సమీక్ష : దాన వీర శూర కర్ణ – బాలలతో మహా భారత ప్రయత్నం!

సమీక్ష : దాన వీర శూర కర్ణ – బాలలతో మహా భారత ప్రయత్నం!

Published on Aug 15, 2015 11:28 PM IST
Daana-Veera-Soora-Karna

విడుదల తేదీ : 15 ఆగష్టు 2015

దర్శకత్వం : జె.వి.ఆర్.

నిర్మాత : సి.హెచ్. వెంకటేశ్వర రావు, జె. బాలరాజు

సంగీతం : కౌసల్య

నటీనటులు : మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్ర తదితరులు..

‘దాన వీర శూర కర్ణ’.. ఈ పేరు వింటే తెలుగు సినీ అభిమానులకు మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఆయన కెరీర్లోనే కాక, తెలుగు సినీ చరిత్రలోనూ ఓ మరచిపోలేని సినిమా. ఇప్పుడు తాజాగా అదే పేరుతో, ఆ సినిమాకు ప్రేరణగా పూర్తిగా బాల నటులనే పెట్టి సినిమా తీశారు దర్శకుడు జె.వి.ఆర్. ఎన్టీఆర్ వంశంలోని నాలుగోతరం నుంచి మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్రలను నటులుగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘దాన వీర శూర కర్ణ’ అంటూ క్లాసిక్ అనిపించుకున్న సినిమాకు ప్రేరణగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

మహా భారతంలో ప్రధానమైన కథతో పాటు మరెన్నో ఉపకథలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతీ ఉపకథా దేనికదే ఓ పెద్ద సినిమాగా రూపొందగలదన్న విషయాన్ని తెలుగు పౌరాణికాలు చాలానే చూపించాయి. ఆ క్రమంలోనే దాన వీర శూర కర్ణ కథను కూడా చూడొచ్చు. కర్ణుడి కోణంలో చూసే మహా భారత కథనే ఈ సినిమా కథగా చెప్పుకోవచ్చు. కుంతీ దేవికి ఓ వరం ద్వారా పుట్టిన కర్ణుడు, ఆ తర్వాత ఆమె వదిలేయడంతో సూతుల వంశంలో పెరిగి పెద్దవాడవుతాడు. పెరిగి పెద్దయ్యాక దుర్యోధనుడి స్నేహంతో కౌరవుల తరపున తన జీవితమంతా నిలబడతాడు కర్ణుడు. పాండవుల కుటుంబానికి చెందిన వాడైనా.. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం కోసం కౌరవుల తరపునే యుద్ధంలో పోరాడడం, అక్కడే మరణం పొందడంతో సినిమా ముగుస్తుంది. కర్ణుడి కథతో మొదలైన సినిమా కర్ణుడి తోనే పూర్తవగా, మధ్యలో మహా భారత ప్రధాన కథను చెప్పే ప్రయత్నం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే బాలలతో ఇంత పెద్ద కథను చెప్పాలని చేసిన ప్రయత్నం గురించి చెప్పుకోవాలి. బాలలతో ఒక చిన్న ఎపిసోడ్ తీయడమనేదే కష్టంతో కూడుకున్న పని. అలాంటిది మహా భారత కథను, రెండున్నర గంటలపాటు, కేవలం బాల నటులతోనే చెప్పించడమంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అలాంటి సాహసాన్ని దాదాపుగా సమర్థవంతంగానే తెరకెక్కించారని చెప్పుకోవాలి. కథ పరంగా మహా భారతంలో ప్రతీ ఉపకథా ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ సినిమాలో ప్రధాన కథను కర్ణుడి కోణంలో చెప్పడంతో అంతా సాఫీగా బోర్ కొట్టకుండా సాగిపోతుంది.

ఇక బాలనటుల విషయానికి వస్తే దుర్యోధన, దుశ్శాసన, శకుని, అర్జునుడు, ధర్మరాజు, భీముడు.. ఇలా అందరూ బాలనటులైనా చక్కగా చేశారు. ఇక నందమూరి నాలుగో తరం నుంచి పరిచయమైన మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా బాగా ఆకట్టుకున్నాడు. సాధారణంగా బాలలు చిన్న చిన్న కార్యక్రమాల్లో మహా భారత పాత్రల గెటప్ వేస్తేనే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అదే బాలలు పూర్తిగా ఆ పాత్రల్లో ఒదిగిపోయి నటిస్తే చూడడానికి ఇంకెంత ముచ్చటగా ఉంటుంది? అది ఈ సినిమాలో చూడొచ్చు. ఇక పెద్ద పెద్ద డైలాగులను సైతం అందరూ తమ స్థాయికి తగ్గట్టుగా బాగా చేశారు. అక్కడక్కడా తడబడ్డా అందరూ తమ స్థాయి మేరకు బాగా మెప్పించారు.

