విడుదల తేదీ : 3 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : శైలేంద్రబాబు
నిర్మాత : గుడ్ సినిమా గ్రూప్
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : కృష్ణప్రసాద్, తనుజ, జాను, విజయ్ చందూర్
ఈ మధ్య కాలంలో తెలుగులో హర్రర్ సినిమాల హవా ఎక్కువైంది. ప్రస్తుతం వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో హర్రర్ సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చిపడుతున్నాయి. కన్నడంలో విడుదలైన ఓ ట్రూ ఫుటేజీ సినిమా తెలుగులోకి ‘చిత్రమ్ కాదు నిజమ్’ పేరుతో రూపొంది నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
మంగుళూరు ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ట్రెక్కింగ్ చేయడానికి ఆరుగురు మిత్రులు కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడి అడవికి వెళతారు. ఈ క్రమంలోనే గ్రూపులోని ఒక్కొక్కరూ చనిపోతుంటారు. ఆ గ్రూపులోని ఓ వ్యక్తి ఈ దృశ్యాలన్నీ తన కెమెరాలో బంధిస్తాడు. ఈ కెమెరా ఆ తర్వాత పోలీసులకు దొరుకుతుంది. గ్రూపులోని ఒక్కొక్కరూ ఎలా చనిపోయారన్నది మిగతా కథ
ప్లస్ పాయింట్స్ :
ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను సినిమాగా తెరకెక్కించే క్రమం ఆకట్టుకుంటుంది. అడవిలో ఎదురయ్యే సంఘటనలను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా సందర్భానుసారంగా కనిపించే కామెడీ బాగుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని భయపెట్టే సన్నివేశాలు కట్టిపడేస్తాయ్. ఫస్టాఫ్‌తో పోల్చుకున్నపుడు సెకండాఫ్ బాగుందని చెప్పొచ్చు. సెకండాఫ్‌లోని వేగం సినిమా చూసేవారికి మంచి ఆసక్తి కలిగిస్తుంది. సెకండాఫ్‌లోనే వచ్చే కొన్ని సన్నివేశాల్లో సినిమా చెప్పదలచిన అసలు విషయాన్ని చూడొచ్చు. సినిమాలో నటించిన ఆరుగురూ చాలా బాగా చేశారు. అడవిలో అద్భుత దృశ్యాలను బాగా తెరకెక్కించారు. ఒక్కొక్కరూ చనిపోయే విధానం చూసినపుడు భయం కలగక మానదు.
మైనస్ పాయింట్స్ :
హర్రర్ సినిమాను నిలబెట్టే ప్రధానమైన అంశం థ్రిల్. అలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఈ సినిమాలో చాలా తక్కువ అని చెప్పాలి. కేవలం ఒక ట్రూ ఫుటేజీని తీసుకొని ఓ సినిమాను తీయడం ద్వారా సినిమాకు కావాల్సిన ఎమోషన్ మిస్సయింది. హర్రర్ సినిమాల్లో సాధారణంగానే భయపెట్టడానికి కొన్ని టెక్నిక్స్ వాడతారు. ఆ అవకాశం ఈ సినిమాకు లేకపోవడం మరో మైనస్. సినిమాలోని కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా అతి మామూలుగా ఉండడం విసుగు తెప్పిస్తుంది.
ఇంట్రవెల్ వరకూ సినిమాలో కథనేదే లేకపోవడం బాలేదు. ఇంట్రవెల్ తర్వాత గానీ కథ దార్లో పడదు. అన్నీ కొత్త ముఖాలే కావడంతో సినిమా చూసేవారు కనెక్టయ్యే అవకాశం తక్కువగా ఉంది. సినిమాలో చెప్పినట్టు ఇది ట్రూ ఫుటేజీ అనే విషయం నమ్మశక్యంగా లేదు. అక్కణ్ణుంచి ప్రేరణ పొంది కొత్తగా తెరకెక్కించిన సన్నివేశాలే సినిమాలో కనిపించేవని అర్థమైపోతుంది.
సినిమా నిడివి చాలా తక్కువ ఉన్నా అందులోనూ సన్నివేశాలు స్లో పేస్‌లో నడవడం చిరాకు తెప్పిస్తుంది. చివర్లో వచ్చే పదిహేను నిమిషాలను పక్కనపెడితే సినిమాలో చెప్పడానికి ఏమీ లేదు. చివర్లో ఓ వ్యక్తి అక్కణ్ణుంచి తప్పించుకున్న విధానంలో క్లారిటీ లేదు.
సాంకేతిక విభాగం :
సినిమాలో అందరికన్నా ఎక్కువ మార్కులు కెమెరా వర్క్‌కు వెళతాయ్. నిజంగా జరిగిన సంఘటనగా దీన్ని తెరకెక్కించడం ఆకట్టుకునేలా ఉంది. చాలా సన్నివేశాల్లో కెమెరా పనితనం కట్టిపడేస్తుంది. అడవి లొకేషన్లు అద్భుతంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం హర్రర్ సినిమా అనే కాన్సెప్ట్‌కు సరిగ్గా సరిపోయేలా ఉంది. మరిన్ని థ్రిల్ మూమెంట్స్ గనక ఉండి ఉంటే సినిమా మరింత బాగుండేది. దర్శకత్వంలో మెరుపులను అక్కడక్కడా చూడొచ్చు.
తీర్పు :
వేగంగా సాగిపోయే సెకండాఫ్, మంచి లొకేషన్లు, భయపెట్టే కొన్ని సన్నివేశాలు, కెమెరా పనితనం వంటి విషయాలు ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. పెద్దగా థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం, హర్రర్ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్ మిస్సవడం వంటివి ఈ సినిమాకు నెగటివ్ అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మిస్ చేసిన హర్రర్ సినిమా.. చిత్రమ్ కాదు నిజమ్.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం