విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : జోషి
నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్
సంగీతం : రతీష్ వేఘ
నటీనటులు : మోహన్ లాల్, అమల పాల్
‘మన్యం పులి, కనుపాప’ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మోహన్ లాల్ మరొక డబ్బింగ్ చిత్రం ‘బ్లాక్ మనీ’ తో ఈరొజే ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
జర్నలిస్ట్ వేణు (మోహన్ లాల్) కు పాలిటిక్స్ అన్నా, పొలిటికల్ లీడర్స్ అన్నా భయం. అలాంటి అతన్ని మరొక జర్నలిస్ట్ రేణు (అమల పాల్) తో కలిస్ ఒక లంచం తాలూకు కేసులో ఆధారాలు సేకరించమంటారు పై ఉద్యోగులు. దాంతో వేణు, రేణుతో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఆధారాలు సేకరిస్తాడు. అంతా బాగానే జరుగుతోంది అనుకునే సమయానికి రేణు ఉన్నట్టుండి సేకరించిన ఆధారాలను వేరొక ఛానెల్ కు ఇచ్చేస్తుంది.
అదే సమయంలో కథలోకి ఒక మినిస్టర్ ఎంటరై వేణు, రేణులను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అలా చిక్కుల్లో పడ్డ వేణు వాటి నుండి ఎలా తప్పించుకున్నాడు ? కేసులోని అసలు నేరస్థుల్ని ఎలా జైలుకు పంపాడు ? అనేదే కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది మోహన్ లాల్ అనే చెప్పాలి. జర్నలిస్ట్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. సెకాండాఫ్ మొత్తాన్ని తన నటనతోనే ముందుకు తీసుకెళ్ళాలని ఆయన చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. అమల పాల్ కూడా తన పాత్ర మేరకు బాగానే నటించింది.
తన పాత్రలోని నెగెటివ్ షేడ్స్ ను చాలా బాగా ఎలివేట్ చేసింది. కానీ ఆన్ స్క్రీన్ మీద మోహన్ లాల్ తో ఆమె జోడీ మాత్రం అంతగా చూడదగ్గదిగా లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు ఫస్టాఫ్ చివరి 30 నిముషాల సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది.
అసలు మీడియా సర్కిల్ ఎలా పనిచేస్తుంది, ఒక ఛానెల్ టాప్ ప్లేస్ లో నిలవడానికి ఇతర చానల్స్ తో ఎలా పోటీపడుతుంది అనే వాటిని స్పష్టంగా, ఆసక్తికరంగా చూపారు. ఇక చివరగా సెకండాఫ్లో మోహన్ లాల్, అమల పాల్ ల మధ్య వచ్చే సంఘర్షణ పూరిత సన్నివేశాలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఇంటర్వెల్ అయ్యాక, సెకండాఫ్ మొదటి 15 నిముషాల గడిచాక సినిమా కాస్త కష్టంగా మారింది. మోహన్ లాల్, అమలా పాల్ ఇద్దరూ పోలీసుల నుండి తప్పించుకోవడం, దాక్కోవడం వంటి సీన్లు అసలు కథను పక్కదారి పట్టించాయి. దీంతో అప్పటి వరకు ఒక మూడ్లో ఉన్న సినిమా ఉన్నట్టుండి ఇంకొక మూడ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది.
సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఓవర్ గా ఉంది. చాలా చోట్ల విసిగించింది. దానిలో వలన కథనం కూడా అసలు కథ నుండి పక్కకు వెళ్ళిపోయినట్టు అనిపించింది. సినిమాలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కారణం లేకుండానే వస్తూ కాస్త తికమక పెట్టాయి. కథనం మొత్తం సీరియస్ గా నడిచేది కావడంతో కామెడీని కోరుకునే వారికి నిరుత్సాహం తప్పదు.
సాంకేతిక విభాగం :
సినిమాలో చాలా భాగం మలయాళం నేటివిటీ కనిపించడం వలన తెలుగు ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్సుంది. ముందుగానే చెప్పినట్టు సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా ఉంది. పాత్రల తెలుగు డబ్బింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్ లోని ఇంకొన్ని సీన్లను కట్ చేసి ఉండాల్సింది.
కెమెరా వర్క్ సహజంగా బాగుంది. ఇక దర్శకుడు జోషి విషయానికొస్తే అతని పనితనం జస్ట్ ఓకే ఆనేలా ఉంది. అతను ఎంచుకున్న కథ బాగుంది. కథనం కూడా కొన్ని చోట్ల బాగానే ఉన్నా సెకండాఫ్లో మాత్రం అనవసరంగా దాన్ని సాగదీసి సినిమాను పక్కదారి పట్టించారు.
తీర్పు :
ఈ ‘బ్లాక్ మనీ’ చిత్రం మంచి కథనే కలిగి ఉంది. టీవీ ఛానాళ్ళు మధ్య జరిగే పోటీ, సరదాగా సాగిపోయే ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. కానీ సెకండాఫ్ ను సాగదీయడం వలన సినిమా పక్కదారి పట్టి ఆసక్తిని కాస్త సన్నగిల్లేలా చేసింది. మొత్తం మీద చెప్పాలంటే ఇన్వెస్టిగేటివ్ తరహా సినిమాలని ఇష్టపడుతూ, సీరియస్ కథనాన్ని తట్టుకోగలిగే ప్రేక్షకులకు ఈ సినిమా బాగుంటుంది కానీ పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్స్ ను, కథనంలో ఖచ్చితత్వాన్ని కోరుకునే వారికి అంతగా నచ్చకపోవచ్చు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team