విడుదల తేదీ : 31 జూలై 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : సాయి అచ్యుత్
నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ
సంగీతం : భోలే శావలి
నటీనటులు : ధనరాజ్, మనోజ్, శ్రీ ముఖి ..
‘జబర్దస్త్’ టీవీ షోతో బాగా ఫేమస్ అయిన ధనరాజ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ చిన్న సినిమాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తో కలిసి నటించిన సినిమా ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధనరాజ్ తో పాటు మనోజ్‌నందం, రణధీర్, అనిల్ కళ్యాణ్, విజయ్ సాయి, శ్రీ ముఖి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సాయి అచ్యుత్ దర్శకత్వం వహించాడు. ధనం అంటే ఆశపడని వారు ఎవరూ ఉండరు, అలాంటి ధనం ని మెయిన్ పాయింట్ గా చేసుకొని తీసిన ఈ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మరియు కిడ్నాపర్స్ అయిన రణధీర్(రణధీర్), శ్రీముఖి కలిసి ఎంపి వసుంధర(సింధు తులాని) మేనల్లుడైన చిన్న పిల్లాడిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తారు. వసుంధర దానికి ఒప్పుకొని కోటి ఇవ్వడానికి సిద్దమవుతుంది. డీల్ ప్రకారం రణధీర్ బాబుని ఇచ్చేసి కోటి తీసుకోవడానికి వెళుతుండగా యాక్సిడెంట్ అవుతుంది. అక్కడి నుంచి కట్ చేస్తే తనీష్(తనీష్) బర్త్ డే పార్టీ కోసం చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కోడి(ధనరాజ్), పండు(మనోజ్ నందం), చిట్టి(అనిల్ కళ్యాణ్), విజయ్ సాయి(సత్తి) కలిసి వెళ్తుంటారు. వారికి అడవి మార్గంలో ఓ బాబు కనిపిస్తాడు. అతను ఎవరి బాబు అని వెతుకుతుండగా ఆ ప్లేస్ కి వచ్చిన వసుంధర వారికి కోటి ఇచ్చి బాబుని తీసుకెళ్ళిపోతుంది.
ఆమె డబ్బు ఎందుకు ఇచ్చిందో వారికి తెలియకపోయినా డబ్బు వచ్చింది కదా అని ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా అక్కడి నుంచి బయలు దేరుతారు. కానీ ఆ డబ్బు వచ్చిన కొద్దిసేపటికే వారి జీవితాలు మారిపోతాయి. అలాగే ఫ్రెండ్స్ అందరూ విడిపోతారు.? అంతే కాకుండా చిట్టి, కోడిలు అడవిలోని ఆదివాసుల చేతిలో చిక్కుకుంటారు.? వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా రణధీర్ మళ్ళీ కథలోకి ఎంటర్ అవుతాడు.? అక్కడి నుంచి ఈ నలుగురు ఫ్రెండ్స్ కి కలిగిన ఇబ్బందులేమిటి.? ఫైనల్ గా ఈ కిడ్నాపర్ నుంచి ఎలా తప్పించుకున్నారు.? ఆ కోటి తెచ్చిపెట్టిన సమస్యలు ఏమిటి.? చివరికి ఆ కోటి రూపాయలు ఎవరి చేతికి చిక్కింది.? అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
‘ధనలక్షి తలుపు తడితే’ సినిమా ఓ కామెడీ థ్రిల్లర్.. మొదటగా నేను థ్రిల్స్ గురించి చెబుతా.. మొదటి 5 నిమిషాల్లోనే ఈ సినిమాలో మీరు ఇన్వాల్వ్ అయిపోయేలా చేయడం ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్. అలాగే మొదటి 40 నిమిషాలు ఆద్యంతం మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఈ టైంలో వచ్చే ప్రతి సీన్, ప్రతి థ్రిల్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయి. డబ్బు అనేది ఎంత గొప్ప ఫ్రెండ్స్ ని అయినా విడగొడుతుంది అనే విషయాన్ని చాలా బాగా చూపించాడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ధనరాజ్ ఇందులో అటు కామెడీ – ఇటు ఎమోషన్స్ ఉండే పాత్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ లో ‘జగడం’ సినిమాని గుర్తు చేసాడు. ఫ్రెండ్షిప్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్ బాగా చేసాడు. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కి స్పూఫ్ గా షూట్ చేసిన ఎపిసోడ్ లో ధనరాజ్ తన పర్సనాలిటీపై తానే వేసుకునే కొన్ని సెటైర్స్ నవ్విస్తాయి. రణధీర్ నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు. శ్రీ ముఖి ఓ లేడీ థీఫ్ గా బాగా చేసింది. మనోజ్ నందం, అనిల్ కళ్యాణ్, విజయ్ సాయిలు తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు. చివర్లో పోలీస్ ఆఫీసర్ గా వచ్చే నాగబాబు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ బాగా నవ్వించాడు. సింధు తులాని చిన్న పాత్రలో బాగానే చేసింది. ఇక అతిధి పాత్రలో కనిపించిన తనీష్ మొదట్లో పాటతో, చివర్లో రెండు కామెడీ సీన్స్ తో ఆకట్టుకున్నాడు.
ఇక సినిమా పరంగా చూసుకుంటే.. పైన చెప్పినట్టు మొదటి 40 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత చివర్లో వచ్చే 20 నిమిషాలు ఆడియన్స్ ని నవ్వించడమే కాకుండా, అక్కడ ఇచ్చే ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయి. టీవీ రిపోర్టర్ గంట పాత్రలో తాగుబోతు రమేష్ ఒక మూడు సీన్స్ లో బాగానే నవ్వించాడు. అన్నిటికంటే మించి ఈ సినిమా రన్ టైం కేవలం 114 నిమిషాలే కావడం సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్.
మైనస్ పాయింట్స్ :
డైరెక్టర్ కొత్తవాడు కావడం వలన అనుకున్న పాయింట్ ని ఆధ్యంతం ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే మొదటి 40 నిమిషాలు, చివరి 20 నిమిషాలు చాలా ఆసక్తిగా ఉన్నా మధ్యలో వచ్చే 50 నిమిషాలు ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలో సినిమా కాస్త బోర్ కొడుతుంది, అలాగే సినిమాని సాగదీస్తున్నారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సినిమా టైటిల్ కార్డ్ లోనే అడవి జాతి ఆది వాసుల గురించి సీరియస్ గా చూపిస్తాడు, కానీ దాని సినిమాలో లైట్ గా తీసుకొని ఓ కామెడీ ఎపిసోడ్ గా మార్చాలని ట్రై చేసాడు. అది కూడా ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ మూవీలో ఓ ఎపిసోడ్ కి స్పూఫ్ లా చేసారు. కానీ వారు అనుకున్న రేంజ్ లో ఈ ఎపిసోడ్ వర్కౌట్ అవ్వకపోగా, సినిమాని ఇంకాస్త సాగదీసిన ఫీలింగ్ వస్తుంది.
అలాగే ఈ ఆది వాసుల ఎపిసోడ్ లో చాలా లాజిక్స్ వదిలేసాడు. రణధీర్ పాత్రని మొదట్లో చాలా పవర్ఫుల్ గా చూపిస్తాడు కానీ చివరికి వచ్చే సరికి ఆ పాత్రని చాలా సిల్లీగా చేసేసాడు. ఇక ఇదొక కామెడీ థ్రిల్లర్ ని చెప్పారు, అదే కాక నటీనటుల్ని చూసి సినిమాలో సూపర్బ్ కామెడీ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ సినిమాలో ఆ రేంజ్ కామెడీ లేకపోవడం సినిమాకి మైనస్. సినిమాలో కామెడీ కంటే థ్రిల్స్ ఎక్కువ ఉన్నాయి. కనీసం చివర్లో ఉన్న కామెడీ రేంజ్ లో అయినా మధ్యలో కామెడీ ఉంటే బాగుండేది. సాయి అచ్యుత్ స్క్రీన్ ప్లే పరంగా, నేరేషన్ పరంగా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది.
సాంకేతిక విభాగం విభాగం :
ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే.. శివకుమార్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కొన్ని కొన్ని లాంగ్ షాట్స్ సరిగా అనిపించకపోయినా మిగతా అంతా బాగానే ఉంది. బోలే శావలి మ్యూజిక్ గురించి ఎలా చెప్పాలి.. సినిమా మొదలైనప్పటి నుంచీ ఒక 30-40 నిమిషాల వరకూ నేపధ్య సంగీతం బాగుంది. మధ్య మధ్యలో శ్లోకాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత నుంచి అదే మ్యూజిక్ ని బ్యాక్ గ్రౌండ్ లో రిపీట్ చేసారు అనే ఫీలింగ్ వస్తుంది. అన్ని సందర్భాలకి ఒకేరకమైన మ్యూజిక్ వినిపించడం కాస్త బోరింగ్. ఇక తను కంపోజ్ చేసిన రెండు పాటలు బాగున్నాయి. శివ వై ప్రసాద్ ఎడిటింగ్ జస్ట్ ఓకే.. మొదట్లో చివర్లో అంత బాగా ఎడిట్ చేసిన శివ మధ్యలో ఎందుకు అంత సాగదీసాడు అనేది ఆయనకే తెలియాలి. మధ్యలో ఇంకాస్త కట్ చేసి ఉంటే బాగుండేది.
మొదటి సినిమా అయినా సాయి అచ్యుత్ సినిమాకి మేజర్ డిపార్ట్ మెంట్స్ అయిన కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వ విభాగాలను డీల్ చేసాడు. కథ – కథ పరంగా కొత్తది ఏమీ కాదు, ఇలాంటి దగ్గరి కథలను మనం చూసే ఉంటాం. కానీ కథకి ఎంచుకున్న నేపధ్యాన్ని ఆసక్తికరంగా తీసుకున్నాడు. స్క్రీన్ ప్లే – కథ సింపుల్ కావడం వలన ఈ విషయంపై కేర్ తీసుకున్నాడు. కానీ సినిమా మొత్తం టైట్ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. ఎందుకంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ని అంత ఆసక్తికరంగా రాసుకొని మధ్యలో గాలికి వదిలేసాడు. మాటలు – డైలాగ్స్ జస్ట్ ఓకే, ఇంకాస్త టైం తీసుకొని ఉంటే ఇంకా బెటర్ డైలాగ్స్ పడేవి, అలాంటి డైలాగ్స్ ఈ సినిమాకి అవసరం కూడాను. దర్శకత్వం – సాయి అచ్యుత్ దర్శకుడిగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ ని టచ్ చేయగలిగాడు కానీ ది బెస్ట్ అని అనిపించుకోలేకపోయాడు. తను సెలక్ట్ చేసుకునే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేపై ఇంకాస్త కేర్ తీసుకోగలిగితే కెరీర్ బాగుంటుంది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ – ధనరాజ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఇప్పుడిప్పుడే తెలుగులో తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటీనటులు ధనరాజ్, మనోజ్ నందం, రణధీర్, అనిల్ కళ్యాణ్, విజయ్‌సాయి, శ్రీ ముఖి కలిసి చేసిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ సినిమా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులని అక్కడక్కడా నవ్విస్తూ థ్రిల్ చేస్తుంది. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో థ్రిల్స్ మాత్రం ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటాయి. అలాగే చివర్లో తాగుబోతు రమేష్, నాగబాబులు ఆడియన్స్ ని నవ్విస్తూనే సస్పెన్స్ లను రివీల్ చెయ్యడం ఆకట్టుకుంటుంది. యువ నటీనటుల పెర్ఫార్మన్స్, మొదటి 40 నిముషాలు, అలాగే చివరి 20 నిమిషాలు సినిమాకి హైలైట్ అయితే, ఇంటర్వెల్ దగ్గర, సెకండాఫ్ మొదట్లో కాస్త సాగదీయడం, ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గడం సినిమాకి మైనస్ పాయింట్స్. మొత్తంగా ఈ వారం థియేటర్ కి వెళ్లి థ్రిల్ ఫీలవుతూనే కాసేపు హ్యాపీగా నవ్వుకొని బయటకి వచ్చే సినిమా ‘ధనలక్ష్మి తలుపు తడితే’.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం