విడుదల తేదీ : 07 జూలై, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
నిర్మాత : జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
సంగీతం : కార్తిక్ రోడ్రిగ్జ్
నటీనటులు : రష్మీ గౌతమ్, చరణ్ దీప్
రష్మి.. కొద్దికాలంగా టీవీ షోస్‌లో యాంకరింగ్ చేస్తూ బాగా పాపులర్ అయిన పేరు. ఇక సినిమాల్లోనూ తన ప్రతిభ చూపించేందుకు వచ్చి ‘గుంటూర్ టాకీస్’ అనే సినిమాతో మెప్పించిన ఆమె, తాజాగా ‘అంతం’ అనే రొమాంటిక్ థ్రిల్లర్‌తో ముందుకొచ్చారు. చరణ్ దీప్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌తో మంచి అంచనాలను రేకెత్తించింది. ఆ అంచనాల మధ్యే నేడు థియేటర్లలో వాలిపోయిన ఈ సినిమా ఎలా ఉందీ ? చూద్దాం…
కథ :
కళ్యాణ్ కృష్ణ (చరణ్ దీప్), వనిత (రష్మి).. ఇద్దరూ తమ వృత్తిని బాగా ఎంజాయ్ చేస్తూ సరదాగా కాలం వెళ్ళదీసే ఓ జంట. ఒకానొక రోజు విజయవాడకు ఓ పనిమీద వెళ్లి తిరిగి వస్తుండగా, కళ్యాణ్‌కు ఓ ఆగంతకుడి నుండి ఫోన్‌కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా తన భార్య కిడ్నాప్ కాబడిందని, ఆమె బతకాలంటే ఫోన్ చేసిన ఆగంతకుడు చెప్పినవన్నీ చేయాలని కళ్యాణ్ కృష్ణకు అర్థమవుతుంది.
ఇంతకీ ఆ ఆగంతకుడు కళ్యాణ్ కృష్ణ చేత ఏ పని చేయించేందుకు అతడి భార్యను కిడ్నాప్ చేశాడూ? తన భార్యను బతికించుకునేందుకు కళ్యాణ్ ఆ పని చేశాడా? ఈ కథ చివరకు ఏయే మలుపులు తిరిగిందీ అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ పాయింట్ అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన సుదర్శన్ కామెడీ అని చెప్పుకోవచ్చు. అతడికి రాసిన సన్నివేశాలు, ‘ప్రియాంకా! నేనొస్తున్నా’ అన్న సిగ్నేచర్ డైలాగ్ కొన్నిచోట్ల నవ్వులు పూయించింది. ఇక ఆగంతకుడి నుంచి మెసేజ్ వచ్చే మొదట్లో ఓ పది నిమిషాల పాటు సన్నివేశాలు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ అన్న రీమిక్స్ పాటలో రష్మి అందాల ప్రదర్శన, అటువంటి సన్నివేశాలను చూడాలనుకునేవారికి నచ్చుతుంది. గతంలో విలన్‌గా కొన్ని సినిమాలు చేసిన చరణ్ దీప్, కళ్యాణ్ పాత్రలో ఫర్వాలేదనిపించాడు.
ఇక హీరోయిన్ రష్మికి ఈ సినిమాలో పెద్దగా నటించడానికి ఏమీ లేదు. చెప్పాలంటే ఆమె పాత్ర పావు గంటకు మించి కథగా కనిపించినట్లు ఉండదు. అందాల ప్రదర్శనలో మాత్రం రష్మి ఎక్కడా తగ్గలేదు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా ప్రధాన కథ చాలా చిన్నది. ఇలాంటి కథల్లో, అయితే బలమైన భావోద్వేగం అయినా ఉండాలి, లేదా ఎన్నో ఉపకథలైనా ఉండాలి. ‘అంతం’లో ఆ రెండూ లేక రెండు గంటల సినిమా నీరసంగా ముందుకు కదులుతూ ఉంటుంది. సినిమా అంతా అయిపోయాక ఓసారి చూసుకుంటే మొత్తమ్మీద ఐదారు సన్నివేశాలకు మించి సినిమా లేదు. దాన్నే సాగదీసి, సాగదీసి విసుగు తెప్పించారు. ఇక ఉన్న ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్ కూడా సాదాసీదాగా ఉంది. క్లైమాక్స్ సన్నివేశానికైతే అసలు అర్థమే లేదు.
సినిమా అంతా అతి చేస్తూ సాగుతూ ఉంటుంది. నటీనటులంతా చాలాచోట్ల సందర్భం, అవసరానికి మించి అరుస్తూ ఉండడం కూడా విసుగు పుట్టించింది. ఇక ఈ సినిమాకు మొదట్నుంచీ జరిగిన ప్రచారం కూడా తప్పుడు ప్రచారమనే చెప్పాలి. రష్మిని హైలైట్ చేస్తూ సినిమా ఉంటుందేమో అనుకునే వారికి ఆమె ఈ సినిమాలో కొద్దిసేపే కనిపించడం నిరాశే మిగులుస్తుందని చెప్పొచ్చు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ‘అంతం’లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఎవ్వరూ ప్రతిభ చూపలేదు. రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణం.. ఇలా ఇన్ని బాధ్యతలను తన మీదే ఉంచుకున్న జీ.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ ఈ సినిమాలో ఒక్క చోట కూడా పూర్తి స్థాయి ప్రతిభ చూపలేదు. ఒక సినిమాకు సరిపడే స్థాయిలేని కథలో ఇటు భావోద్వేగమూ లేకపోవడం, ఉపకథలూ లేకపోవడం రచయితగా కళ్యాణ్ వైఫల్యంగానే చెప్పుకోవాలి. మేకింగ్ పరంగానూ ఆయన ఎక్కడా ఆకట్టుకోలేకపోయాడు. సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు. ఎడిటింగ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ పాటలో ఎడిటింగ్ చాలా వీక్‌గా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగోలేవు. సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.
తీర్పు :
ఓ ఆరు సన్నివేశాలు, ఒక పాట, మళ్ళీ అందులోనూ ఎక్కడా భావోద్వేగం లేకుండా ఒక రెండు గంటల సినిమా తీస్తే ఎలా ఉంటుందో, అదే ‘అంతం’. కథ చాలా చిన్నది కావడం, నటీనటులు కూడా పెద్దగా మెప్పించేస్థాయిలో నటించకపోవడం, సస్పెన్స్ ఎలిమెంట్ కూడా సాదాసీదాగా ఉండడం, అర్థం లేని క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఏమాత్రం మెప్పించలేని సినిమాగా నిలబెట్టాయి. రష్మి పదినిమిషాల పాటు చేసిన అందాల ప్రదర్శన, మధ్యలో సస్పెన్స్ ఎలిమెంట్ మొదలయ్యేప్పటి పావుగంట ఎపిసోడ్, అక్కడక్కడా నవ్వించే సుదర్శన్ కామెడీ లాంటివి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక అంతకుమించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team