు పోకుండా నేరుగా కథనే చెప్పేయడం, నటీనటుల పనితనం లాంటి ప్లస్ పాయింట్స్‌తో వచ్చిన ఈ సినిమాలో ఎమోషన్ అన్నదే పెద్దగా లేకపోవడం, కొన్నిచోట్ల శృతి మించిన హింస లాంటివి మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇలాంటి కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు చూసేసి ఉన్నా, ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తోన్న అంశంపై ఓ పారాటంగా చేసిన సినిమాగా చూస్తే దీన్ని చూడొచ్చు. అంతకుమించి ఈ సినిమా ఇవ్వగలిగిందేమీ లేదు!

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు