విడుదల తేదీ : జూన్ 2, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : వంశీ
నిర్మాత : మధుర శ్రీధర్
సంగీతం : మణిశర్మ
నటీనటులు : సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మానస హిమ వర్ష, మనాలి రాథోడ్
సీనియర్ దర్శకుడు వంశీ అలనాటి తన క్లాసికల్ హిట్ ‘లేడీస్ టైలర్’ కు సీక్వెల్ గా రూపొందించిన చిత్రమే ‘ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్’. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మానస హిమ వర్ష, మనాలి రాథోడ్ లు జంటగా నటించిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమాతో వంశీ తన పాత మ్యాజిక్ ను రిపీట్ చేశారో లేదో చూద్దాం…
కథ :
గోదావరి జిల్లాల్లోని పాలకొల్లు అనే ఊరిలో ఒకప్పుడు బాగా ఫెమస్ అయిన లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాళం తన తండ్రి వృత్తినే కొనసాగిస్తూ సొంతంగా బట్టల కొట్టు పెట్టి ఎప్పటికైనా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కలలు కంటుంటాడు.
ఇంతలో కోట్ల మందిలో ఒక్కడికి ఉండే మన్మథ రేఖ తన అరచేతిలో ఉందని తెలుసుకున్న గోపాళం దాన్ని ఉపయోగించుకుని తన కలల్ని నెరవేర్చుకోవాలని అదే ఊరిలో ఉండే ముగ్గురమ్మాయిల్ని వలలో వేసుకుంటాడు. అలా ఆ ముగ్గురి జీవితాల్లోకి ప్రవేశించిన గోపాళం ఏం చేశాడు ? వారి వలన అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? చివరికి ఏమైంది ? అనేదే ఈ చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్ :
మన్మథ రేఖ అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని నిర్మాత మధుర శ్రీధర్ అందించిన మూల కథ బాగుంది. హీరో ఆ మన్మథ రేఖను పరీక్షించి పని చేస్తుందని నిర్ణయించుకుని దాన్ని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవడం, చివరికి ఇబ్బందుల్లో పడటం అనే కథానాంశం కూడా బాగుంది. దర్శకుడు వంశీ సినిమా మొత్తాన్ని పాలకొల్లు, పాపికొండలు, గోదావరి తీరాలు వంటి ప్రదేశాల్లో చిత్రీకరించి సినిమా చూస్తున్నంతసేపు అక్కడే తిరుగుతున్న భావన కలిగించారు.
అలాగే వంశీ ట్రేడ్ మార్కుల్లో ఒకటైన కామెడీ పాత్రల ప్రవర్తన, పంచ్ డైలాగులు, స్పెషల్ ఎఫెక్టులు పూర్తిగా కాకాపోయినా అక్కడక్కడా వర్కవుట్ అయ్యాయి. ఇక ఆయన పాటల టేకింగ్, అందులో భిన్నమైన కోణాల్లో కెమెరాను వాడటం, హీరోయిన్లను అందంగా చూపడం వంటివి ఇందులో కూడా చేసి మెప్పించారు. ముఖ్యంగా సినిమా చివరి పాట కాస్త ఓవర్ గా అనిపించినా అందులో వంశీ సృష్టించిన సందర్భాలు చాలా భిన్నంగా ఉండి ఎంటర్టైన్ చేసింది. సీనియర్ నటుడు కృష్ణ భగవాన్ వంశీ శైలికి తగ్గట్టు నటించి తానున్న దాదాపు అన్ని సన్నివేశాల్లో కామెడీని పండించారు.
మైనస్ పాయింట్స్ :
ఇందులో ప్రధాన బలహీనత ఏమిటంటే వంశీగారి పాత స్టైల్ మరోసారి ప్రేక్షకులకు అందే విధంగా ఎగ్జిక్యూట్ కాకాపోవడమే. ఇక్కడ ఒకప్పుడు బాగా సక్సెస్ అయిన ఆయన శైలిని ఎత్తి చూపడంలేదు. అప్పట్లో అంటే మహా మహులైన నటీనటులు ఉండేవారు కాబట్టి వాళ్ళు వంశీగారి భిన్నమైన, విపరీతమైన ఆలోచనలను తమ గొప్ప నటనతో బ్యాలెన్స్ చేస్తూ కంటెంట్ ను, సినిమాలోని సున్నితత్వాన్ని ప్రేక్షకులకి సులభంగా రీచ్ అయ్యేలా చూసేవారు. కానీ ఈ సినిమాలో మాత్రం కృష్ణ భగవాన్ మినహా అందరూ చిన్నవాళ్ళే కావడం, వాళ్ళు వంశీగారి వినూత్న రీతిని అందుకోవడంలో తడబడటం వలన ఆయన శైలి ఈసారి మెప్పించలేకపోయింది.
ఇక కథనం పరంగా చూసినా ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్, హీరో హీరోయిన్ల సన్నివేశాలు కొన్ని, క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన అమ్ములు యొక్క మావయ్య పాత్ర వరుసపెట్టి హత్యలు చేసుకుపోవడం చూపిస్తారు కానీ వాటి వెనకున్న అసలు కారణం చెప్పకపోవడం, ఆ హత్యలకు సినిమాకు అస్సలు సంబంధమే లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
సాంకేతిక విభాగం :
సినిమాలో నగేష్ బానెల్లి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గోదావరి అందాలను వంశీగారి షాట్ మేకింగ్ ను బాగా ప్రెజెంట్ చేశారు. మణిశర్మ సంగీతం కొన్ని పాటల్లో సామాన్యంగానే ఉన్నా కొన్ని పాటల్లో మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ విభాగం కొన్ని అనవసర సన్నివేశాల్ని, ఇంకొన్ని సన్నివేశాల లెంగ్త్ ను తగ్గించి ఉండాల్సింది.
ఇక దర్శకుడు వంశీ ఫస్టాఫ్, సెకండాఫ్లలో పెద్దగా ఆకట్టుకునే కథనాన్ని తయారు చేయకపోవడం, నటీనటులు ఆయన స్టైల్ ను అందుకోకపోవడం వలన ప్రేక్షకులపై సినిమా చూపే ప్రభావం చాలా వరకు తగ్గింది. నిర్మాత మధుర శ్రీధర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
నిర్మాత మధుర శ్రీధర్ తన సినిమాతో వంశీగారి మ్యాజిక్ ను మరోసారి ప్రేక్షకులకి చూపిద్దామనుకుని చేసిన ఈ ప్రయత్నంలో వంశీగారి స్టైల్ పాక్షికంగా మాత్రమే కనబడింది కానీ ప్రభావవంతంగా ఆకట్టుకోలేకపోయింది. మంచి స్టోరీ లైన్, కొన్ని కామెడీ సీన్లు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, క్లైమాక్స్ సీన్, ఒక పాట ఇందులో మెప్పించే అంశాలు కాగా ఆకట్టుకునే కథనం లేకపోవడం, వంశీ స్టైల్ సక్రమంగా రీచ్ కాలేకపోవడం, పేలవమైన కొన్ని సన్నివేశాలు నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే వంశీగారి శైలిని ఇష్టపడే వాళ్లకు మాత్రమే ఈ సినిమా కాస్తో కూస్తో వినోదాన్నందిస్తుంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team