సమీక్ష : నిరుత్సాహపరిచిన బుక్ – ఫ్రెండ్స్ బుక్

సమీక్ష : నిరుత్సాహపరిచిన బుక్ – ఫ్రెండ్స్ బుక్

Published on Apr 13, 2012 3:54 PM IST
విడుదల తేది :13 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్:2.5 /5
దర్శకుడు : ఆర్ .పి .పట్నాయక్
నిర్మాత : డా.విజయప్రసాద్ మళ్ళా
సంగీత దర్శకుడు : ఆర్ .పి .పట్నాయక్
తారాగణం : నిశ్చల్, ఉదయ్, సూర్య, సురేష్, అర్చన శర్మ

ఎన్నో హిట్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఆర్.పి పట్నాయక్ దర్శకుడిగా మారి చేసిన రెండవ చిత్రం ‘ఫ్రెండ్స్ బుక్’. నిశ్చల్, ఉదయ్, సూర్య, సురేష్, అర్చన శర్మ, నిషా శెట్టి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై విజయప్రసాద్ మళ్ళా నిర్మించారు. పట్నాయక్ ఈ సినిమా సినిమాకి దర్శకత్వంతో పాటుగా సంగీతం కూడా అందించారు. ప్రేక్షకుల తీర్పును కోరుతూ ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

నిశ్చల్ (నిశ్చల్), అక్షయ్ (ఉదయ్), సూర్య (సూర్య తేజ), రాజా (జెమిని సురేష్), నిత్య (అర్చన శర్మ), మధు (నిషా శెట్టి) ఈ ఆరుగురు చిన్ననాటి స్నేహితులు. తన బాస్ పెట్టె భాధలు భరించలేక చేస్తున్న ఉద్యోగం మానేస్తాడు నిశ్చల్. అమ్మాయిల మీద పెట్టిన శ్రద్ధ పని మీద పెట్టట్లేదంటూ ఉదయ్ ని ఉద్యోగంలో నుండి తీసేస్తారు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగం సంతృప్తి ఇవ్వట్లేదంటూ ఇండియాకి తిరిగి వస్తాడు సూర్య. ఇక మధు విషయానికి వస్తే ఆమె హ్యాకర్. సిగరెట్ తాగితే మొటిమలు తగ్గుతాయని ఎవరో చెబితే సిగరెట్స్ తాగుతూ ఉంటుంది. రాజా బిల్డర్ అయితే, నిత్య క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తుంటుంది. చేస్తున్న పని ఆసక్తి లేని వీరంతా కలిసి సొంతంగా ఒక సాఫ్ట్ వేర్ రూపొందించాలనుకుంటారు.

అందులో భాగంగా ఫేస్ బుక్ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్లో క్రియేట్ అవుతున్న ఫేక్ ఎకౌంటులని అరికట్టే ఒక సరికొత్త సాఫ్ట్ వేర్ రూపొందించి అది ఫేస్ బుక్ వారికి ఇవ్వాలనుకుంటారు. ఈ ఆఫర్ నచ్చిన ఫేస్ బుక్ వారు ఈ సాఫ్ట్ వేర్ తీసుకోవడానికి అంగీకరిస్తారు. అంతా బావుందనుకున్న సమయంలో ఈ సాఫ్ట్ వేర్ లీడ్ చేస్తున్న సూర్య హటాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. సూర్య నిజంగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడా? లేక ఎవరైనా హత్య చేసారా? చివరికి వారు రూపొందించిన సాఫ్ట్ వేర్ ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ బుక్ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సూర్య పాత్రలో నటించిన సూర్య తేజ బాగానే నటించాడు. నిశ్చల్, జెమిని సురేష్ కూడా పర్వాలేదనిపించారు. నిత్య పాత్రలో అర్చన శర్మ మధు పాత్రలో నిషా శెట్టి తమ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పృధ్వి పాత్రలో రావు రమేష్ తన స్టైల్లో మెప్పించాడు. దర్శకుడు ఎంచుకున్న ఇంకా ఈ సినిమాలో ఏం బావుందని చెప్పుకుంటే ఆర్.పి పట్నాయక్ నేపధ్య సంగీతం మాత్రం చాలా బావుంది. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం వరకు బాగా తీసారు. ఆ తరువాత రొటీన్ కామెడీ సన్నివేశాలు నడిచినా ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు ప్రేక్షకుడికి ఆసక్తి కలిగేలా చేయగలిగారు. సూర్యని ఎవరు చంపారు అనే ఆసక్తి ప్రేక్షకుడికి కలిగించడంలో మాత్రం దర్శకుడు సఫలమయ్యాడు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ సరిగా లేదు. ఫేస్ బుక్ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఫేక్ ఎకౌంటులు అరికట్టడానికి ఎంచుకున్న సాఫ్ట్ వేర్ కూడా సిల్లీగా ఉంది. ఎకౌంటు క్రియేట్ చేసుకునేటప్పుడు వాయిస్ రికార్డు చేస్తాం అంటారు. తీరా వీరు చేసిన సాఫ్ట్ వేర్ ఏంటయ్యా అంటే చాట్ చేసేటప్పుడు ఆ రికార్డు చేసిన వాయిస్ తో మాటలు వినపడతాయి అంటారు. ఆ విషయంలో దర్శకుడికే అస్సలు క్లారిటీ లేదు. “ఈ సినిమాలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన సూర్య ఆత్మ రూపంలో వచ్చి తన స్నేహితులతో ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేయడం”. ఇన్ని ఘోరాలు తట్టుకొని చివరి వరకు ఓపిక పట్టిన ప్రేక్షకుడికి దర్శకుడు ఇచ్చే మెసేజ్ ఏంటంటే పేస్ బుక్ లో మంచి స్టేటస్ పెట్టేటపుడు ఆలోచించకపోయినా చెడు చెప్పేటపుడు మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అని. సినిమా సెకండాఫ్ దారుణంగా తర్కానికి దూరంగా సాగింది.

పేస్ బుక్, సాఫ్ట్ వేర్ అంటూ మరో వైపు సూర్య ఆత్మ తన స్నేహితులను కాపాడుకోవడం చూస్తే దర్శకుడు తను ఎంచుకున్న సాఫ్ట్ వేర్ మీద ఉన్న నమ్మకం సరిపోక సూర్య ఆత్మని కూడా నమ్ముకున్నాడు. వీటికి తోడు ఆ నైజీరియా కామెడీ సన్నివేశాలు సహనాన్ని పరీక్షించాయి. ఫేస్ బుక్ సిఎ అయిన శ్రీనాద్ (సురేష్) తెలుగు వాడు అవడం, ఆయన ఇంత సిల్లీ సాఫ్ట్ వేర్ కోసం ఆరాటపడి ఇండియాకి రావడం ఏమిటో దర్శకుడికే తెలియాలి.

సాంకేతిక విభాగం:

ఆర్.పి పట్నాయక్ సంగీతంలో ఒక పాట ఉంది. ఎవరి చేతనో ఎందుకు పాడించడం అని ఆ బాధ్యత కూడా తానే ఎత్తుకున్నాడు. ఆయన పాడిన పాట ఎలా ఉంటుందో నేను చెప్పకర్లేదు, ఈ పాటికి మీకర్ధమయ్యే ఉంటుంది. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం పట్నాయక్ గారిని అభినందించాలి. ఇంకా కథ, కథనం, దర్శకత్వం అన్ని విభాగాల భాద్యతలూ ఆయనే మోసి గందరగోళంలో పడ్డాడు. రెడ్ కెమెరాతో తీసిన సినిమా అందుకు తగ్గట్లుగానే ఉంది. ఇంకా సంభాషణల విషయానికి వస్తే తల్లితండ్రుల కంటే స్నేహితులే మిన్న అని చెప్పే సంభాషణలు బోలెడు ఉన్నాయి. ఎడిటింగ్ లోపాలు కూడా చాలా ఉన్నాయి.

తీర్పు:

ఫ్రెండ్స్ బుక్ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టి మల్టిప్లెక్స్ ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. సరదాగా కాలాక్షేపం కోసం వెళ్ళాలి అనుకుంటే లాజిక్ వెతుక్కుకొండా చూస్తే పర్వాలేదనిపిస్తుంది. ఫేస్ బుక్ గురించి తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ బుక్ సినిమా దాకా వెళ్ళడం అవసరం అంటారా అంటే సరదాగా ఫేస్ బుక్ లోనే గడపండి

123తెలుగు.కాం రేటింగ్ : 2.5/5

Click Here For ‘Friends Book’ English Review

అశోక్ రెడ్డి -ఎం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు