సమీక్ష : దండుపాళ్యం 3 – వయోలెన్స్ ఎక్కువగా ఉంది

సమీక్ష : దండుపాళ్యం 3 – వయోలెన్స్ ఎక్కువగా ఉంది

Published on Mar 16, 2018 12:58 PM IST
Dandupalyam 3 movie review

విడుదల తేదీ : మార్చి 16, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే తదితరులు

దర్శకత్వం : శ్రీనివాసరాజు

నిర్మాత : శ్రీనివాస్ మీసాల,రజని తాళ్ళూరి

సంగీతం : అర్జున్ జన్య

సినిమాటోగ్రఫర్ : వెంకట్ ప్రసాద్

ఎడిటర్ : రవి చంద్రన్

కన్నడలో ఘన విజయం సాధించిన ‘దండుపాళ్యం’ తెలుగులో కూడా అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ‘దండుపాళ్యం 2′ వచ్చింది, కాని ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఆ సిరీస్ లో మూడవ భాగం ‘దండుపాళ్యం 3’ ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

కథ:
మనుషుల్ని కిరాతకంగా చంపి డబ్బు దోచుకునే గ్యాంగ్ దండుపాళ్యం. మనుషుల్ని చంపాలి, దోచుకోవాలి అనే వాళ్ళ క్రూరమైన ఆలోచన, ప్రవృత్తి అందరిలోనూ భయాన్ని పుట్టిస్తుంటాయి. సుమారు 80 కేసుల్లో ఆ గ్యాంగ్ సభ్యులు ముద్దాయిలుగా ఉంటారు. కానీ వాటికి తగిన బలమైన సాక్ష్యాలు ఉండవు. దాంతో పోలీస్ ఆఫీసర్ (రవి శంకర్) వారిని నిందితులుగా ఎలా రుజువు చేసే సాక్ష్యాల కోసం గాలిస్తుంటారు. అలా ఆటను తన విచారణలో అత్యంత కీలకమైన వేలిముద్రలు, డీఎన్ఏ, హెయిర్ వంటి సాక్ష్యాలను ఎలా సాధిస్తాడు ? చివరికి దండుపాళ్యం గ్యాంగ్ ఏమయింది ? దండుపాళ్యం గ్యాంగ్ పై ఉన్న 80 కేసులు రుజువయ్యాయా లేదా తెలుసుకోవాలంటే ‘దండుపాళ్యం 3’ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమా ప్రేక్షకులకు ఒక బలమైన అనుభూతిని కలిగిస్తుంది. నేరస్తుల ప్రవర్తన, మనస్తత్వం, ఉన్మాదం వంటి అంశాలను దర్శకుడు చాలా బాగా ఆవిష్కరించాడు. పోలీస్ ఆఫీసర్ దండుపాళ్యం గ్యాంగ్ చేసిన నేరాలను నిరూపించేందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ తాలూకు సన్నివేశాలు బాగున్నాయి. పెర్ఫార్మెన్స్ పరంగా ఎవరికీ వంక పెట్టడానికి లేదు. అందరు బాగా నటించారు. మొదటి రెండు పార్ట్స్ లో నటించిన నటీనటులే ఈ సినిమాలో నటించడం జరిగింది.

పోలీసులు దండుపాళ్యం గ్యాంగ్ ను విచారించిన తీరు, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ కూడ బాగుంది. దాని వలన ద్వితీయార్థంపై ఆసక్తి పెరిగింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. దండుపాళ్యం సిరిస్ ను ఈ సినిమాతో దర్శకుడు ఎండ్ చేసాడు. క్లైమాక్స్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. మనం ఉహించని క్లైమాక్స్ తో సినిమా ఎండ్ అవుతుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా కథను నిదానంగా చెప్పడం జరిగింది. ఇంటర్వెల్ సమయానికి కానీ చిత్రం అసలు కథలోకి ప్రవేశించదు. దర్శకుడు చాలా సమయాన్ని అనవసరమైన కొన్ని సన్నివేశాలపై ఖర్చు చేశారనిపిస్తుంది. ఇదే సినిమాకు మైనస్. సినిమాలో క్రూరత్వం ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు కొంత ఇబ్బందిగా ఫీలవుతారు.

ముఖ్యంగా సినిమాలో చూపించే నేరాలు, వాటి తల్లూకు సన్నివేశాలు మహిళ, కుటుంబ ప్రేక్షకులకు సెట్టవ్వవు. సినిమా వేగం పుంజుకుంది అనుకునే సమయానికి అనవసరంగా అడ్డుతగులుతున్నట్టు కొన్ని సన్నివేశాలు అర్థఅంతరంగా వచ్చి టెంపోని చెడగొడతాయి.

సాంకేతిక వర్గం:

నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు రాసుకున్న పాత్రలు, సన్నివేశాలు బాగున్నాయి. ఇంట రియలిస్టిక్ గా సినిమా తీసినందుకు ఆయన్ను అభినందించక తప్పదు. దర్శకుడు రాసుకున్న పాత్రలకు నటులు కూడ పూర్తి స్థాయిలో న్యాయం చేసారు.

అర్జున్ జన్య అందించిన సంగీతం, నేపధ్య సంగీతం ఆకట్టుకున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. నేరస్తులు ఎలా ఉంటారు, వారికి ఎలాంటి దుస్తులు వాడాలి అన్నదానిపై ప్రత్యేక శ్రద్ద వహించారు. ఫస్ట్ హాఫ్ లోని కొన్ని అనవసరమైం సన్నివేశాలని ఎడిటింగ్ ద్వారా తొలగించి ఉండాల్సింది.

తీర్పు :
‘దండుపాళ్యం’ సిరీస్ నుండి వచ్చిన ‘దండుపాళ్యం 3’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోయినా పరువాలేదు అనిపిస్తుంది. సినిమాలో సహజత్వం, తీవ్రత బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సమాజంలో నేరాలు ఎలా జరుగుతున్నాయి. నేరస్తులు ఎలా ఉంటారు, వారినుండి జనాలు ఎలా జాగ్రత్త వహించాలి వంటి విషయాల పట్ల దర్శకుడు ప్రేక్షకులకు పరోక్షంగా సందేశం ఇవ్వడం జరిగింది. కానీ సినిమాలోని నేరాల తాలూకు తీవ్రమైన సన్నివేశాలు మహిళల్ని ఇబ్బందిపడేలా చేయొచ్చు. మొత్తం మీద సహజత్వానికి దగ్గరగా ఉండే క్రైమ్ స్టోరీలను చూడలనుకునేవారు ఈ సినిమాను ఒకసారి వీక్షించవచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు