సమీక్ష : దోచేయ్ – సమ్మర్ స్టైలిష్ క్రైమ్ థ్రిల్లర్.!

సమీక్ష : దోచేయ్ – సమ్మర్ స్టైలిష్ క్రైమ్ థ్రిల్లర్.!

Published on Apr 24, 2015 8:00 PM IST
Kai Raja Kai

విడుదల తేదీ : 24 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : సుధీర్ వర్మ

నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్

సంగీతం : సన్నీ ఎం.ఆర్

నటీనటులు : నాగ చైతన్య, కృతి సనన్…


అక్కినేని ఫ్యామిలీ నుంచి పరిచయమై తండ్రిలానే తానూ రొమాంటిక్ హీరో అనిపించుకున్న యంగ్ హీరో నాగ చైతన్య నటించిన లేటెస్ట్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘దోచేయ్’. రొటీన్ కి భిన్నంగా నాగ చైతన్య నటించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. రొమాంటిక్ యాంగిల్ ని కాస్త పక్కన పెట్టి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో నాగ చైతన్య చేసిన ఈ సినిమా ఎలా ఉంది.? అలాగే డైరెక్టర్ సుధీర్ వర్మ ద్వితీయ యజ్ఞాన్ని విజయవంతంగా ఫినిష్ చేసాడా.?లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

దోచేయ్ కథ, అందులో రాసుకున్న హీరో పాత్ర, అతని ఫ్రెండ్స్ బ్యాచ్ స్వామి రారా సినిమాకి సీక్వెల్ గా అనిపిస్తాయి. ఇక అసలు కథలోకి వెళితే.. చందు(నాగ చైతన్య) తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి ఒక మోస్తరు దొంగతనాలు చేస్తూ హ్యాపీగా లైఫ్ ని గడుపుతుంటాడు. చందు తన చెల్లెల్ని డాక్టర్ చదివిస్తుంటే, చందు తండ్రి సీతారాం(రావు రమేష్) మాత్రం ఓ మర్డర్ కేసు వలన జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. ఇలా సాగిపోతున్న లైఫ్ లో చందు ఓ రోజు మీరా(కృతి సనన్) ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి వీరిద్దరూ ప్రేమికులవుతారు. అలా సాగిపోతున్న టైంలో చందుకి 2 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కాసేపు ఈ ట్రాక్ ని పక్కన పెడితే…

పిక్ పాకెటర్ నుంచి బ్యాంకు దొంగతనాలు చేసే రేంజ్ కి ఎదిగిన రౌడీ మాణిక్యం(పోసాని కృష్ణ మురళి). ఇలా మాణిక్యం తన గ్యాంగ్ తో ప్లాన్ చేసి ఓ బ్యాంకులో 2.5 కోట్లు దొంగతనం చేస్తారు. మాణిక్యంకి హ్యాండ్ ఇచ్చి ఆ డబ్బు తో పారిపోవాలని గొడవ పడడంలో ఇద్దరూ ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు. అదే టైంలో అక్కడున్న చందు ఆ డబ్బు మాణిక్యంకి చెందింది అని తెలియకుండా దొరికింది కదా అనే దోచేస్తాడు. కొద్ది రోజులకి మాణిక్యంకి చందునే డబ్బుకాజేసాడని తెలియడంతో చందుకి కావలసిన వాళ్ళని కిడ్నాప్ చేసి తన డబ్బు తనకి ఇమ్మంటాడు. మాణిక్యం నుంచి తన వాళ్ళని రక్షించుకోవడానికి చందు ఏం చేసాడు.? చందు నుంచి మనీ రాబట్టుకోవడం కోసం మాణిక్యం అసలు ఎవర్ని కిడ్నాప్ చేసాడు.? మాణిక్యం నుంచి తప్పించు కోవడానికి చందు పోలీస్ ఆఫీసర్ రిచర్డ్(రవిబాబు) మరియు టెంప్ట్ఇంగ్ స్టార్ బుల్లెట్ బాబు(బ్రహ్మనందం)ని ఎలా వాడు కున్నాడు. ఫైనల్ గా మాణిక్యంకి చందు డబ్బు ఇచ్చాడా.? లేదా.? అసలు చందు ఫాదర్ సీతారాం జైల్లో ఉండడానికి కారణమైన మర్డర్ వెనుక కథ ఏంటి.? అన్నది తెలియాలంటే ఈ వారం మీరు ఈ సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘దోచేయ్’ సినిమా మొత్తం చూసాక ‘స్వామి రారా’కి సీక్వెల్ లానే ఉంది అనిపిస్తుంది. అలా అనిపించిందంటే ఆ సినిమాలనే ఈ సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుందని అర్థం. దోచేయ్ కి మేజర్ హైలైట్ చివరి 30 నిమిషాలు. సెకండాఫ్ లో టెంప్టింగ్ స్టార్ బుల్లెట్ బాబుగా బ్రహ్మానందం పరిచయం అయినప్పటి నుంచీ సినిమా వేగంగా తయారవుతుంది. అంతే కాకుండా అక్కడి నుంచి చివరి దాకా ఆడియన్స్ ని బాగా నవ్విస్తూ ఉంటుంది. బ్రహ్మానందం కామెడీకి నాంది అయితే చివర్లో రెండు సీన్స్ లో వచ్చే తాగుబోతు రమేష్, సప్తగిరిలు తారాస్థాయికి తీసుకెళ్ళారు.

నాగ చైతన్య గత సినిమాలకంటే డిఫరెంట్ లుక్ లో ఇందులో కనిపించాడు. ముఖ్యంగా ఓ దొంగ పాత్రలో ఉండాల్సిన కాన్ఫిడెంట్ ఎక్స్ ప్రెషన్స్ ని బాగా పలికించాడు. ఇక తన మార్క్ రొమాంటిక్ సీన్స్ లో బాగా ఆకట్టుకున్నాడు. కృతి సనన్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. అలాగే తనని చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో సూపర్బ్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అలాగే నాగ చైతన్య – కృతి సనన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. మాణిక్యం పాత్రలో అటు సీరియస్, ఇటు కామెడీ ఉండే మాణిక్యం పాత్రలో పోసాని కృష్ణ మురళి బాగా చేసాడు. ముఖ్యంగా పోసాని పక్కన ఉండే లంబు – జంబు(వైవ హర్ష)లు బాగా నవ్వించారు. నాగ చైతన్య సిస్టర్ గా కనిపించిన అమ్మాయి, రావు రమేష్, రవి బాబు, చలపతి రావు తదితరులు తమ పాత్రలకి న్యాయం చేసారు.

ఇకపోతే చెప్పుకోవాల్సింది సినిమా ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్భాటాలు లేకపోయినా చాలా జాయబుల్ గా సినిమా సాగిపోతుంది. ముఖ్యంగా నాగ చైతన్య చేసే మోసాలు మరియు చైతన్య – కృతి సనన్ రొమాంటిక్ ట్రాక్ బాగుంటుంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లకి ఎంటర్టైన్మెంట్ జత చేయడం సినిమాకి హెల్ప్ అయ్యింది. నాగ చైతన్య పై కంపోజ్ చేసిన ఓ చేజ్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో వచ్చే మధురిమ ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

మొదటి సినిమాలో కథని చాలా స్ట్రాంగ్ గా రాసుకున్న సుధీర్ వర్మ ఈ సినిమా విషయంలో కథని అంత స్ట్రాంగ్ గా రాసుకోలేదు. మంచి మంచి సీన్స్ ఉన్నా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కథ మాత్రం పెద్దగా ఇంప్రెస్ చెయ్యదు. సుధీర్ వర్మ కథలో ఇంకాస్త స్ట్రాంగ్ పాయింట్ ఏదన్నా చెప్పదలుచుకొని ఉంటే సినిమా ఇంకోలా ఉండేది. ఇక కథనం కూడా సెకండాఫ్ లో కాస్త స్లో అయ్యి ప్రీ క్లైమాక్స్ దగ్గర వేగంవంతం అవుతుంది. దాంతో సెకండాఫ్ లో బ్రహ్మానందం వచ్చే వరకూ బోరింగ్ గా ఉంటుంది. కథనం విషయంలో మరియు లాజికల్ గా సుదీర్ వర్మ మొదటి సినిమాలో తీసుకున్నంత కేర్ కనపడలేదు. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయితే, కొన్ని చోట్ల పాత్రలకి సరైన ముగింపు లేదు.

హీరోని ఎలివేట్ చెయ్యాలి అన్నప్పుడు విలన్ పాత్ర స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో చూపించిన పోసాని కృష్ణ మురళి, రవిబాబు పాత్రలు ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండి ఉంటే ఆడియన్స్ లో ఇంకాస్త ఆసక్తి, సస్పెన్స్ క్రియేట్ అయ్యి ఉండేది. అలాగే సినిమాకి పాటలు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. చెప్పాలంటే పాటలను షూట్ చేసిన విధానం సూపర్బ్ కానీ అవి వచ్చిన ఒక్క సందర్భం కూడా సరిగా సెట్ అవ్వలేదు. ఈ సినిమా రన్ టైం తక్కువనే కానీ ఓవరాల్ గా సాగదీసిన కొన్ని సీన్స్ మరియు సాంగ్స్ ని కలిపి ఒక 15 నిమిషాలు కట్ చేస్తే సినిమా ఇంకా స్పీడ్ అవుతుంది. సినిమా చాలా క్లాస్ గా ఉండడం వలన మాస్ ఆడియన్స్ రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ ని ఇందులో మిస్ అవుతారు.

సాంకేతిక విభాగం :

రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమాలో విజువల్స్ చాలా రిచ్ లుక్ ని ఇవ్వడమే కాకుండా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. అలాగే నటీనటుల్ని చూపిన విధానం కూడా బాగుంది. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ జస్ట్ ఓకే. తనకున్న మైనస్ ట్యూన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకేలా ఉండడం. తన అన్ని సినిమాలలో ట్యూనింగ్ పరంగా ఒకేలా సౌండింగ్ ఉంటుంది. ఇందులోనూ అదే వినిపించింది. దానివల్ల ఆడియన్స్ మ్యూజిక్ పరంగా కొత్తగా ఫీల్ అవ్వరు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీ గా ఉండాల్సింది. చాలా చోట్ల సీన్స్ ని బాగా సాగాదీసేసారు. అది కాస్త తగ్గించడం, సెకండాఫ్ స్టార్టింగ్ లో బోరింగ్ సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. నారాయణరెడ్డి ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగుంది. పాటల కోసం వేసిన సెట్స్ బాలీవుడ్ స్థాయిని తలపిస్తాయి.

ఇక ద్వితీయ యజ్ఞంగా దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాలో కూడా 3 డిపార్ట్ మెంట్స్ (కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం)ని డీల్ చేసాడు. కథ – చాలా సింపుల్ అండ్ రొటీన్. స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ మరియు క్లైమాక్స్ లో బాగుంది. కానీ మధ్యలో బోరింగ్ కొట్టేలా చేసాడు. దర్శకత్వం – ఈ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది అతని టేకింగ్ మాత్రమే. ముఖ్యంగా ఆకట్టుకునేలా రాసుకున్న కొన్ని సీన్స్, సందర్భానుసారంగా వచ్చే కామెడీ, బ్రహ్మానందం ఎపిసోడ్, క్లైమాక్స్ ట్విస్ట్ లలో తన టాలెంట్ చూపించాడు. కథ లైట్ గా, స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోయినా ఈ విషయాలే సినిమాకి హెల్ప్ అయ్యాయి. సుధీర్ వర్మలో విషయం ఉంది, ఈ సారి నుంచి మంచి కాన్సెప్ట్ తీసుకుంటే ఇంకా బెటర్ మూవీ ఇస్తాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘దోచేయ్’..నాగ చైతన్య అటెంప్ట్ చేసిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చాలా స్టైలిష్ అండ్ క్లాస్ గా ఉంది. క్రైమ్ కి కామెడీని మిక్స్ చేసి చేసిన ఈ సినిమా మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. సుధీర్ వర్మ తనకు నచ్చిన ఫార్మాట్ లోనే ద్వితీయ విజ్ఞాన్ని సక్సెస్ ఫుల్ గా తీసి విజయాన్ని అందుకున్నాడు. కథలో పెద్ద దమ్ములేకపోయినా టేకింగ్ తో ఆడియన్స్ ని మెప్పించాడు. సినిమా మొదలవ్వగానే మీ ఫేస్ మీద ఒక స్మైల్ ని జెనరేట్ చేసి అదే స్మైల్ ని కంటిన్యూగా మీ ఫేస్ మీద ఉంచేలా సాగిపోయే ఫస్ట్ హాఫ్, బ్రహ్మానందం ఎపిసోడ్, క్లైమాక్స్ ట్విస్ట్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయితే స్ట్రాంగ్ గా లేని కథ, కథనం, పాత్రలు చాలా లైట్ గా ఉండడం మేజర్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ ఈ ‘దోచేయ్’ సినిమా ఈ వారం మీకు క్లాస్ ఎంటర్టైన్మెంట్ ని అందించి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ దోచుకుంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు