విడుదల తేదీ : ఫిబ్రవరి 12, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి
దర్శకత్వం : విద్యాసాగర్ రాజు
నిర్మాతలు : కె.ఎల్. దామోదర్ ప్రసాద్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ : శివ జి
ఎడిటింగ్ : కిషోర్ మద్దాలి
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’. రామ్ కార్తీక్-అమ్ము అభిరామి యువ జంటగా, మరో కీలక పాత్రలో బేబి సహశ్రిత నటించగా విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
కార్తీక్ (రామ్ కార్తీక్) ఉమ (అమ్ము అభిరామి) మొదటిసారి కలిసినప్పుడే ఒకర్ని ఒకరు ఇష్టపడతారు. ఆ తరువాత కార్తీక్ ఉమను మళ్లీ కలుస్తాడు. ఉమ జీవితంలోకి ఎంట్రీ అవుతాడు. ఉమ కూడా అతన్ని ఇష్ట పడే సమయంలో కార్తీక్ ను అపార్ధం చేసుకుంటుంది. చివరకు మళ్లీ వీళ్ళు ఎలా కలిశారు. ఈ మధ్యలో కార్తీక్ తండ్రి ఫణి (జగపతిబాబు) పాత్ర ఏమిటి ? ఆయనలోని ప్లే బాయ్ వల్ల కార్తీక్ ఎన్ని సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది ? ఇంతకీ చిట్టి అనే పాప వల్ల ఈ కథ ఎలా మలుపు తిరుగుతోంది ? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో హీరోగా నటించిన హీరో రామ్ కార్తీక్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మొదటి భాగంలో సాగే కీలక సన్నివేశాల్లో గాని, హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో గాని, అతని నటన బాగుంది. మొత్తం మీద మంచి భావోద్వేగాలతో ఎమోషనల్ గా నటించే ప్రయత్నం చేసాడు. డాన్స్ మరియు కొన్ని మెయిన్ సీన్స్ లో అతని హార్డ్ వర్క్ తెర పై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరో కీలక పాత్రలో నటించిన జగపతిబాబు బోల్డ్ క్యారెక్టర్ లో ఎప్పటిలాగే బాగా నటించాడు.
కొన్ని బూతు డైలాగ్ లను కూడా జగపతిబాబుతో సహా మిగిలిన పాత్రధారులు చాలా సింపుల్ గా చెప్పేశారు. ఇక హీరోయిన్ గా నటించిన అమ్ము అభిరామి తన నటనతోనూ అలాగే తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. క్లైమాక్స్ లో దర్శకుడు చూపించిన కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
సినిమా పేరులో ఉన్న బూతు సినిమాలో ఎక్కువైపోయింది. యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు పెడుతున్నామనుకొని దర్శకుడు ఓవర్ బోల్డ్ నెస్ తో ముందుకు వెళ్ళాడు. కొన్ని సీన్స్ మినహా ప్లే కూడా బోర్ గానే సాగింది. హీరోయిన్ క్యారెక్టర్ కు పూర్తి అపోజిట్ లో ఉండే హీరో క్యారెక్టర్.. అలాగే వెరీ బోల్డ్ గా సాగే ఫాదర్ క్యారెక్టర్.. ఈ క్యారెక్టర్ల మధ్య వ్యత్యాసం అండ్ కాన్ ఫ్లిట్ చాలు సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకొని సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రస్ట్ పుట్టించడానికి, కానీ దర్శకుడు ఈ పాయింట్ ను బలంగా ఎలివేట్ చేసే సీన్స్ ను రాసుకోకుండా విషయం లేని మరియు ఇంట్రస్ట్ గా సాగని సీన్స్ తో సినిమాని చాల బోర్ గా మలిచాడు.
దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే కనీస ఇంట్రస్ట్ కూడా కలగకుండా చేశారు. ముఖ్యంగా హీరోహీరోయిన్ల నటన బాగున్నా వాళ్ళ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు సినిమాని బలహీనపరిచింది. అలాగే జగపతిబాబు పాత్ర ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాకపోగా చికాకు కలిగిస్తుంది. పైగా ఈ చిత్రంలో తెర మీద పాత్రల్ని నిలబెట్టి అసలు సంఘటనంటూ సన్నివేశమంటూ ఏది లేకుండా.. గూగుల్ లో దొరికే కంటెంట్ అంతా డైలాగ్స్ రూపంలో రాసి విసిగించారు. అలాగే ప్రతి సన్నివేశం రొటీన్ వ్యవహారాలతోనే చాలా ఊహాజనితంగా సాగుతుంటుంది.
సాంకేతిక విభాగం:
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా.. రచయితగా పరిపూర్ణంగా విఫలం అయ్యాడు. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ తో ఏ మాత్రం విషయం లేదు. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. ముఖ్యంగా హీరోయిన్ ఇంటిలో వచ్చే సాంగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘ఎఫ్‌సీయూకే’ అంటూ వచ్చిన ఈ బోల్డ్ అండ్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కొన్ని చోట్ల ఆసక్తికరంగా సాగినా, ఓవరాల్ గా సినిమా ఆకట్టుకోలేదు. ఇలాంటి కథలని డీల్ చేసేప్పుడు కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేయాలి. ఈ సినిమాలో అది మిస్ అయింది. ఇందులో జగపతిబాబు నటన, హీరో హీరోయిన్ల మధ్య సాగే కొన్ని సీన్స్, కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఓకే అనిపించినా బలహీనమైన కథాకథనాలు, కనెక్ట్ కాని ప్లే సినిమా రిజల్ట్ ను దెబ్బ తీశాయి. మొత్తం మీద ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను కొన్ని అంశాల్లో ఆకట్టుకున్నా.. అన్ని వర్గాల ప్రేక్షకులను అయితే ఆకట్టుకోదు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team