సినిమా పరంగా చూసుకుంటే అక్కడక్కడా మందగించిన కథనం, కొన్ని అనవసరమైన సన్నివేశాలు, పాటలు మినహా సినిమా అంతా సాఫీగా సాగిపోయింది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కొన్ని చోట్ల డీటైలింగ్ ఇవ్వకపోవడం గురించి చెప్పుకోవాలి. నిజానికి ఇంత పెద్ద కథను, ఒక సినిమాగా చెప్పడం కుదరదు. అందుకనే ఒక కోణాన్ని ఎంచుకొని ఆ కోణంలో ప్రధాన కథను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే కొన్ని సన్నివేశాలకు బ్యాక్‌స్టోరీ తెలియని వారికి సినిమాలో క్లారిటీ దొరకదు. ఆ విషయంలో చాలా చోట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమా నిడివి పెంచకుండానే ఆ బ్యాక్‌స్టోరీని చెప్పే విషయం గురించి ఆలోచిస్తే బాగుండేది.

ఇక కర్ణుడిని బేస్ చేసుకోని చెబుతున్న కథలో చాలా సార్లు ఆ పాత్రను కథకు దూరం చేశారు. ఆ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సింది. బాలల చేత డైలాగులు చెప్పించడం పెద్ద సాహసమే. అయితే కొన్ని చోట్ల ఈతరానికి బోరింగ్‌గా కనిపించే సంభాషణలు చెప్పించడం మైనస్ అనే చెప్పాలి. కొన్ని చోట్ల సినిమా మూడ్‌ను పౌరాణికం కాని సినిమా మూడ్‌కు తెచ్చినట్లు కనిపించింది. అది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడి ఉన్న కొన్ని సన్నివేశాల్లో తేలిపోయి కనిపించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శకుడు జె.వి.ఆర్. ఒక సాహసోపేతమైన ప్రయత్నాన్ని మన ముందుకు తెచ్చారనే చెప్పుకోవాలి. మహా భారత కథను ఇంతకుముందే హిట్ అయిన కథన శైలితోనే తెరకెక్కించడంతో కథ, కథనాల్లో ఆయన మార్క్ తెలుసుకునే అవకాశం లేదు. ఇక దర్శకుడిగా ముందు ఇలాంటి ప్రయత్నం చేసినందుకే ఆయన్ను అభినందించాలి. ఆ ప్రయత్నాన్ని సాధ్యమైనంత మేర తెరపై ఆవిష్కరించేందుకు బాగానే కృషి చేశారు. చాలాచోట్ల కథనం మందగించడం, కొన్ని చోట్ల క్లారిటీ పోగొట్టడం లాంటివి పక్కనబెడితే దర్శకుడిగా జె.వి.ఆర్. బాగానే ఆకట్టుకున్నారు.

ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కడక్కడా పౌరాణికం మూడ్ పోయినట్లు కనిపిస్తుంది. బాలలను సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. సంగీతం ఫర్వాలేదనేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో పౌరాణిక సినిమాల ఫార్మాట్‌ను ఫాలో అయిపోయారు. ఎడిటింగ్ బాగుంది. పెద్ద కథల్లో, టక్కున మారిపోతుండే ఎపిసోడ్స్‌ను సినిమాగా ఇబ్బంది కలిగించేలా చేయకుండా ఉండడంలో ఎడిటర్ పనితనం చూడొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముందుగా ఇలాంటి ప్రయత్నానికి నిర్మాతలను అభినందించాలి.

తీర్పు :

మహా భారత ప్రధాన కథ ప్రేరణగా ఈ కాలంలో సినిమా తీయడమంటే ఒక సాహసమే! అలాంటిది అంతా బాల నటులతోనే చేయడమంటే ఇంకా పెద్ద సాహసం. అలాంటి ఒక సాహసోపేత ప్రయత్నమే ‘దాన వీర శూర కర్ణ’. ఆ ప్రయత్నాన్నే ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. కథ, కథా తీరు ముందే తెలిసినవే అయినా ఆసక్తి కలిగించే కథ కావడం, తమ స్థాయిలో మంచి నటన కనబరిచిన బాల నట వర్గం ఈ సినిమాను నిలబెట్టే అంశాలు. ఇక అక్కడక్కడా మందగించిన సినిమా, కొన్ని చోట్ల బ్యాక్‌స్టోరీ లేకుండా కథ నడపడం ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక సాహసోపేతమైన ప్రయత్నం ఎప్పుడు జరిగినా ముందుగా ఆ ప్రయత్నాన్ని అభినందించాలి. అయితే ఒక ప్రయత్నం సినిమాగా ఆకట్టుకునేలా నిలబడగలిగితేనే అలాంటి ప్రయత్నాలు చాలా వస్తాయి. ‘దాన వీర శూర కర్ణ’.. ఒక పరిధిలో శక్తిమేర చేసిన ఓ మంచి ప్రయత్నం!

123తెలుగు.కామ్ రేటింగ్ : పూర్తిగా బాల నటులతో మహా భారతం లాంటి ఒక పౌరాణిక కథ చెప్పాలన్న ప్రయత్నమే ఈ ‘దాన వీర శూర కర్ణ’. ఇక బాల నటులతో చేసిన ఇలాంటి ఒక ప్రయత్నానికి రేటింగ్ ఇవ్వడం భావ్యంగా ఉండదన్న నేపథ్యంలో ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వట్లేదు.

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు