విడుదల తేదీ : 05 డిసెంబర్ 2014 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5 | ||
దర్శకత్వం : వేమా రెడ్డి | ||
నిర్మాత : నరసింహాచారి – నరసింహారెడ్డి | ||
సంగీతం : మిక్కీ జె మేయర్ | ||
నటీనటులు : సుమంత్ అశ్విన్, రెహనా… |
‘అంతక ముందు ఆ తరువాత’, ‘లవర్స్’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న సుమంత్ అశ్విన్ హీరో గా నటించిన మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘చక్కిలిగింత’. రెహన హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా ద్వారా సుకుమార్ ఫ్రెండ్ వేమా రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చక్కిలిగింత సినిమాతో సుమంత్ అశ్విన్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
హైదరాబాద్ ఎం.ఐ.టి కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్ చదివే ఓ కుర్రాడే మన సినిమా హీరో ఆది(సుమంత్ అశ్విన్). ఆదికి ప్రేమంటే మంచి ఒపీనియన్ ఉన్నా ఎప్పుడూ అబ్బాయిలే ఎందుకు వెళ్లి లవ్ ప్రపోజ్ చెయ్యాలి అమ్మాయిలు ఎందుకు తమ ఫీలింగ్స్ ని బయట పెట్టరు అని అమ్మాయిల మనస్తత్వానికి విరుద్దంగా వెళ్ళే కుర్రాడు. అలాగే తన ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళ లవర్స్ కి దూరం అయ్యేలా చేస్తాడు. కట్ చేస్తే అప్పుడే ఆది క్లాస్ లో చేరిన అవంతిక అలియాస్ అవి(రెహన) చేరుతుంది. అక్కడి సమస్యను తెలుసుకున్న అవంతిక ఆదికి వ్యతిరేఖంగా ఒక మిషన్ మొదలు పెడుతుంది.
ఆ మిషన్ ఏమిటంటే.. అమ్మాయిలంటేనే అసలు పడని ఆదిని అవంతిక ప్రేమలో పడేసి తనతోనే ఐ లవ్ యు చెప్పించేలా చెయ్యడం.. ఫైనల్ గా ఈ మిషన్ లో అవంతిక సక్సెస్ అయ్యిందా.? ఒకవేళ సక్సెస్ అయితే ఆది ఎందుర్కున్న ఇబ్బందులేమిటి.? ఇవన్నీ కాకుండా ఆది ముందే అవంతిక ప్లాన్ తెలుసుకొని రివర్స్ గేమ్ ఏమన్నా ప్లే చేసాడా.? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అంతే కాస్త ఆలోచించి ఆచి తూచి చెప్పాలి.. ఎందుకంటే చెప్పడానికి పెద్దగా ఏమీ లేవు.. ఈ సినిమాకి ప్లస్ అంటే సినిమా మొదలైనప్పటి నుంచి 20, 30 నిమిషాల ఎపిసోడ్ మాత్రమే కాస్త ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అది కూడా ఎందుకు అంటే ఇప్పుడున్న యువత లవ్ అనే పేరుతో ఎలాంటి ప్రెజర్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని చూపించారు కాబట్టి. అలా అని ఇది ఇదివరకూ చూపించలేదని కాదు, ఇది డైలీ లైఫ్ లో ఉండేది కావున మళ్ళీ మళ్ళీ చూసినా యువత కనెక్ట్ అవుతారు. అలానే ఓవరాల్ గా ఆడియన్స్ కూడా ఆ మొదటి 20-30 నిమిషాలకు మాత్రమే కనెక్ట్ అవుతారు.
ఇక చెప్పుకోవాల్సింది మన సినిమా హీరో సుమంత్ అశ్విన్ గురించి.. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బెటర్ అండ్ మెచ్యూర్ పెర్ఫార్మన్స్ చేసాడు. సుమంత్ అశ్విన్ చేసిన పాత్రకి కాస్త నెగటివ్ షేడ్స్ ఉండేలా డిజైన్ చేసుకోవడం వలన అతనిలోని నటన కాస్త బయటపడింది. ఇక ఎప్పటిలానే కొన్ని పాటల్లో డాన్సులు బాగా చేసాడు. ఇక ఈ సినిమాలో హైలట్ అయ్యింది అంటే అది వైవా హర్ష.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వైవా హర్ష బాగా నవ్వించాడు. ఇక మొదటి సారి తాగుబోతు రమేష్ కామెడీతో కంటే సెంటిమెంట్ తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో గెస్ట్ పాత్రల్లో వచ్చే సప్తగిరి, జబర్దస్త్ చంద్ర ఉన్నది రెండు నిమిషాలే అయినా ఆడియన్స్ ని బాగా నవ్విస్తారు. హీరోయిన్స్ లుక్స్ పరంగా మాత్రమే చాలా బాగుంది, అలాగే డాన్సులు కూడా బాగా చేసింది. కానీ నటన గురించి మాత్రం మాత్రం కింద సెక్షన్ లో చెబుతా..
మైనస్ పాయింట్స్ :
ప్రతి సినిమాకి కథే హీరో, హీరోయిన్, డైరెక్టర్.. ఇది కరెక్ట్ గా ఉండి, దాన్ని పర్ఫెక్ట్ గా తీయగలిగితే ఆ సినిమాలో హీరో ఎవరైనా సినిమా హిట్ అయ్యి తీరుతుంది. కానీ ఈ సినిమాకి అసలుసిసలైన కథే మేజర్ మైనస్ పాయింట్. కథ ఎందుకు మైనస్ అనేది కాస్త క్లియర్ గా చెబుతా.. డైరెక్టర్ ఓ క్రేజీ పాయింట్ నే స్టొరీ లైన్ గా తీసుకున్నాడు. కానీ దాన్ని ఎలా డీల్ చెయ్యాలో తెలియక, ఎలా ముగించాలో తెలియక స్టార్ట్ చేసిన పాయింట్ ని మొదటి 30 నిమిషాల్లోనే వదిలేసి దానికి మా కథకి సంబంధం లేదని పక్కకి వెళ్ళిపోయి, చివర్లో మరో కొత్త పాయింట్ తో ముగించేసారు. దాంతో చూసే ఆడియన్స్ ఏందీ ఈ సినిమా కథ హైదరబాద్ నుండి వైజాగ్ వెళ్ళాలి కానీ మన డైరెక్టర్ హైదరబాద్ టు ఖమ్మం వరకూ కరెక్ట్ గా వెళ్లి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని నేరుగా కాశ్మీర్ తీసుకెళ్ళి కథని ముగించేసాడు. దాంతో అసలు కథ కంచికి వెళ్ళిపోయింది, ప్రేక్షకులేమో పరమ బోర్ కొట్టి చిరాకు వచ్చేస్తుంది.
ఇక ఈ సినిమాకి చాలా కీలకమైన పాత్ర హీరోయిన్ రెహన చేసింది. తను లుక్స్ పరంగా చాలా బాగుంది కానీ నటన పరంగా మాత్రం ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా ఈ సినిమాకి కావాల్సినంత నటనని కనబరచలేదు. ఎందుకంటే చాలా కీలకమైన సీన్స్ లో హావభావాలు మాత్రం నిల్ అని చెప్పాలి. డైరెక్టర్ హీరోయిన్ కి ఇంత ప్రాముఖ్యత ఉన్న పాత్ర రాసుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఉన్న అమ్మాయిని తీసుకోవాలి. లేదా తీసుకున్న అమ్మాయితే పర్ఫెక్ట్ గా చేయించుకోవాలి. ఇకపోతే కథ ఎలాగో పక్కదార్లు తొక్కడం వలన స్క్రీన్ ప్లే కూడా ఎటు పడితే అటు వెళ్ళింది. స్క్రీన్ ప్లే ఎంత దారుణంగా తయారయ్యింది అంటే థియేటర్ లో కూర్చున్న వారు నెక్స్ట్ వచ్చే సీన్స్ ని మాత్రమే కాదు, ఆ సీన్స్ లో వచ్చే డైలాగ్స్ ను కూడా ముందే చెప్పేస్తున్నారు. సినిమా మొదటి 20 నిమిషాల తర్వాత డెడ్ స్లో అయిపోతుంది. ఆ తర్వాత నుంచి డైరెక్టర్ ఎక్కడా సినిమాని వేగంవంతం చెయ్యడానికి కానీ, ఆడియన్స్ లో బోర్ అనే ఫీలింగ్ ని పోగొట్టడానికి కానీ ట్రై చెయ్యలేదు. ఇక సుమారు రెండున్నర గంటల పాటు ఉండే ఈ సినిమా రన్ టైం కూడా ఈ సినిమాకి మైనస్ పాయింట్.
అలాగే మొదటి నుంచి లవ్ అంటేనే పడదు అనేవాడు, పీకల్లోతు ప్రేమలో ఎలా పడ్డాడు అని ఇచ్చిన రీజన్ చాలా సిల్లీగా ఉంటుంది. ఆ సిల్లీ పాయింట్ కోసం హీరో కోసం రాసుకున్న క్యారెక్టరైజేషన్ ని చంపేసాడు. సెకండాఫ్ బోరింగ్ అనే పదమే సిగ్గుపడేలా సాగుతుంటే మధ్య మధ్యలో పాటలు వచ్చి ఇంకా ఇబ్బంది పెడతాయి. క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ తో ముగించలేదు. దాంతో ఆడియన్స్ సినిమా పాయింట్ కి క్లైమాక్స్ లో కూడా కనెక్ట్ అవ్వరు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ మరియు మేజర్ మైనస్ పాయింట్స్ రెండూ టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లోనే జరిగాయి. ముందుగా బెస్ట్ అనిపించుకున్న మూడింటి గురించి చెబుతా.. అవే సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, మ్యూజిక్. నిర్మాత అనే వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు కాబట్టి ముందుగా వాళ్ళ గురించి చెబుతా.. నరసింహాచారి – నరసింహారెడ్డిలు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో రిచ్ నెస్ ని పెంచింది. చూసే ఆడియన్స్ ఎవ్వరికీ ఒక చిన్న సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు. నిర్మాణ విలువలు సింప్లీ సూపర్బ్. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాకే ఓ ఫ్రెష్ లుక్ ని తీసుకువచ్చింది. సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ ఏ మాత్రం తేడాగా ఉన్నా ఆడియన్స్ ఎవ్వరూ సినిమా అయ్యేంతవరకూ కూర్చునేవారు కాదు. ఎందుకంటే తను ప్రతి ఫ్రేం ని చాలా గ్రాండ్ గా ఫ్రెష్ గా ఫీలయ్యేలా చూపించాడు. ఇక మిక్కీ జె మేయర్ అందించిన పాటలు సినిమాకి పెద్దగా హెల్ప్ కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ కూడా మంచి కలర్ఫుల్ సెట్స్ ని డిజైన్ చేసాడు. జయంత్ పానుగంటి రాసిన డైలాగ్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి.
ఇక మైనస్ అయిన డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే .. మొదటగా ఎడిటింగ్.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. ఆయన అయినా డైరెక్టర్ కి సినిమా ఎక్కడి నుంచో ఎక్కడికో వెళుతోందని చెప్పాల్సింది. అసలు చాలా సీన్స్ లేపెయ్యడానికి అయినా పోరాడాల్సింది. ఇకపోతే ఈ సినిమాకి రచన – దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది వేమా రెడ్డి.. వేమా రెడ్డి సీనియర్ టెక్నీషియన్ అయినప్పటికీ డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా కావడం, కొత్త కాన్సెప్ట్ అవ్వడంతో కాస్త తడబడడం వలన అనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలేదు. కథ – స్క్రీన్ ప్లే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అంతే కాకుండా డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ సరిగా నిరూపించుకోలేకపోయాడు. ఇలా వేమా రెడ్డి తను డీల్ చేసిన అన్ని డిపార్ట్ మెంట్స్ లోనూ మొదటి ప్రయత్నంలో ఫెయిల్యూర్ అయ్యాడు.
తీర్పు :
వరుసగా రెండు హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్ కోసం ఆరాటపడుతున్న సుమంత్ అశ్విన్ కోరికని ‘చక్కిలిగింత’ తీర్చలేకపోయింది. ఓ కొత్త పాయింట్ ని తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో మొదలైన ఈ సినిమా కథ సెట్స్ పైకి వచ్చి పూర్తయ్యే సరికి దారి తప్పి ఎటు పడితే అటు వెళ్లి ఫైనల్ గా క్లారిటీ, సరైన జస్టిఫికేషన్ ఇవ్వకుండా సముద్రంలో కలిపేసారు. అలాగే ఈ సినిమా కోసం స్టొరీ లైన్ అనుకున్న దర్శకుడే సినిమా తీయడంలో గందరగోళంలో పడడం ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్. సినిమా స్టార్టింగ్ 20 నిమిషాలు, సుమంత్ అశ్విన్ పెర్ఫార్మన్స్, గ్రాండ్ విజువల్స్ తప్ప ఈ సినిమాకి హెల్ప్ అయ్యే అంశాలు ఏమీ లేవు. అనుకున్న కథని పర్ఫెక్ట్ గా చెప్పలేకపోవడం, బోరింగ్ గా సాగే స్కీన్ ప్లే, సెకండాఫ్ బోరింగ్ + జీరో ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఫైనల్ గా ‘చక్కిలిగింత’ సినిమా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టి నవ్వించకపోగా బాగా బోర్ కొట్టించి చిరాకు పెట్టించారు.
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం