సమీక్ష : డైనమైట్ – థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్.!

సమీక్ష : డైనమైట్ – థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్.!

Published on Sep 5, 2015 6:00 PM IST
Dynamite-review

విడుదల తేదీ : 04 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : దేవ కట్టా

నిర్మాత : మంచు విష్ణు

సంగీతం : అచ్చు

నటీనటులు : మంచు విష్ణు, ప్రణిత సుభాష్, జెడి చక్రవర్తి..


సరికొత్త కథ, ఆ కథలో మునుపెన్నడూ చేయని పాత్ర, ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే లుక్ ఈ మూడింటిని పక్కాగా ప్రతి ఒక్క సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకునే యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. హై రేంజ్ ఇంటెన్స్ అండ్ ఎమోషన్స్ ఉన్న సినిమాలు చేసిన దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రణిత హీరోయిన్. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ డైనమైట్ ఆన్ స్క్రీన్ అండ్ బాక్స్ ఆఫీసు వద్ద ఏ రేంజ్ లో పెలిందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

శివాజీ అలియాస్ శివ్ (మంచు విష్ణు) సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఫ్రెండ్స్ తో హ్యాపీగా జీవనం సాగిస్తుంటాడు. ఒకరోజు శివాజీ తన ఫ్రెండ్స్ అంతా కలిసి నైట్ టైం బయటకి వెళ్తారు, అక్కడ కాలేజ్ స్టూడెంట్ అయిన అనామిక(ప్రణిత)తో పరిచయం అవుతుంది. పరిచయం కాస్తా ఫస్ట్ డేట్ కి దారి తీస్తుంది, ఆ డేట్ కొసమెరుపుగా ఇద్దరూ అనామిక ఫ్లాట్ కి వెళ్తారు. కట్ చేస్తే సడన్ గా కొంతమంది వచ్చి అనామికని కిడ్నాప్ చేస్తారు. శివాజీ కాపాడటానికి ట్రై చేసినా కుదరకపోవడంతో, ఏం చేయాలో తెలియని శివాజీ పోలీసులను ఆశ్రయిస్తాడు. పోలీసులతో పాటు అనామిక కోసం వెతుకుతున్న టైములో అనామికని కిడ్నాప్ చేసిన వారే అనామిక ఫాదర్, ఛానల్ 24 ఓనర్ రంఘనాథ్(పరుచూరి వెంకటేశ్వరరావు)ని కూడా చంపేస్తారు.

అదే టైంలో శివాజీకి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిస్తాయి. ఆ విషయాల ద్వారా శివాజీ అనామికని ఎక్కడుందో కనుక్కొని సేవ్ చేస్తాడు. అప్పుడే కథలోకి సెంట్రల్ మినిస్టర్ రిషి దేవ్(జెడి చక్రవర్తి) ఎంటర్ అవుతాడు. రిషి దేవ్ ఏమో శివాజీ, అనామికని చంపాలని ట్రై చేస్తున్నాడు. అసలు అనామిక, శివాజీలను రిషి దేవ్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు.? అసలు రిషి దేవ్ కి కావాల్సింది అనామిక దగ్గర ఏముంది.? అసలు రిషి దేవ్ తమని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు అనే విషయాన్ని శివాజీ, అనామికలు తెలుసుకున్నారా లేదా.? తెలుసుకుంటే దాని నుంచి ఎలా బయటపడ్డారు అన్నది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

‘డైనమైట్’ సినిమా టైటిల్ లానే ధనాధన్ ధనాధన్ అంటూ సాగుతూ ఆన్ స్క్రీన్ పై బాగానే పేలింది. ఈ సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడానికి 3 బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అవే దేవకట్టా స్క్రీన్ ప్లే, విజయన్ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఫైనల్ గా మంచు విష్ణు ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్. ముందుగా దేవకట్టా విషయానికి వస్తే.. రీమేక్ సినిమా అయినా తెలుగు వారికి తగ్గట్టుగా ఆయన చిన్న చిన్న మార్పులు చేసి రాసిన స్క్రీన్ ప్లే చాలా వరకూ సినిమాకి హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా మొదటి 20 నిమిషాల తర్వాత నుంచి ఇంటర్వెల్ వరకూ సినిమా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఒరిజినల్ వెర్షన్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువ, కానీ ఇందులో ఎక్కువ ప్లాన్ చేసారు. విజయన్ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు చేజింగ్ సీక్వెన్స్ లని ఎక్కడా బోర్ కొట్టించకుండా డిజైన్ చేసారు.

ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచిన హీరో మంచు విష్ణు విషయానికి వస్తే.. మంచు విష్ణుకి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేయాలంటే భలే ఇష్టం, అలాంటి పాత్ర చేసే అవకాశం ఈ సినిమాలో రావడంతో తన పాత్ర కోసం ఏమేమి చేయాలో అన్నీ చేసాడు. విష్ణు చేసిన రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫైట్స్ పరంగా విష్ణులో ఓ కొత్త మానరిజం కనపడుతుంది. ఇక నటుడిగా మరోసారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మంచి నటనని కనబరిచాడు. ఓవరాల్ గా విష్ణు డైనమైట్ కోసం ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక గ్లామర్ డాల్ అనిపించుకున్న ప్రణిత ఎప్పటిలానే గ్లామర్ డాల్ గా కనపడుతూనే రిస్క్ తీసుకొని తను చేసిన రియలిస్టిక్ స్టంట్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. తనకిచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక మిస్టర్ కూల్ విలన్ గా జెడి చక్రవర్తి మంచి నటనని కనబరిచాడు. చిన్న పాత్రలో కనిపించిన లేఖ వాషింగ్టన్ బాగానే చేసింది. యోగ్ జపీ, నాగినీడు, రాజ రవీంద్ర, కబీర్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఇక సినిమా విషయానికి వస్తే కాస్త స్లోగా స్టార్ట్ అయ్యి మొదటి 20 నిమిషాల తర్వాత సస్పెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఆడియన్స్ లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇంటర్వల్ వరకూ చాలా స్పీడ్ గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కొన్ని బ్లాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంత సీరియస్ సినిమాలో అక్కడక్కడా ప్రభాస్ శ్రీను, హర్ష చేత చేయించిన కామెడీ నవ్విస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి నుంచి ఎలా సాగుతుంది అనే పరంగా చూసుకుంటూ వస్తే.. పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కోసం రాసుకున్న మొదట్లో 20 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వల్ దగ్గర ఆసక్తిని క్రియేట్ చేసారు, కానీ సెకండాఫ్ లో అదే సస్పెన్స్ ని ఆధ్యంతం నడిపించలేకపోయారు. కొన్ని బ్లాక్స్ బాగున్నా కొన్ని మాత్రం చాలా బోర్ కొడతాయి. ప్రీ క్లైమాక్స్ సీన్ ని కాస్త సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి సాగదీత వలన 142 నిమిషాల సినిమానే అయినా దానికన్నా ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

అలాగే సినిమాకి పాటలతో పెద్ద అవసరం లేదు, కానీ మన తెలుగు ఆడియన్స్ కి అది కావాలి కాబట్టి పెట్టారు. కానీ అవి సినిమా ఫ్లోని దెబ్బ తీయడమే కాకుండా సినిమా రన్ టైంని బాగా పెంచేసాయి అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. డైనమైట్ అనేది రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. ఇలాంటి జానర్ మూవీ టాలీవుడ్ కి కొత్త కావున కొంతమందికి పెద్దగా నచ్చక పోవచ్చు. అలాగే రెగ్యులర్ కామెడీ కోరుకునే వారు ఎంజాయ్ చేసేలా ఈ సినిమాలో కామెడీ లేకపోవడం మైనస్.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో చెప్పుకోదగిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇది ఒక చేజింగ్ తరహా మూవీ.. పరిగెత్తాలి మధ్యలో ఫైట్స్ చెయ్యాలి, దూకాలి, గెంతాలి. వాళ్ళు ఎంత చేసినా వాళ్ళతో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా పరిగెత్తి ఆ విజువల్స్ ని పర్ఫెక్ట్ గా కాప్చ్యూర్ చెయ్యాలి ఆ విషయంలో సతీష్ ముత్యాల ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. స్టంట్స్ అప్పుడు తను సెలెక్ట్ చేసుకున్న కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. అచ్చు అందించిన పాటలు జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి, కానీ చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. యాక్షన్ ఎపిసోడ్స్ లోని ఇంటెన్స్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా చేసింది మాత్రం చిన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి ఆర్ట్ వర్క్ సినిమా ఫ్లేవర్ ని ఎక్కడా మిస్ చెయ్యలేదు. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ చాలా తెలివిగా ఎడిట్ చేసాడు. సెకండాఫ్ లో మాత్రం అక్కడక్కడా కట్ చేసి ఉంటే బాగుండేది. బివిఎస్ రవి డైలాగ్స్ బాగున్నాయి.

ఇక యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయన్ డిజైన్ చేసిన స్టంట్స్ సూపర్బ్. ఆనంద్ శంకర్ అందించిన ఒరిజినల్ కథని 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ వారు బాగానే మార్పు చేసారు. ఆ కథకి దేవకట్టా రాసుకున్న న్యూ వెర్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. అదే సినిమాకి హెల్ప్ అయ్యింది. ఇక డైరెక్టర్ గా ప్రతి ఒక్కరి నుంచి పర్ఫెక్ట్ నటనని రాబట్టుకున్నాడు. ఇకపోతే 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు రీస్క్ చేసి ఇలాంటి న్యూ జానర్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. సినిమా పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి.

తీర్పు :

తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించే యాక్షన్ థ్రిల్లర్ జానర్ ని పరిచయం చేస్తూ మంచు విష్ణు హీరోగా చేసిన ‘డైనమైట్’ సినిమా యాక్షన్ సినిమాలు చూసే వారికి బాగా నచ్చుతుంది. ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన సస్పెన్స్ ఎలిమెంట్స్ మరియు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉండడమే ఈ సినిమాకి మేజర్ ప్లస్. మంచు విష్ణు యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన అన్ని విషయాల్లోనూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. సినిమా పరంగా ఆసక్తికరంగా సాగే ఫస్ట్ హాఫ్, కొన్ని థ్రిల్స్, క్లైమాక్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్. సినిమా నిధానంగా మొదలవ్వడం, మధ్యలో వచ్చిన పాటలు, రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, సెకండాఫ్ లో అక్కడక్కడా తగ్గడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. రెగ్యులర్ కామెడీ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి పెద్దగా నచ్చక పోయినా స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు, కొత్త తరహా సినిమా చూడాలనుకునే వారికి నచ్చే సినిమా ‘డైనమైట్’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు