విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : మణిరత్నం
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : ఏఆర్ రెహమాన్
నటీనటులు : కార్తి, అదితిరావ్ హైదరి
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మణిరత్నం సినిమా అంటే అన్ని పరిశ్రమల్లోని ప్రేక్షకులకు ఆసక్తి, అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం కార్తి, అదితిరావ్ హైదరీలు జంటగా ఆయన రూపొందించిన చిత్రం ‘చెలియా’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంచులను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం..
కథ :
1999 కార్గిల్ యుద్ధం జరిగే సమయంలో లీల (అదితిరావు హైదరి) అనే డాక్టర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ పైలెట్ వరుణ్ (కార్తి) తో ప్రేమలో పడుతుంది. అలా వారిద్దరూ ప్రేమలో ఉండగానే సరైన కమిట్మెంట్ లేని వరుణ్ ప్రవర్తన, మనస్తత్వం వలన లీల అతనికి దూరమవుతుంటుంది.
అలాంటి సమయంలోనే వచ్చిన ఒక యుద్ధ వాతావరణంతో వరుణ్ పాకిస్తా జైల్లో బందీ అవుతాడు. అలా పాకిస్థాన్ చేతిలో బందీ అయిన కార్తి ఎలా తప్పించుకున్నాడు ? చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్ అంటే రవి వర్మ అందించిన సినిమాటోగ్రఫీ అనొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి విజువల్ అద్భుతంగా అనిపించింది. కాశ్మీర్, లడక్ లొకేషన్లలో తీసిన సన్నివేశాలను, హీరో హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలను చాలా బాగా చూపించారు. క్లిష్టమైన ఫైటర్ పైలట్ పాత్రలో కార్తి చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన చాలా గొప్పగా ఉంది.
అదితిరావ్ హైదరి ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి మంచి ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి. మణిరత్నం ఆమెను ఇదివరకెన్నడూ చూడనంత అందంగా చూపించాడు. అదిరిరావ్ తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకి మంచి బలంగా నిలిచింది. ఫస్టాఫ్ అంతా మంచి రొమాన్స్, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే డ్రామాతో నిండి మణిరత్నం స్టైల్లో ఉంది.
ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్. కీలకమైన సన్నివేశాలు, హీరో హీరోయిన్ల మధ్య నడిచే రొమాంటిక్ సీన్లలో ఆయన అందించిన స్కోర్ ఆ సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా చేసింది. చిత్ర క్లైమాక్స్ కూడా బాగా కుదిరింది. హీరో హీరోయిన్ల మధ్య మంచి ఎమోషనల్ కెమిస్ట్రీ క్లైమాక్స్ లో బాగా వర్కవుట్ అయింది.
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్ అంతా బాగా నడిపిన మణిరత్నం సెకండాఫ్ కు వచ్చే సరికి రొమాంటిక్ డ్రామాను బాగా నెమ్మదిగా తయారుచేశారు. అందులోని ప్రతి సీన్ స్లోగానే నడిచింది. ఇది కొన్ని వర్గాల ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. సెకండాఫ్లో కార్తి పాత్ర చిత్రీకరణ కాస్త తడబడినట్లు అనిపించింది. అతను ప్రేమ నుండి ఎందుకు తప్పించుకోవాలనుకుంటాడు అనే అంశాన్ని వివరంగా చూపలేదు.
ఈ సెకండాఫ్ సన్నివేశాల్ని ఇంకాస్త బాగా డీల్ చేసుంటే సినిమా ఇంకా బాగుండేది. ఒక్క రెండు పాటల మినహా మిగతా పాటల్లో రెహమాన్ సంగీతం ఏమంత చెప్పుకోదగ్గదిగా లేదు. ఇంకొంచెం మంచి పాటలు ఉండి ఉంటే సినిమా ఇంకాచక్కగా తయారయ్యేది.
సాంకేతిక విభాగం :
ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో చెలియా చిత్రం చూడడానికి చాలా బాగుంది. నిర్మాతలు సినిమాకి సహజమైన లుక్ తీసుకురావడానికి చేసిన ఎయిర్ ఫోర్స్ సెటప్ బాగుంది. సులభమైన మాటలతో పాత్రలకు చెప్పిన తెలుగు డబ్బింగ్ బాగుంది. హీరో హీరోయిన్ల స్టైలింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గెటప్ లో కార్తిని చాలా బాగా చూపించారు.
ఇక దర్శకుడు మణిరత్నం విషయానికొస్తే ఆయన పనితనం పర్వాలేదనిపించుకుంది. ఒక ప్రత్యేకమైన బ్యాక్ డ్రాప్లో తీసిన విజువల్స్, హీరో హీరోయిన్ల రొమాంటిక్ కాన్వర్జేషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కానీ సెకండాఫ్లో రొమాంటిక్ డ్రామా చాలా సార్లు ట్రాక్ తప్పింది. ప్రేమ కథలోని సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ రిపీటవడం, కార్తి పాకిస్థాన్ నుండి తప్పించుకోవడం వంటివి కాస్త అసహనానికి గురిచేశాయి.
తీర్పు :
ఈ ‘చెలియా’ చిత్రం ఖచ్చితంగా మిశ్రమ స్పందన తెచ్చుకునే చిత్రమే. కొందరు ప్రేక్షకులు మణిరత్నం యొక్క రొమాంటిక్ డ్రామా, టేకింగ్ ను ఇష్టపడితే ఇంకొందరు ప్రేక్షకులకు ఆ సీరియస్ రొమాంటిక్ డ్రామాను ఎంజాయ్ చేయడం కష్టంగా ఉంటుంది. కార్తి, అదితిరావ్ హైదరిల మధ్య కెమిస్ట్రీ, ఎంటర్టైనింగా ఉండే ఫస్టాఫ్ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా నెమ్మదిగా సాగుతూ సాగదీయబడినట్టు ఉండే సెకండాఫ్ ప్రధాన బలహీనత. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం నెమ్మదైన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాను ఇష్టపడే వారికి బాగుంటుంది కానీ మిగిలిన ప్రేక్షకులకు యావరేజ్ చిత్రంగానే అనిపిస్తుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team