విడుదల తేదీ : ఏప్రిల్ 15, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : శ్రీ
నిర్మాత : శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని
సంగీతం : యస్. యస్. థమన్
నటీనటులు :వైభవ్, రమ్య నంబీసన్, కోటా శ్రీనివాస్ రావు…
తమిళ సంచలన దర్శకుడు శంకర్ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేసిన శ్రీ దర్శకత్వంలో 2014 లో తమిళ్లో వచ్చిన సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ ‘ఢమాల్ ఢుమీల్’. అదే సినిమా ఇప్పుడు ‘ధనాధన్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు గత శుక్రవారం వచ్చింది. మరి ఈ కామెడీ థ్రిల్లర్ ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..
కథ :
‘ధనాధన్’.. ఒకే ఒక్క రోజులో జరిగే కథగా చెప్పుకోవచ్చు. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన మణికందన్ (వైభవ్), మీరా(రమ్య నంబీసన్) అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అతడి ప్రేమ సజావుగా సాగుతుండగానే, కొన్నికారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలోనే కొన్ని అనుకోని పరిస్థితుల్లో 5 కోట్ల రూపాయల డబ్బు అతడి చేతికి వస్తుంది.
అంత డబ్బును ఒకేసారి చూసిన మణికందన్, ఆ డబ్బుని ఎలాగైనా స్వంతం చేసుకోవాలనుకుని, ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు ఏంటీ? వీటి నుంచి మణికందన్ ఎలా బయటపడ్డాడూ? అన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ప్రధాన కథ గురించి చెప్పుకోవచ్చు. మంచి ట్విస్ట్‌లు ఉన్న ఈ కథ, ఒక సినిమాకు సరిపడేంత ఆసక్తికరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. వైభవ్ నటనను ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా వైభవ్ మంచి నటన ప్రదర్శించాడు. రమ్య నంబీసన్ కూడా బాగానే నటించింది. అలాగే ప్రతి సన్నివేశంలో హాస్యం కోసం ప్రయత్నించడం బాగుంది. ప్రధమార్థం నిడివి తక్కువ కావడం కూడా ఈ సినిమాకి ఉపయోగపడింది. సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన కోట శ్రీనివాసరావు, సాయాజీ షిండే తమ పాత్రలకు న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఈ కథని ఎక్జిక్యూట్ చేసిన విధానం గురించి చెప్పాలి. కథ మంచి ట్విస్ట్ లతో ఆసక్తికరంగా ఉన్నా, దాన్ని పూర్తి స్థాయి సినిమాగా ఆకట్టుకునేలా కథనం రూపొందించలేకపోవడం ఏమాత్రం ఆకట్టుకోదు. కథనంలో ఎక్కడా ప్రేక్షకులని థ్రిల్ చేసే అంశం గానీ, సన్నివేశాలను ప్రేక్షకుల మనస్సులో ముద్రవేసినట్లు బలంగా చెప్పడం గానీ జరగలేదు. సంఘటనలన్నీ చాలా కృతకంగా జరుగుతున్నట్లు ఉంటాయి.
అలాగే హీరో పాత్రను మలచిన విధానం కూడా బాగోలేదు. ఒక్కోసారి అమాయకుడిగా, ఇంకోసారి తెలివైన వాడిగా, మరోసారి మోసగాడిగా… ఇలా హీరో పాత్ర ప్రవర్తిస్తుంటుంది. ఇక ఎప్పుడో తమిళంలో రిలీజైన ఈ సినిమాను ఇప్పటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా, తెలుగు వర్షన్ విషయంలోనూ పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవడం మరో మైనస్‌గా చెప్పుకోవచ్చు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో కొన్ని డిపార్ట్ మెంట్స్ వర్క్ బాగుంది. ఎ.ఎం.ఎడ్విన్ సాకే అందించిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. యస్. యస్. థమన్ అందించిన సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. పరమేశ్ కృష్ణ ఎడిటింగ్ ఫరవాలేదు. ద్వితీయార్థంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. కళా దర్శకుడి పనితనం బావుంది.
ఇక ఈ సినిమాకి కెప్టెన్ అయిన శ్రీ గురించి చెప్పుకుంటే… ఆయన ’ధనా ధన్’ సినిమా కోసం ఎంచుకున్న కథ ఫర్వాలేదనేలానే ఉన్నా, పూర్తి స్థాయి సినిమాగా అది ఆకట్టుకునేలా లేదు. ఇకపోతే దర్శకుడిగా నటుల నుంచి మంచి నటన రాబట్టుకోగలిగినా, సినిమాని మాత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా మలచలేకపోయాడు.
తీర్పు :
’ధనా ధన్’ అంటూ ఓ సరికొత్త కథతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆ ఒక్క పాయింట్‌నే ప్లస్ పాయింట్‌గా నింపుకొని, పూర్తి స్థాయి సినిమాగా ఆకట్టుకోవడంలో ఫెయిలైందనే చెప్పాలి. వైభవ్ నటన, అక్కడక్కడా ఫర్వాలేదనిపించే కామెడీ లాంటి అంశాలున్నా, తమిళంలో రిలీజైన రెండేళ్ళకు ఇక్కడకు వచ్చి చేసేది, చేయగలిగిందీ ఏమీ లేదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team