సమీక్ష : ఎటాక్ – మెప్పించడం కష్టం

సమీక్ష : ఎటాక్ – మెప్పించడం కష్టం

Published on Apr 1, 2016 9:05 PM IST
Attack review

విడుదల తేదీ : ఏప్రిల్ 1 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

నిర్మాత : వరుణ్, తేజ, శ్వేతలానా, సి.వి.రావు

సంగీతం : రవి శంకర్

నటీనటులు : మంచు మనోజ్, సురభి, జగపతిబాబు…

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్‌, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్ ముఖ్య పాత్రలలో ‘ఎటాక్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గతంలోనే విడుదల చేయాలని భావించిన, పలు కారణాల వలన అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ‘కిల్లింగ్ వీరప్పన్’ తర్వాత వర్మ నుంచి వస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. మంచు మనోజ్ కి సురభి జంటగా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వర్మ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి, బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకుందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

గురురాజ్ (ప్రకాష్ రాజ్) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గురురాజ్ కి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు కాళి (జగపతి బాబు), రెండవ వాడు (బూపి), మూడవవాడు రాధా (మంచు మనోజ్). గురురాజ్ కి గతం లో కొంతమందితో తగాదాలు ఉన్నప్పటికినీ వాటిని మరచిపోయి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఓ సారి ఓ ల్యాండ్ తగాదా పై ఒకతని తో మాట్లాడి వస్తుండగా కొంతమంది కలిసి అతనిపై ఎటాక్ చేసి హత్య చేస్తారు. తరువాత ఆ హత్య వెనుక ఉన్న కారణం కనుక్కునే పనిలో ఉన్న కాళి (జగపతి బాబు) ని చంపేస్తారు. కానీ ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటి? వీటిని ఎవరు చేశారు అన్నది గురురాజ్ మూడవ కొడుకైన రాధా ఎలా కనుక్కున్నాడు? తన నాన్న, అన్న లను చంపిన వారిని ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ సినిమాలో మంచు మనోజ్ నటన ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మొదటిసారిగా మంచు మనోజ్ గడ్డంతో ఫుల్ మాస్ పాత్రలో ప్రేక్షకులని మెప్పించాడు. తన నటనలో, డైలాగ్ డెలివరీలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్ లో మనోజ్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఇక బ్యూటిఫుల్ సురభి కి ఉన్నది చిన్న పాత్రే అయినా తన అందంతో ఉన్నంతలో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. నటిగా కూడా ఓకే అనిపించుకుంది.

వీరి తర్వాత చెప్పుకోవాల్సింది ’సత్తు’ గా నటించిన అభిమన్యు సింగ్ గురించి.. మెయిన్ విలన్ గా చేసిన అభిమన్యు సింగ్ తన పెర్ఫార్మన్స్ తో మంచు మనోజ్ కి గట్టి పోటీనే ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ ప్రకాష్ రాజ్ పైన జరిగే ఎటాక్ సీన్ ఉత్కంఠ కలిగిస్తుంది. అలాగే క్లైమాక్స్ లో హీరో విలన్ ని శిక్షించే విధానం బాగుంది. ప్రధమార్థం నిడివి తక్కువ కావడం ఈ సినిమాకి ఉపయోగపడింది. సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్, జగపతి బాబు తమ పాత్రలకు న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఈ కథని ఎక్జిక్యూట్ చేసిన విధానం. కథ చిన్నదైనా కథనంలో రాసుకున్న సీన్స్ లో ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపగలిగితే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. కానీ ఈ సినిమా కథనంలో అది కనిపిందు. కథనం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. కథాంశం చిన్నదై ఎక్కువ పాత్రలు ఉండటం తో కథ అర్థం చేసుకోవడంలో స్పష్టత కొరవడుతుంది. ఇక కథలో గానీ, కథనంలో గానీ ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశం, వారు ఊహించలేని అంశం అంటూ ఏదీ లేదు. సింపుల్‌గా తేల్చాల్సిన పాయింట్ అనవసరంగా కాంప్లికేట్ చేసినట్లు అనిపిస్తుంది.

సినిమా పరంగా సెకండాఫ్ పెద్ద మైనస్.. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోయినా సెకండాఫ్ లో మాత్రం అస్సలు ముందుకు వెళ్ళదు. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ ని మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. వర్మ చెప్పాలనుకున్న పాయింట్ చాలా పాతది కావడం వలన దర్శకుడిగా మేజిక్ చేయలేకపోయాడు. సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య ఎక్కడా ప్రేమ పుట్టడానికి కారణం అంటూ ఏదీ ఉండదు. ఇక రెగ్యులర్ సినిమాలలో ఉండే ఎంటర్టైన్మెంట్ అస్సలే లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో కొన్ని డిపార్ట్ మెంట్స్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ చూడటానికి బాగానే ఉంది. శేషు కె.ఎం.ఆర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. అన్సర్ అలీ ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలోలేదు. ఏ సన్నివేశం ఆ సన్నివేశానికన్నట్లు సాగింది. సెకండాఫ్ పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. కళా దర్శకుడి పనితనం బావుంది.

ఇక చెప్పుకోవాల్సింది ఈ సినిమాకి కెప్టెన్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి… ఆయన ’ఎటాక్’ సినిమా కోసం ఎంచుకున్న కథాంశం చాలా పాతది. అలాంటి కథాంశానికి కనీసం కొత్త ట్రీట్ మెంట్ కానీ, సన్నివేశాలు కానీ రాసుకుని ఉంటే బావుండేది. కానీ సీన్స్ చాలా రెగ్యులర్ గా ఉండడంతో ప్రేక్షకులని ని మెప్పించలేకపోయింది. ఇకపోతే దర్శకుడిగా నటుల నుంచి మంచి నటన రాబట్టుకోగలిగినా, ఆద్యంతం ప్రేక్షకులను కూర్చో బెట్టలేక పోయాడు.

తీర్పు :

’ఎటాక్’ అంటూ సాదా సీదా రివెంజ్ డ్రామా కథతో మన ముందుకు వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఆ పాయింట్ లో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడంలో మరోసారి విఫలం అయ్యాడు. మొదటి సన్నివేశం నుంచే ఏ సన్నివేశం లోనూ తనేం చెబుతున్నాడో అన్న విషయం గురించి స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ కావడం కష్టం. ప్రధాన పాత్రల్లో నటించిన వారి నటన, కొన్ని వర్మ మార్క్ సన్నివేశాల కోసం చూస్తే ఈ సినిమాను చూడొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ’ఎటాక్’ అంటూ వచ్చిన వర్మ మరోసారి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పింలేకపోయాడు.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు