సమీక్ష : భాగమతి – ఆరంభంలో భయపెట్టి.. ఆఖరులో థ్రిల్ చేసింది

సమీక్ష : భాగమతి – ఆరంభంలో భయపెట్టి.. ఆఖరులో థ్రిల్ చేసింది

Published on Jan 27, 2018 6:58 PM IST
Bhaagamathie movie review

విడుదల తేదీ : జనవరి 26, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : అనుష్క, ఉన్ని ముకుందన్

దర్శకత్వం : జి. అశోక్

నిర్మాత : వంశీ, ప్రమోద్

సంగీతం : ఎస్.థమన్

సినిమాటోగ్రఫర్ : మధి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

స్టోరీ, స్క్రీన్ ప్లే : జి. అశోక్

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన తాజా చిత్రం ‘భాగమతి’. జి. అశోక్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

చంచల (అనుష్క) ఒక ఐ.ఎస్.ఎస్ ఆఫీసర్. ఆమె ఒక ప్రముఖ మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జైరామ్) వద్ద పర్సనల్ సెక్రెటరీగా భాద్యతలు నిర్వర్తిస్తూ ఒక హత్య కేసులో అరెస్టవుతుంది. అలా కస్టడీలో ఉన్న ఆమెను పోలీసులు రహస్య విచారణ కొరకు ఊరికి దూరంగా అడవిలో ఉన్న పాడుబడిన భాగమతి బంగ్లాకు తీసుకెళతారు.

చంచల ఆ బంగ్లాలోకి ప్రవేశించగానే బంగ్లాలోని భాగమతి ఆత్మ ఆమెను ఆవహించి భీభత్సం సృష్టిస్తుంది. ఆ భాగమతి ఎవరు, ఆమె చంచలను ఎందకు ఆవహించింది, అసలు చంచల హత్య ఎందుకు చేసింది, దాని వెనకున్న కారణమేమిటి, భాగమతి కథను ఆమె ఎలాంటి కొలిక్కి తీసుకొస్తుంది అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ లేడీ సూపర్ స్టార్ అనుష్క. సినిమా ఆరంభం నుండి చివరి వరకు కథకు ప్రధాన ఆధారంగా నిలిచిన ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, నటనతో ఆద్యంతం మెప్పించింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో తన హావభావాలతో ప్రేక్షకుల్లో థ్రిల్ కలిగేలా చేసి భాగమతిగా ఆకట్టుకునే తన ఆహార్యంతో, బాడీ లాంగ్వేజ్ తో పూర్తిస్థాయి నటనను కనబర్చి చప్పట్లు కొట్టేలా చేసింది.

దర్శకుడు అశోక్ హర్రర్ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. అనుష్క పాత్రను ఎంత బలంగా అయితే రాసుకున్నారో అంతే బలంగా తెరపై చూపడంలో సఫలమయ్యారు. అంతేగాక కథనంలో ప్రస్తుతాన్ని, గతాన్ని పార్లల్ గా నడిపి ఎక్కడికక్కడ క్లారిటీ ఇస్తూ ప్రేక్షకుడికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా చూసే సౌలభ్యాన్ని కలిగించారు.

ఫస్టాఫ్లో కొన్ని థ్రిల్లింగ్ సీన్లతో పాటు మంచి ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చి సెకండాఫ్ పై ఆసక్తి కలిగేలా చేసిన ఆయన సెకండాఫ్లో కూడా అలాంటి సేన్లనే కొన్నింటిని అందించి మెప్పించారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రియలిస్టిక్ గా అనిపించే భారీ బంగ్లా సెట్ ను రూపొందించి సినిమాకు డార్క్, హర్రర్ లుక్ ను అందించి అనుక్షణం ప్రేక్షకుడు ఉత్కంఠకు గురయ్యేలా చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ హర్రర్ సన్నివేశాలు మినహా కథకు ప్రధాన బలంగా నిలిచే కీలకమైన సన్నివేశాల్లో తీవ్రత లోపించడం. చాలా సీన్లు ఏదో నడుస్తున్నట్టే ఉంటాయి తప్ప పెద్దగా ఎగ్జైట్మెంట్ కలిగించవు. ప్రథమ, ద్వితీయార్థాలలో ప్రస్తుతంతో పాటు నడిచే అనుష్క గతాన్ని చాలా పేలవంగా ప్రెజెంట్ చేశారు. దీంతో కీలక మలుపుల్లో పట్టు లోపించి ప్రేక్షకుడు నిరుత్సాహానికి గురికావాల్సి వచ్చింది.

ఇక సినిమా క్లైమాక్స్ కొంత ఊహించనిదే, కొత్తదే అయినప్పటికీ అందులో తీవ్రత లేకపోవడంతో ప్రేక్షకుడు పెద్దగా ఎగ్జైట్మెంట్ ఫీలవకపోగా అసంతృప్తి చెందుతాడు. ప్రేక్షకుడు సినిమాకు ఒక కథను ఊహించి వచ్చినప్పుడు దర్శకుడు అసలు కథ వేరే ఉందనే ట్విస్ట్ ఇవ్వదల్చుకుంటే ఆ వేరే కథ ఎంతో బలంగాను, ప్రేక్షకుడు ఊహించుకున్నదానికంటే గొప్పగాను ఉండాలి. కానీ ఇందులో దర్శకుడిచ్చిన వేరే కథ ప్రేక్షకుడు ఊహించుకునే స్థాయిలో లేకపోవడంతో కొంత నిరుత్సాహం తప్పలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అశోక్ ప్రెజెంటేషన్ కు, ఎగ్జైట్మెంట్ కు, థ్రిల్స్ కు స్కోప్ ఉన్న కథనే రాసుకున్నా అందులో ఆ ఎలిమెంట్స్ పూర్తిస్థాయిలో ఉండేలా కథనాన్ని, సన్నివేశాల్ని రాసుకోలేదు. ఇంటర్వెల్ బ్లాక్, అనుష్క పాత్ర, క్లైమాక్ ట్విస్ట్, కొన్ని హర్రర్ సన్నివేశాలు మినహా మిగతా ప్రొసీడింగ్స్ అన్నీ నెమ్మదిగా, బలహీనంగా సాగాయి. మధి తన సినిమాటోగ్రఫీతో సినిమాకు ఒక డార్క్ లుక్ ను తీసుకొచ్చారు.

ఎస్.థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావుగారి ఎడిటింగ్ సినిమాపై క్లారిటీ ఉండేలా చేసినా కొన్ని అనవసరమైన సీన్లను తొలగించాల్సింది. యువీ క్రియేషన్స్ వారు పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. రవీంద్రర్ సెట్ వర్క్ సూపర్ గా ఉంది.

తీర్పు :

అనుష్క అన్నీ తానై నడిపించిన ఈ ‘భాగమతి’ చిత్రం ఆరంభంలో హర్రర్ సన్నివేశాలతో భయపెట్టి, ఆఖరులో థ్రిల్ చేసింది. అద్భుతమైన అనుష్క నటన, స్క్రీన్ ప్రెజెన్స్, మంచి ఇంటర్వెల్ బ్లాక్, ఊహించని క్లైమాక్స్, కొన్ని హర్రర్ సీన్లు, మంచి సెట్ వర్క్ ఇందులో ఆకట్టుకునే అంశాలుకాగా పెద్దగా బలంలేని సన్నివేశాలు, ఎగ్జైమెంట్ ఇవ్వలేకపోయిన, కొంత నెమ్మదైన కథనం నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద మంచి టెక్నికల్ స్టాండర్డ్స్ తో నిర్మితమైన ఈ చిత్రం ఒక డీసెంట్ సినిమాను చూసిన అనుభూతిని ఇస్తుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు