విడుదల తేదీ : 17 డిసెంబర్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 0.5/5
దర్శకత్వం : హరినాథ్ పొలిచర్ల
నిర్మాత : హరినాథ్ పొలిచర్ల
సంగీతం : రాయల్ రాజ్
నటీనటులు : హరినాథ్ పొలిచర్ల, విశ్వరామ్, సురభి సూర్య కుమార్, ఏంజెలినా, రెహాన్
హరినాథ్ పొలిచెర్ల హీరోగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్’. ఫ్రెండ్‌షిప్ విలువల్ని తెలియజేస్తూ రూపొందిందన్న ప్రచారం పొందిన ఈ సినిమాలో విశ్వరామ్, సురభి సూర్య కుమార్, ఏంజెలినా, రెహాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు ఆకట్టుకున్నారూ? చూద్దాం…
కథ :
గౌతమ్ (హరినాథ్ పొలిచర్ల) ఓ ఆర్కిటెక్ట్. తనతో జీవితం పంచుకోబోయే అమ్మాయి తాను రాసుకున్న ఓ పది సూత్రాలకు కట్టుబడి ఉండాలన్న నియమం పెట్టుకొని, అలాంటి అమ్మాయి కోసం వెతుకూంటాడు. తన నలుగురు ఇతర మిత్రులతో కలిసి హరినాథ్ తనకు కావాల్సిన అమ్మాయిని వెతికే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే గౌతమ్‌కి మాత్రం అలాంటి అమ్మాయి ఎక్కడా తారసపడదు.
ఇదిలా ఉండగానే తన ఫ్రెండ్స్‌లోనే ఒకరైన రూబెన్ (ఏంజిలినా) గౌతమ్‌ను ఇష్టపడుతుంది. ఆ తర్వాత గౌతమ్ కూడా ఆమె ప్రేమను అంగీకరించడంతో ఇద్దరూ పెళ్ళికి సిద్ధమవుతారు. కాగా పెళ్ళి సమయానికి రూబెన్, అక్కణ్ణుంచి పారిపోతుంది. రూబెన్ ఎందుకు పారిపోయింది? వీరిద్దరి ప్రేమ ఏమయింది? అన్న ప్రశ్నలకు సమాధానమే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా ప్లస్ పాయింట్స్ అంటే శోధించి, చేధించి వెతికిపట్టుకోవాలి. అలా పట్టుకుంటే కనిపించే రెండు పాయింట్స్ అంటే ఉన్నంతలో ఇంటర్వెల్ ట్విస్ట్, హీరో ఫ్రెండ్ బాబీ క్యారెక్టర్ నవ్వించే ప్రయత్నం గురించి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్‌షిప్ గొప్పదనం అంటూ చెప్పుకొచ్చిన సీన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. ఇక అంతకు మించి ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు.
మైనస్ పాయింట్స్ :
ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గురించి చెబుతూ పోతే, ఒక సినిమా బాలేదని చెప్పడానికి సరిపోయేన్ని మైనస్‌ల కంటే ఎన్నోరెట్లు మైనస్‌లు నింపుకున్న సినిమా కావడంతో ఆ లెక్క తేలదు. మేజర్‌గా చెప్పాలంటే ఒక కథ, కథనం, కనీసం కాన్సెప్ట్, అదీకాకపోతే మేకింగ్ పరంగా కొత్తదనం, అదీకాకపోతే జానర్ పరంగా ఓ ప్రయోగం.. ఇలా ఏదీ లేని ఈ సినిమా నిస్సత్తువగా రెండు గంటల పాటు అర్థం పర్థం లేని సన్నివేశాలతో సాగిపోతుంది.
ఇక హీరో చెప్పే పది సూత్రాలు వింటే, దాని వెనుక ఉన్న కథ వింటే.. ఈ అంశంతోనా కథ నడుపుతోందీ? అన్న ప్రశ్నే నవ్వు తెప్పిస్తుంది. హీరోతో సహా ఏ పాత్రలోనూ సహజత్వం లేదు. సినిమా ఒక పద్ధతంటూ లేకుండా ఎందుకొస్తున్నాయో తెలీని సన్నివేశాలతో వెళుతుంది. ఉదయం అయిందన్న విషయం చెప్పడానికి రెండు షాట్స్, సాయంత్రం అయిందని చెప్పడానికి రెండు షాట్స్, ఫ్రెండ్సంతా కలిసి రాత్రి మందు కొట్టడం చిన్న స్టోరీ.. ఇదే ఫార్మాట్‌తో సినిమా మొత్తం నడిపి కథ కాదు కదా, సినిమా ఎందుకు తీశామో అన్నది తమకే తెలియదన్న చందంగా దర్శక నిర్మాత చెప్పినట్లు కనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇక మ్యూజిక్ ఏమాత్రం బాగోలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిచోట్ల ఓకే. ఎడిటింగ్‌లో కొత్తదనమేమీ లేకపోగా, బేసిక్ అప్పీల్ కూడా మిస్ అయింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదు.
దర్శకుడిగా హరినాథ్ ఓ మంచి సినిమా తీయడం అనే ఆలోచన అటుంచితే, కనీసం కాన్సెప్ట్ ఏంటో కూడా చెప్పలేకపోవడం కథపై చూపిన శ్రద్ధ ఏపాటిదో చెప్పడానికి నిదర్శనం. మేకింగ్ పరంగానూ ఎక్కడా దర్శకుడి ప్రతిభ గురించి చెప్పుకునే సన్నివేశాలు లేవు. ఇక అమ్మాయిలు, వాళ్ళ అభిరుచులతో పాటు వాళ్ళ ఆలోచనా విధానాన్ని కూడా పూర్తిగా తప్పుపట్టే రీతిలో కొన్ని సన్నివేశాలను రాసుకోవడం దర్శకుడి అభిరుచికి నిదర్శనం.
తీర్పు :
సినిమా అంటే ఓ కథో, ఓ ఆలోచనో, కొన్నిసార్లు అభిప్రాయమో.. ఇలా ఏదోకటి చెప్పడమన్నది దాని ప్రధాన లక్ష్యం. అలాంటి లక్ష్యమంటూ ఒకటి లేకుండా ఏం చెప్తున్నారన్నది కూడా తెలీనీకుండా, ఎందుకు ఏ సన్నివేశమొస్తుందో కూడా అర్థమయ్యేలా చెప్పకుండా, నిస్సత్తువగా, నిరాసక్తిగా ఓ రెండు గంటల పాటు కదిలే జీవం లేని బొమ్మే ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్’. ప్లస్ పాయింట్ ఏదీ అంటే వెతుక్కొని మరీ చెప్పాల్సినంత అయోమయంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసే సాహసం చేయాలనుకొని వెళ్ళగలిగే వారు కూడా మరికాస్త ధైర్యం మూటగట్టుకొని చూడాలి. ఇకపోతే, ఇంత అయోమయంగా, అర్థం పర్థం లేకుండా కూడా సినిమాలు చేస్తారా? అనే యాంగిల్‌లో నవ్వుకునే వారుంటే ఈ సినిమాను ఎంజాయ్(!?) చేయొచ్చు!
123తెలుగు.కామ్ రేటింగ్ : 0.5/5
123తెలుగు టీం