విడుదల తేదీ : అక్టోబర్ 07, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : ఏ.ఎల్ విజయ్
నిర్మాత : ఎంవివి సత్యనారాయణ
సంగీతం : సాజిద్ – వాజిద్, విశాల్ మిశ్రా
నటీనటులు : ప్రభుదేవా, తమన్నా, సోను సూద్
తమన్నా మెయిన్ లీడ్ గా చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అభినేత్రి’. దర్శకుడు ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘అభినేత్రి’, తమిళంలో ‘దేవి’, హిందీలో ‘తుటక్ తుటక్ తూటియా’ పేర్లతో ఈరోజే విడుదలైంది. తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్ లు ప్రమోషన్లు భారీ స్థాయిలో చేయడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇన్ని అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
ఈ సినిమా కథ ఫ్లాష్ బ్యాక్ తో మొదలవుతుంది. అందులో ముంబై కార్పొరేట్ కంపెనీలో పనిచేసే కృష్ణ (ప్రభుదేవా) ఇంగ్లీష్ మాట్లాడుతూ వెస్ట్రన్ స్టైల్లో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకొంటే తనకు గౌరవం పెరుగుతుందని అనుకుంటూ ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ ఒకసారి తన సొంత ఊరికి వెళ్లిన అతను కుటుంబపరమైన ఒత్తిళ్ల వలన ఇష్టం లేకపోయినా దేవి(తమన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఆమెను ముంబై తీసుకొచ్చి తన పెళ్లి విషయం బయటకు తెలీకూడదని ఓ పాత అపార్ట్మెంట్ లో దేవిని ఉంచుతాడు.
ఆమెను ఎలాగైనా ఒప్పించి తిరిగి ఊరికి పంపించేయాలని అనుకుంటాడు కృష్ణ. కానీ ఇంతలోనే దేవి వేరొకరిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతలోనే ఫిలిమ్ స్టార్ రాజ్ (సోనూ సూద్) దేవిని చూసి ఆమెను తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాడు. అప్పుడే కృష్ణ తాము ఉంటున్న అపార్ట్మెంట్లో ముందు ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుందని, దెయ్యంగా మారి ఇప్పుడు దేవిని ఆవహించింది తెలుసుకుంటాడు. అప్పుడు దేవికి, ఆమె హీరోయిన్ గా చేయబోయే సినిమాకి ఏమైంది ? దేవిని దెయ్యం ఆవహించిందని రాజ్ తెలుసుకున్నాడా ? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ ‘అభినేత్రి’..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ ఏమిటంటే దర్శకుడు విజయ్ కథను చెప్పిన విధానం చాలా సింపుల్ గా ఉంది. హర్రర్ సినిమా కదా అని అనవసరమైన భయపెట్టే సన్నివేశాలను, భీకర సౌండ్ ఎఫెక్ట్స్ ను పెట్టకుండా మంచి పని చేశాడు.
హర్రర్ ను కామెడీని సమానంగా బ్యాలన్స్ చేయడం అంత సులభం కాదు. అలా అది చేస్తే సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. ఇక్కడ అభినేత్రి విషయంలో దర్శకుడు అదే చేశాడు. ఎవరో ఆవహించిన తన భార్యను ఆవహించిన దెయ్యం చేత కంట్రోల్ చేయబడుతూ, తన భార్య సోనూ సూద్ తో ప్రేమలో పడకుండా చూసే నిస్సహాయ భర్తగా ప్రభుదేవా నటన బాగుంది. ఎప్పటిలా డాన్సులు బాగా చేశాడు.
తమన్నా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక కమెడియన్ సప్తగిరి ప్రభుదేవా ఫ్రెండ్ పాత్రలో బాగానే నవ్వులు పండించాడు.
మైనస్ పాయింట్స్ :
హర్రర్ కామెడీ చిత్రం అని ప్రచారం చేయబడ్డ ఈ సినిమాలో ఆ ప్రచారానికి పూర్తి న్యాయం జరగలేదు. సినిమాలో నవ్వులు పండినా అవి కూడా పెద్ద మొత్తంలో లేవు. హర్రర్ కంటెంట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కామెడీ చాలా సిట్యుయేషనల్ గా సాగింది. ఫస్టాఫ్ ముగిసే సమయానికి దెయ్యం రూబీ ఇంట్రడక్షన్ వస్తుంది. ఆ సమయంలో వచ్చిన వాయిస్ ఓవర్ అసలు అది హర్రర్ సన్నివేశం అనే భావాన్నే పోగొట్టింది. కథనం కాస్త రొటీన్ కావడంతో సినిమాలో ముందు ముందు ఏం జరగబోతోందో యిట్టె ఊహించవచ్చు. అలాగే ఫరా ఖాన్ అతిధి పాత్ర డబ్బింగ్ కూడా బాగోలేదు.
సాంకేతిక విభాగం :
హిందీ నుండి అనువాదం చేసిన తెలుగు పాటలు అంట వినసొంపుగా లేవు. ముఖ్యంగా ‘తుటాక్ తుటాక్..’ పాటలో గ్రేస్ పూర్తిగా లోపించింది. ఇక నిర్మాణ విలువల విషయానికొస్తే అవి చాలా బాగున్నాయి. సినిమాని చాలా రిచ్ గా చూపించారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఆయన డ్యాన్సులన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘చిల్..’ పాటలో అమీ జాక్సన్, రాజు సుందరం అప్పియరెన్స్ బాగుంది. డ్యాన్సులు పెద్దగా రాని సోనూ సూద్ కూడా పాటల్లో బాగా కనబడ్డాడు. సినిమాని మూడు భాషల్లో తీయడం వలన ఎడిటింగ్ సరిగా రాలేదు. సన్నివేశాల కంటిన్యుషన్ సరిగా లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
తీర్పు :
మొత్తంగా ఈ ‘అభినేత్రి’ అంత బాగా అలరించకపోయినా థియేటర్లో రెండు గంటలపాటు కూర్చునేలా చేసే చిత్రం. అక్కడక్కడా వచ్చే కొన్ని బోర్ కొట్టించే అవాంతరాలను గనుక పట్టించుకోకపోతే ఈ ‘అభినేత్రి’ ఒకసారి చూడదగ్గ సినిమా.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team