సమీక్ష : అనుక్షణం – టెన్షన్ పెట్టే సైకో థ్రిల్లర్.!

సమీక్ష : అనుక్షణం – టెన్షన్ పెట్టే సైకో థ్రిల్లర్.!

Published on Sep 14, 2014 1:30 AM IST
Anukshanam_Movie_Review విడుదల తేదీ : 13 సెప్టెంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ – ఎ.వి ఆర్ట్స్
నటీనటులు : మంచు విష్ణు, రేవతి, నవదీప్, మధు శాలిని..


‘రౌడీ’ సినిమా తర్వాత మంచు విష్ణు – రామ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అనుక్షణం’. హాలీవుడ్ స్టైల్ టేకింగ్ తో కేవలం ఒకటిన్నర గంటల నిడివి గల ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మంచు విష్ణుతో పాటు రేవతి, మధు శాలిని, సూర్య, తేజస్వి, నవదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. మంచు విష్ణు తన రెగ్యులర్ ఫార్మాట్ ని పక్కన బెట్టి టాలీవుడ్ లో కాస్త డిఫరెంట్ గా ట్రై చేసిన ‘అనుక్షణం’ ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఓపెన్ చేస్తే హైదరాబాద్ లోని ఓ ఏరియా… టైం అర్దరాత్రి.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లు.. ఓ సైకో కిల్లర్ సీతారాం (సూర్య) ఓ అమ్మాయిని చంపేస్తాడు.. అక్కడి నుంచి రోజూ ఆ సైకో కిల్లర్ అమ్మాయిలని చంపుతూ ఉంటాడు. ఆ కేసును గౌతమ్ హైదరాబాద్ కి డిసిపి (మంచు విష్ణు) డీల్ చేయడం మొదలు పెడతాడు. సైకో కిల్లర్ ని పట్టు కోవాలని చేసే ప్రతి ప్రయత్నంలోనూ గౌతమ్ ఫెయిల్ అవుతూ ఉంటాడు.

అదే సమయంలో సైకో కిల్లర్స్ మీద రీసర్చ్ చేసిన శైలజ(రేవతి) ఆ కేసులో సాయం చేయడానికి గౌతమ్ ని సంప్రదిస్తుంది. అక్కడి నుంచి వారంతా కలిసి ఆ సైకో కిల్లర్ పట్టుకోగలిగారా? లేదా? ఆ సైకో కిల్లర్ అంతమంది అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు.? ఈ సైకో కిల్లర్ ని పట్టుకునే ప్రాసెస్ లో గౌతమ్ ఏమేమి కోల్పోవలసి వచ్చింది? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ముందుగా ఇలాంటి జోనర్ సినిమాని రిస్క్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించాలని ట్రై చేసిన మంచు విష్ణుకి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే అది సినిమాలో నటించిన నలుగురు నటీనటుల పెర్ఫార్మన్స్. వాళ్ళే హీరో మంచు విష్ణు, సైకో కిల్లర్ గా చేసిన సూర్య, రేవతి మరియు జర్నలిస్ట్ గా చేసిన మధు శాలిని. ముందుగా హీరో మంచు విష్ణు – విష్ణు తన కెరీర్లో ఇప్పటి వరకూ చేసిన సినిమాలనీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఈ సినిమాలో విష్ణుని మీరు హీరోగా కంటే ఒక నటుడిగా మెచ్చుకుంటారు. ఎందుకంటే పెర్ఫార్మన్స్ విషయంలో మంచు విష్ణుని మరో స్థానానికి తీసుకెళ్ళే సినిమా అనుక్షణం అని కచ్చితంగా చెప్పగలను. విష్ణు చేసిన సీరియస్ రోల్ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయింది. ముఖ్యంగా విష్ణు క్లైమాక్స్ లో చేసిన నటన ది బెస్ట్ అని చెప్పుకోవాలి. టిపికల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకి విష్ణు లుక్, ఫిజిక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

ఇక సైకో కిల్లర్ గా చేసిన సూర్య పెర్ఫార్మన్స్ ఈ మూవీకి మరో మేజర్ హైలైట్. అసలు సైకో కిల్లార్ అంటే ఇలానే ఉంటాడేమో అనిపించేలా అతని నటన ఉంది. ముఖ్యంగా కొన్నిసీన్స్ లో ఒక సైకోగా తను ఆనందం పొందే సీన్స్ లో బాగా చేసాడు. ఇక సైకో కిల్లర్స్ పై రీసర్చ్ చేసిన శైలజగా రేవతి గారి నటన బాగుంది. రేవతి పాత్రకి తగ్గట్టు చాలా రియలిస్టిక్ గా సినిమాలో కనిపించారు. జర్నలిస్ట్ పాత్రలో మధు శాలిని ఆడియన్స్ లో టెన్షన్ క్రియేట్ చెయ్యడంలో బాగానే సక్సెస్ అయ్యింది.

ఇకపోతే అతిధి పాత్రలు చేసిన తేజస్వి, నవదీప్ తమ పాత్రల పరిధిమేర నటించారు. బ్రహ్మానందం కనిపించే రెండు సీన్స్, కోట శ్రీనివాసరావు తెలంగాణ స్లాంగ్ డైలాగ్స్ నవ్విస్తాయి. సినిమా స్టార్టింగ్ మరియు అలాగే చివరి 30 నిమిషాలు సినిమాకి హైలైట్ అవుతుంది. సినిమా నిడివి కేవలం 104 నిమిషాలే కావడం మరో మేజర్ ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్ :

యాక్షన్ థ్రిల్లర్ తరహా సినిమాలలో కథ కంటే స్క్రీన్ ప్లే, లాజిక్స్ మరియు లూప్ హోల్స్ మేజర్ హైలైట్స్ అవుతాయి. కానీ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే వేగంగానే సాగుతుంది కావున దానిని పక్కన పెడితే లాజిక్స్ మరియు లూప్ హోల్స్ చాలా మిస్ అవ్వడం మేజర్ మైనస్ పాయింట్. విష్ణుని మొదటి నుంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తున్నా సైకో కిల్లర్ పై ఒక్క స్మార్ట్ మూవ్ కూడా లేకుండా కాస్త సాగదీశారు అనిపిస్తుంది.

సినిమాలో ఉన్న థ్రిల్స్ ఉన్నాయి, కానీ ఈ కాన్సెప్ట్ కి అదిరిపోయే రేంజ్ లో ఇంకొన్ని థ్రిల్స్ జత చేసి ఉంటే బాగుండేది. అలాగే సినిమాలో క్రేజ్ కోసం పెట్టిన బ్రహ్మానందం లాంటి ట్రాక్స్ కథకి అవసరం లేదు. ఇదొక థ్రిల్లర్ మూవీ కావున రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కామెడీ, సాంగ్స్, ఫైట్స్ లాంటివి ఉండవు. మీరు ఆశించకండి..

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మొదటిగా చేపాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. ఒక థ్రిల్లర్ సినిమాలో విజువల్స్ ఎలా ఉండాలో అలా ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన సీన్స్, నటీనటులపై తీసిన కొన్ని క్లోజ్ షాట్స్ చాలా బాగున్నాయి. ఇక చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి, సినిమాలో ఉన్న మూడ్ కనెక్ట్ అయ్యేలా మ్యూజిక్ కంపోస్ చేసాడు. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ ఇంకాస్త స్పీడ్ అవడం కోసం కాస్త ట్రిమ్ చేయాల్సింది. కథని డెవలప్ చేసిన వారు పలు హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలలో నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారు. ఆ కథ మన నేటివిటీకి బాగానే కనెక్ట్ చేసారు కానీ ఇంకాస్త సస్పెన్స్, థ్రిల్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. సినిమాలో స్క్రీన్ ప్లే పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సింది. ఎందుకంటే సినిమా తీసుకునే చాలా కీ టర్నింగ్స్ ని మీరు సులభంగా ఊహించేయవచ్చు..

ఇక రామ్ గోపాల్ వర్మ తీసిన గత సినిమాలకి ఈ సినిమాలకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. డైరెక్షన్ పరంగా ఎక్కడా పక్కదారులకి పోకుండా ఒకే లైన్ మీద సినిమాని తీసుకెళ్ళిపోయాడు. అనుక్షణం సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చాలా బాగా డీల్ చేసాడు. ముఖ్యంగా నటీనటుల నుంచి సూపర్బ్ పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు.

తీర్పు :

టాలీవుడ్ కి ఓ సైకో కిల్లర్ కథతో ఒకటిన్నర గంట యాక్షన్ థ్రిల్లర్ సినిమాని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ చేసిన ‘అనుక్షణం’ సినిమా అనుకున్నట్టుగానే ఆడియన్స్ ని టెన్షన్ పెట్టడంలో సక్సెస్ అయ్యింది. ఇలాంటి సినిమా మన ప్రేక్షకులకి కొత్తే కానీ ముందే ఇది ఎలాంటి సినిమా అని తెలుసుకొని లోపలి వెళితే మాత్రం కాస్త ఆసక్తిగా, కాస్త టెన్షన్ గా ఈ సినిమాని చూసి బయటకి వస్తారు. ఒకవేళ రెగ్యులర్ కామెడీ, ఫైట్స్, సాంగ్స్ ఆశించి వెళితే కాస్త నిరుత్సాహపడతారు. నటన పరంగా మంచు విష్ణుని మరో స్థాయికి తీసుకెళ్ళే అనుక్షణం సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అలాగే చాలా రోజులుగా వస్తున్న వర్మ సినిమాల్లో ‘అనుక్షణం’లో వర్మ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వారికి ‘అనుక్షణం’ నచ్చుతుంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు