విడుదల తేదీ : ఆగష్టు 19, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : వీరభద్రం
నిర్మాత : వెంకట్ తలారి, రామ్ తల్లూరి
సంగీతం : ఎస్.ఎస్. థమన్
నటీనటులు : ఆది, నమిత ప్రమోద్
కొన్నాళ్లుగా సరైన హిట్ లేక తడబడుతున్న యంగ్ హీరో ‘ఆది’ యాక్షన్ ఫార్ములాను పక్కనపెట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నమ్ముకుని చేసిన సినిమానే ఈ ‘చుట్టాలబ్బాయి’. ‘పూలరంగడు, భాయ్’ ఫేమ్ ‘వీరభద్రం’ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నమితా ప్రమోద్’ హీరోయిన్ గా నటించగా ఆది తండ్రి ‘ సాయి కుమార్’ ఓ ప్రధాన పాత్రలో నటించాడు. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
హైదరాబాద్ సిటీలోని ఓ బ్యాంకులో రికవరీ ఏజెంట్ గా పనిచేసే బాబ్జీ (ఆది) అనే కుర్రాడు సిటీకి చెందిన ఏసీపీ(అభిమన్యు సింగ్) చెల్లెలు కావ్య (నమితా ప్రమోద్)ను అనుకోకుండా కలుస్తాడు. దాన్ని గమనించిన ఏసీపీ వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని పొరపడి బాబ్జీ వెంటపడతాడు. బాబ్జీ తమది ప్రేమ కాదని ఏసీపీకి క్లారిటీ ఇవ్వాలనుకునేలోపు కావ్య తన అన్న ఫిక్స్ చేసిన పెళ్లి సంబంధం ఇష్టం లేక ఇంట్లో నుంచి పారిపోతుంటుంది.
బాబ్జీ కూడా అనుకోకుండా ఆమెతో వెళ్ళిపోయి, కావ్యతో పాటే తన సొంత ఊరికి చేరుకుంటారు. అలా పారిపోయే సమయంలో వాళ్ళను ఒక గ్యాంగ్ ఫాలో చేస్తుంటుంది. ఆ గ్యాంగ్ ఎవరు ? వాళ్ళు బాబ్జీ, కావ్యాలను ఎందుకు ఫాలో చేస్తారు ? ఇంటికెళ్లిన తరువాత బాబ్జీ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు ? వాటి నుండి ఎలా తప్పించుకున్నాడు ? అసలు తమ మధ్య ప్రేమే లేదనుకున్న బాబ్జీ, కావ్యలు ఎలా ఒక్కటయ్యారు ? అన్నదే తెరపై నడిచే కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది సినిమాలోని కామెడీ గురించి. ఇగో కలిగిన రౌడీ పాత్రలో ’30 ఇయర్స్ పృథ్వి’ చేసిన కామెడీ నవ్విస్తుంది. మొదటి భాగాం నుండి మొదలయ్యే పృథ్వి కామెడీ పంచ్ లు కలిగి ఇంటర్వెల్ వరకూ కథతో పాటే సాగుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అలాగే మొదటి భాగంలో దర్శకుడు ‘వీరభద్రం’ సినిమాని ఎంటర్టైనింగ్ మ్యానర్ లో మొదలుపెట్టిన తీరు బాగుంది.
హీరో ఆది తన గత సినిమాల కంటే ఈ సినిమాలో మంచి హావభావాలను పలికించాడు. మొదటి పాటలో అతను చేసిన డ్యాన్స్ బాగుంది. తనలో ఉన్న కామెడీ టైమింగ్ ను కూడా ఆది బాగా ఉపయోగించుకున్నాడు. అలాగే హీరో ఫ్రెండ్స్ గా షకలక శంకర్ కామెడీ పంచ్ లు అక్కడక్కడా పేలాయి. పోసాని కామెడీ ట్రాక్ సినిమాకు కొంత వరకూ ప్లస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో ఆది ఫ్యామిలీ పై నడిచే కొన్ని కుటుంబ పరమైన సన్నివేశాలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది కథ గురించి. ఈ సినిమా కథ కూడా చాలా సినిమాల్లాగే రొటీన్ గా సాగుతుంది. కథలో ఎక్కడా కొత్తదనం కానీ, కథనంలో వేగం కానీ కనిపించవు. ప్రతి చోటా తరువాత ఏం జరుగుతుంది అనేది చాలా సులభంగా ఊహించెయ్యవచ్చు. సినిమాకి మరో మైనస్ హీరోయిన్ పాత్రలో నటించిన ‘నమితా ప్రమోద్’. సినిమాలో చాలా చోట్ల రొమాంటిక్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె అవసరమైన స్థాయి నటన కనబరచలేదు.
సెకండ్ హాఫ్ లో అలీ పై నడిచే కొన్ని రొటీన్ కామెడీ సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయి. మొదటి నుండి సినిమాలో ‘సాయి కుమార్’ పాత్ర అదిరిపోతుందని, స్పెషల్ గా ఉంటుందని అన్నారు కానీ సినిమాలో ఆ పాత్ర చాలా లైట్ గా, రొటీన్ గా ఉండి కాస్త నిరుత్సాహం తెప్పించింది. మొదటి భాగంలో గాని, రెండవ భాగంలో గాని కథలో, కథనంలో ఎక్కడా ఆసక్తికరమైన మలుపులు లేకుండా సినిమా సాదాసీదాగా సాగింది.
సాంకేతిక విభాగం :
నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నిర్మాతలు పెట్టిన ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. పల్లెటూరి నైపథ్యంలో సాగే రెండవ భాగంలో కెమెరా వర్క్ అందంగా ఉంది. 30 ఇయర్స్ పృథ్వీ, షకలక శంకర్ పాత్రలకు రాసిన కామెడీ పంచ్ డైలాగులు చాలా బాగున్నాయి.
థమన్ అందించిన సంగీతం మొదటి పాటలో బాగుండి మిగతా అంతా పరవాలేదనిపించింది. ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు వీరభద్రం విషయానికొస్తే కథని మొదలుపెట్టిన తీరు, కామెడీ ట్రాక్ ను కథతో పాటే నడిపిన విధానం బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో ఆకట్టుకునే సన్నివేశాలు, కొత్తదనం పూర్తిగా లోపించాయి.
తీర్పు :
ఈ చుట్టాలబ్బాయి చిత్రం మొదటి భాగాం ఎంటర్టైనింగ్ గా బాగానే ఉంది. మంచి పంచ్ డైలాగులు, టైమింగ్ తో సాగే 30 ఇయర్స్ పృథ్వి కామెడీ, హీరో ఆది నటన ఈ చిత్రంలో మెచ్చుకోదగ్గ అంశాలు. పాత కథ, రొటీన్ గా సాగే సెకెండ్ హాఫ్ కథనం ఇందులో నిరుత్సాహపరిచే విషయాలు. మొత్తంగా చెప్పాలంటే కాస్త కామెడీ ఎంటర్టైన్మెంట్ ను కోరుకుని సినిమాకి వెళ్లే ప్రేక్షకులకు ఈ సినిమా సరిగ్గా సరిపోతుంది.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team