విడుదల తేదీ : 04 సెప్టెంబర్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : మారుతి
నిర్మాత : బన్నీ వాసు
సంగీతం : గోపీ సుందర్
నటీనటులు : నాని, లావణ్య త్రిపాఠి..
‘భలే భలే మగాడివోయ్’.. హీరో నాని, దర్శకుడు మారుతిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి కొత్తగా లాంచ్ అయిన గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పై బన్నీ వాసు యువి క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని అంటే కామెడీ టైమింగ్‌కు పెట్టింది పేరు. ఆ పేరుతో నాని గతంలో చేసిన సూపర్ హిట్ సినిమాల కోవలో మరింత నవ్వించే సినిమాగా ప్రచారం పొందిన ‘భలే భలే మగాడివోయ్’.. అనుకున్నంత రేంజ్‌లో ఉందా? చూద్దాం..
కథ :
లక్కీ(నాని) ఓ ఎరువుల తయారీకి సంబంధించిన కంపెనీలో జూనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పట్నుంచే ఓ విచిత్రమైన మతిమరుపు వ్యాధితో ఇబ్బంది పడే లక్కీ ప్రేమకథే ‘భలే భలే మగాడివోయ్’. లక్కీకి ఉన్న వ్యాధి ప్రకారం ఎంత పెద్ద విషయాన్నైనా, మరో కొత్త విషయం కంటపడగానే మైండ్ డైవర్ట్ అయిపోయి అసలు సంగతి మరచిపోతుంతాడు. అతడి ఈ మతిమరుపు కారణంగానే పెళ్ళి సంబంధాలు కూడా సెట్ అవ్వవు. ఇలాంటి పరిస్థితుల్లోనే లక్కీకి నందన (లావణ్య త్రిపాఠి) అనూహ్యంగా పరిచయమవుతుంది. లక్కీ, నందనల పరిచయం ఆ తర్వాత కొద్ది కాలానికే ప్రేమగా మారుతుంది.
అయితే లక్కీ మాత్రం ఎప్పుడూ తనకున్న మతిమరుపు గురించి నందన ముందు ప్రస్తావించడు. కొన్ని విచిత్ర పరిస్థితుల్లో లక్కీ మతిమరుపు వల్ల నందన అతడికి మరింత దగ్గరవుతుంది. కాగా లక్కీ తన మతిమరుపు వ్యాధితో ఇబ్బందులున్నా, సరదాగా జీవితాన్ని బాగానే నెట్టుకొస్తున్న సమయంలోనే నందన తండ్రి పాండు రంగారావు (మురళీ శర్మ) ద్వారా లక్కీకి అతిపెద్ద పరీక్ష ఎదురవుతుంది. లక్కీ ఈ పరీక్షను తనదైన స్టైల్లో ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడు వేసే ప్లాన్స్ ఏంటి? చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమే ‘భలే భలే మగాడివోయ్’.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక విచిత్ర వ్యాధికి, ప్రేమకథను, డ్రామాను జతచేసి ఓ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా చేయాలన్న ఆలోచన గురించి చెప్పుకోవాలి. ప్రేమకథల్లో సాధారణంగా అందమైన రొమాన్స్‌తో పాటు చిన్న ఫన్ ఉంటుంది. ఈ సినిమాలో ఆ ఫన్ ఎలిమెంట్ కోసం మతిమరుపు అనే కొత్త పాయింట్‌ను ఎంచుకొని దానిచుట్టూ ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను చెప్పే ప్రయత్నం చేయడమే ఈ మూవీకి మేజర్ హైలైట్. మతిమరుపు అనే పాయింట్ చుట్టూ ఫన్ కోసం రూపొందించిన కొన్ని సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే లక్కీ పాత్రలో నాని చాలా బాగా ఆకట్టుకున్నాడనే చెప్పాలి. నాని కామెడీ టైమింగ్ ఈ సినిమాను ఎక్కడో నిలబెట్టింది. ముఖ్యంగా అతడి డైలాగ్ డెలివరీ, మతిమరుపు నేపథ్యంలో కొన్ని విచిత్ర పరిస్థితుల్లో అతడిచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ అద్భుతంగా పండాయి. సినిమాకు ఎంచుకున్న పాయింట్ తర్వాత మేజర్ హైలైట్ అంటే నానియే అని చెప్పాలి. ఇక నందన పాత్రలో లావణ్య త్రిపాఠి అందంగా, నిండుగా కనిపించింది. డ్యాన్స్ టీచర్‌గా, ప్రేమలో పడ్డ ఓ అమ్మాయిగా రెండు నేపథ్యాల్లో వచ్చే సన్నివేశాల్లో లావణ్య చాలా బాగా చేసింది. ఇక వీరిద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. మురళీ శర్మ, సీనియర్ నరేష్, అజయ్ ఇతర పాత్రల్లో బాగా మెప్పించారు. ఇక నాని-వెన్నెల కిషోర్, నాని-ప్రవీణ్‌ల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు విపరీతంగా నవ్విస్తాయి.
సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ అంతా హీరోకున్న వ్యాధి, అతడి ప్రేమకథను పరిచయం చేయడం, చిన్న చిన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతూ విపరీతంగా నవ్విస్తుంది. ఇక సెకండాఫ్‌లో హీరో-హీరోయిన్ల ప్రేమకథ ఏమవుతుంది? అన్న ఒకే ఒక్క మేజర్ అజెండా చుట్టూ కొన్ని ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్ తో కథ ముందుకు వెళుతుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సూపర్బ్ గా పేలాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఒక క్లారిటీ లేని క్లైమాక్స్ గురించి చెప్పుకోవాలి. క్లైమాక్స్‌లో మంచి ఫన్ ఉన్నా కూడా సినిమాకు ఒక సరైన అర్థం తెచ్చిపెట్టేలా ఈ క్లైమాక్స్‌ను ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. నాని గతంలో చేసిన కామెడీ డ్రామాల తరహాలోనే ఈ సినిమా కథ కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నా, సినిమాలోని అసలైన డ్రామాను మాత్రం సరిగ్గా పండించలేదు. ‘మతిమరుపు’ అనే కొత్త పాయింట్‌ను తీసుకొని చెప్పిన ప్రేమకథలో చివరివరకూ దాన్ని కామెడీ ఎలిమెంట్‌గానే వాడడంతో సినిమాలో ఉండాల్సిన ఎమోషన్ మిస్ అయ్యింది.
ఇక అజయ్ క్యారెక్టరైజేషన్‌లో క్లారిటీ లేదు. క్లైమాక్స్ ఫైట్ కోసమే ఆ క్యారెక్టర్‌ను అలా డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఓ మాస్ పాట సినిమా ఫ్లోను దెబ్బతీసింది. ఇక హీరో వ్యాధి గురించి కూడా డీటైలింగ్ లేదు. అది ఇబ్బంది పెడుతున్న వ్యాధే అయితే అందుకు ట్రీట్‌మెంట్ జరుగుతుందా? ఏయే సందర్భాల్లో అతడి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉండదు? లాంటి విషయాలను ప్రస్తావించాల్సింది. ఇక చాలా చోట్ల లాజిక్ మిస్ చేశారు. అయితే టైటిల్స్‌కి ముందు ‘వేర్ డ్రామా బిగిన్స్, లాజిక్ ఎండ్స్’ (ఎక్కడైతే డ్రామా మొదలవుతుందో అక్కణ్ణుంచి లాజిక్ ఉండదు) అన్న ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ స్టేట్‌మెంట్‌ను వాడి లాజిక్స్ వెతకొద్దనే విషయం చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగానూ ‘భలే భలే మగాడివోయ్’ మంచి మార్కులే కొట్టేస్తాడు. ముందుగా రచయిత, దర్శకుడు అయిన మారుతి గురించి చెప్పుకుంటే కొత్త పాయింట్‌ను తీసుకొని దాన్ని ముందే ఫిక్స్ చేసి ఉన్న తెలుగు సినిమా స్టోరీ-స్క్రీన్‌ప్లే ఫార్మాట్‌లో పెట్టేశారు. అయితే ఈ ఫార్మాట్‌లోనే అద్భుతమైన టైమింగ్‌తో ఎంటర్‌టైనింగ్ సన్నివేశాలతో సినిమాను రాసుకోవడంలో మారుతి పూర్తిగా సఫలమయ్యారు. ఇక దర్శకుడిగానూ మారుతి తనదైన బ్రాండ్‌ను దూరం పెట్టి ఒక క్లీన్ కామెడీని తెరకెక్కించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. కొన్ని సన్నివేశాల్లో ‘ఇక్కడ కూడా ఇలాంటి ఫన్‌ను రాబట్టవచ్చా?’ అనేలా చాలా చోట్ల మారుతి మెరిశాడు.
ఇక సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ పనితనం సినిమాకు ఓ మంచి మూడ్‌ను తెచ్చిపెట్టిందనే చెప్పాలి. రొమాన్స్, కొంచెం సీరియస్‌నెస్, కామెడీ.. ఇలా మూడ్ మారిపోయే ప్రతీ సందర్భంలో సినిమాటోగ్రాఫర్ ప్రతిభను చూడొచ్చు. లుక్ పరంగా ఈ సినిమాకు ఓ టాప్ క్లాస్ లుక్ తెచ్చిపెట్టారు. గోపీ సుందర్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా ఫ్లోతో పాటే వచ్చే పాటలన్నీ బాగున్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సంగీత దర్శకుడు మరింతగా ఆకట్టుకున్నాడు. ఎడిటర్ ఉద్దవ్ పనితనం బాగుంది. ఇక గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్- యువి క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనగానే అందరిలో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్న ప్రొడక్షన్ వ్యాల్యూస్ కట్టిపడేస్తాయి.
తీర్పు :
నాని-మారుతిల క్రేజీ కాంబినేషన్‌లో ఆసక్తికరమైన పాయింట్‌తో మనముందుకు వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’, థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడిని ఆద్యంతం కట్టిపడేసి ఫుల్‌గా నవ్వించే సినిమా. ఒక విచిత్ర వ్యాధితో ఇబ్బందిపడే యువకుడి ప్రేమకథకు చిన్న చిన్న సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను, అల్టిమేట్ కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమాకు ఈ అంశమే మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఎలాంటి పాత్రనైనా తనదైన టైమింగ్‌తో చేసేసి మనల్ని కట్టిపడేసే నాని, తనదైన బ్రాండ్‌ను పక్కనపెట్టి చెప్పాలనుకున్న విషయాన్ని క్లీన్‌గా, అర్థవంతంగా నవ్విస్తూ చెప్పడంలో దర్శకుడు మారుతి చూపిన ప్రతిభ, నాని-లావణ్య త్రిపాఠిల క్యూట్ పెయిర్ ఈ సినిమాకు హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక క్లారిటీ లేకుండా ముగిసిన క్లైమాక్స్, డ్రామాకు స్కోప్ ఉన్నా పూర్తిగా ఫన్‌నే నమ్ముకోవడం వంటివి ఈ సినిమాకు చెప్పుకోదగ్గ మైనస్‌పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. నాని అంటే మనం ఎలాంటి సినిమా కోరుకుంటామో అందుకు ఏమాత్రం తగ్గకుండా, మొదట్నుంచీ చివరివరకూ నవ్విస్తూ, కొత్తదనంతో, సరదాగా, అందంగా సాగిపోయే కామెడీ ఎంటర్‌టైనర్.. ‘భలే భలే మగాడివోయ్’.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
123తెలుగు టీం