సమీక్ష : ఆనందో బ్రహ్మ – హాయిగా నవ్వుకోవచ్చు

సమీక్ష : ఆనందో బ్రహ్మ – హాయిగా నవ్వుకోవచ్చు

Published on Aug 18, 2017 6:50 PM IST
Anando Brahma movie review

విడుదల తేదీ : ఆగష్టు 18, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : మహి వి రాఘవ్

నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

సంగీతం : కృష్ణ కుమార్

నటీనటులు : తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్

‘పాఠశాల’ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’ . ‘భలే మంచి రోజు’ చిత్ర నిర్మాతలు నిర్మించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దెయ్యాలు మనుషులకు భయపడటం అనే భిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

మలేషియాలో నివసించే రాజీవ్ కనకాల తన తల్లిదండ్రులు అనూహ్య రీతిలో చనిపోవడంతో హైదరాబాద్లో ఉండే తన ఇంటిని అమ్మేయాలనుకుంటాడు. కానీ అందులో దెయ్యాలున్నాయనే ప్రచారం వలన అతను తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకే ఇంటిని అమ్మలసి వస్తుంది. ఇంతలో సిద్దు (శ్రీనివాస్ రెడ్డి) తనకు కొంత డబ్బిస్తే ఆ ఇంట్లో దెయ్యాలు లేవని నిరూపించి మంచి ధర పలికేలా చేస్తానని రాజీవ్ కనకాలతో డీల్ కుదుర్చుకుంటాడు.

ఒప్పందం ప్రకారం సిద్దు తమతో పాటే డబ్బు అవసరమున్న తులసి (తాగుబోతు రమేష్), రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్) లను కూడా ఆ ఇంట్లోకి తీసుకెళతాడు. అలా ఆ ఇంట్లోకి వెళ్లిన ఆ నలుగురు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ? ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎవరు ? ఉంటే అవి ఏం చేశాయి ? అసలు రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఎలా చనిపోయారు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన్ ప్లస్ పాయింట్ సెకండాఫ్. ఇందులో దెయ్యాలకు, నలుగురు కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిశోర్ లకు మధ్య నడిచే హర్రర్ కామెడీ సన్నివేశాలు భలేగా నవ్వించాయి. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ ల కాంబినేషన్లో వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. అలాగే షకలక శంకర్ చేసే స్పూఫులు, దెయ్యాల్ని భయపెట్టే విధానం కొత్తగా ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. తాగుబోతు రమేష్ ఎప్పటిలాగే తన నిషా నటనతో నవ్వుల్ని పూయించాడు. నలుగురు కామెడియన్లకు ఉన్న వైకల్యాల కారణంగా దెయ్యాలు భయపడటం అనే పాయింట్ స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అయింది.

ఒక్కమాటలో చెప్పాలంటే సెకండాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ దశ వరకు బాగా నవ్వుకోవచ్చు. దర్శకుడు మహి వి రాఘవ్ మనుషులకు దెయ్యాలు భయపడటం అనే కొత్త పాయింట్ ను కామెడీని ప్రధాన బలంగా చేసుకుని బాగానే ప్రెజెంట్ చేశాడు. దెయ్యాలు భయపడే ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించింది. అలాగే సినిమా ఆరంభంలో ఇంట్లో ఉన్నవారిలో దెయ్యాలు ఎవరు, మనుషులెవరు అనే కన్ఫ్యూజన్ కలిగేలా ఆయన రూపొందించిన సన్నివేశాలు గమ్మత్తుగా అనిపించాయి. ఇక సెకండాఫ్ చివర్లో రివీల్ అయ్యే కథలోని అసలు ట్విస్ట్ ఎమోషనల్ గా కొంచెం టచ్ చేసింది. సినిమా రన్ టైం కూడా తక్కువ కావడంతో హాయిగా సినిమా చూసే సౌలభ్యం కలిగింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగింది. మొదటి 10 నిముషాలు మినహా మిగతా సమయం మొత్తాన్ని పాత్రల్ని పరిచయం చేయడానికే ఉపయోగించుకోవడం, ఆ పాత్రల్లో కొన్నింటి నైపథ్యం బలహీనంగా ఉండటంతో మొదటి అర్థ భాగం కొంత చప్పగానే అనిపించింది. ఇక సినిమా చివర్లో ట్విస్ట్ రివీల్ అయిపోయాక క్లైమాక్స్ ఏమిటనేదాన్ని సులభంగా ఊహించేయవచ్చు.

అలాగే ఈ హర్రర్ కామెడీ సినిమాలో కామెడీని బాగానే అందించారు చేశారు కానీ హర్రర్ కు సరైన న్యాయం జరగలేదు. ఎంత డిఫరెంట్ జానర్ అయినా సినిమాలో దెయ్యాలున్నప్పుడు అవి ఎక్కడో ఒక చోట ప్రేక్షకుల్ని కనీసం ఉలిక్కిపడేలా అయినా చేయాలి. కానీ ఇందులో అలా జరగలేదు. ఎక్కడా థ్రిల్ చేసే సీన్లు కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మహి వి రాఘవ్ తాను అనుకున్నట్టే హర్రర్ సినిమా ద్వారా కామెడీని అందించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. తెలివిగా తక్కువ రన్ టైమ్ ను పెట్టుకుని ఎక్కడా బోరింగ్ కంటెంట్ లేకుండా చూసుకున్నాడు. కామెడియన్లకు మంచి పాత్రల్ని, దెయ్యాలకు వారికీ మధ్య నవ్వు తెప్పించే సన్నివేశాలని, కొంచెం తెలివిగా అనిపించే స్క్రీన్ ప్లేను రాసుకుని రచయితగా, దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి పాటించిన నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి. కె అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయింది. అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. శ్రవణ్ ఎడిటింగ్ కూడా బాగుంది.

తీర్పు:

ఈ ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం ఎలాంటి బోరింగ్ అంశాలు లేకుండా పద్దతిగా నవ్వించింది. ముఖ్యంగా సెకండాఫ్ కథనంలో వచ్చే కామెడీ సన్నివేశాలు మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాయి. అంతేగాక శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిశోర్ ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దెయ్యాలు మనుషులకు భయపడే ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేయొచ్చు. రన్ టైమ్ కూడా తక్కువ కావడంతో సరదాగా సినిమాను చూసేయొచ్చు. మొత్తం మీద ఫస్టాఫ్ వద్ద కొంచెం ఓపిగ్గా ఉంటే సెకండాఫ్ మొత్తం హాయిగా నవ్వుకోవచ్చు.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు