విడుదల తేదీ : అక్టోబర్ 13, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : పి. సునీల్ రెడ్డి
నిర్మాత : యక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్.కుమార్
సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి
నటీనటులు : చేతన్, డింపుల్ హయాతి
‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ’ వంటి కమర్షియల్ సినిమాలతో పాటు ‘సొంత ఊరు, గంగ పుత్రులు’ వంటి సామాజిక పరమైఅన్ సినిమాల్ని కూడా తీసే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ఈసారి గల్ఫ్ వలస బాధితుల కష్టాలను ఆధారంగా చేసుకుని ‘గల్ఫ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పడు చూద్దాం..
కథ :
తెలంగాణకు చెందిన చేనేత కార్మికుడి కుమారుడు శివ (చేతన్) తన స్నేహితుడిలాగే దుబాయ్ వెళ్లి బాగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో వాళ్లకు ఇష్టంలేకపోయినా గల్ఫ్ వెళతాడు. అతనిలాగే పని కోసం గోదావరి జిల్లాకు చెందిన లక్ష్మి (డింపుల్ హయాతి) కూడా గల్ఫ్ చేరుకుంటుంది. అలా ప్రయాణంలో పరిచయమైన వారిద్దరూ త్వరలోనే ప్రేమికులైపోతారు.
కానీ శివ, లక్ష్మిలు ఊహించుకున్నట్టు ఉండవు దుబాయ్ లోని పరిస్థితులు. ఎన్నో కష్టాలను పడతారు, శ్రమ దోపిడీకి గురవుతారు. అలా తనతో పాటే లక్షల మంది ఉన్నారని తెలుసుకున్న శివ అక్కడ బానిసలుగా బ్రతికే బదులు సొంత ఊరికి పోయి కష్టాల్లో బ్రతకడమే మేలని భావించి స్నేహితులు, లక్ష్మితో కలిసి దుబాయ్ నుండి బయటపడాలని అనుకుంటాడు. ఆలా బయటపడేందుకు శివ ఏం చేశాడు, చివరికి వాళ్లంతా బయటకు రాగలిగారు లేదా, అసలు గల్ఫ్ కష్టాలు, ఆ కష్టాలను అనుభవిస్తున్న భారతీయుల బ్రతుకులు ఎలా ఉంటాయి అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో ప్రధానంగా ఆకర్షించే అంశం దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఎంచుకున్న గల్ఫ్ వలస బాధితుల కష్టలు అనే అంశం. ఇందులో ఆయన గల్ఫ్ కలలు ఎలా ఉంటాయి, అక్కడికి వెళుతున్న భారతీయులు అవగాహన లోపం వలన దళారులు, ఇక్కడి బ్రోకర్లు, అరబ్బుల చేతుల్లో ఎలాంటి హింసలు, ముఖ్యంగా ఇంటి పని కోసం వెళ్లే ఆడవాళ్లు పడే నరకయాతన ఎలా ఉంటుంది అనే అంశాలను చాలా విశదంగా చూపించారు. అలాగే అక్కడ మనవాళ్లే మనవాళ్లను ఎలా మోసం చేస్తున్నారు అనేది కూడా వివరించారు. చిత్రాన్ని గల్ఫ్ లోని వర్కర్స్ క్యాంప్, అరబ్ షేకుల ఇళ్ళు, ఎడారి ప్రాంతం వంటి సహజ లొకేషన్లలో తీయడం వలన రియలిస్టిక్ గా అనిపించింది.
ఇక ఒక్కో రకమైన కష్టాన్ని వివరించడానికి దర్శకుడు చేసిన కొన్ని సీన్లు ముఖ్యంగా మూడేళ్ళ తర్వాత భార్యకు దగ్గరైన భర్తలో ఎలాంటి ఆవేశం, ఆశలు ఉంటాయి, చెల్లెలి పెళ్లి కోసం ఒక అన్నపడే భాధ వంటి సన్నివేశాలు కదిలించాయి. అలాగే కూలి కోసం అక్కడకు వెళ్లిన ఇండియన్స్ విదేశీ మారకద్రవ్యం రూపాన మన దేశానికి ఎంతో లాభాన్ని ఇస్తున్నా వారి బాగు కోసం ఇక్కడి ప్రభుత్వాలు ఏమీ చేయకపోవడాన్ని ప్రశ్నించడం కూడా బాగుంది. సినిమా మొదటి భాగం మొత్తం ఈ తరహా అంశాలతోనే నడుస్తూ ఆకట్టుకుంది. హీరోయిన్ డింపుల్ హయాతి, హీరో స్నేహితులుగా నటించిన సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్ ల నటన ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాకి మైనస్ అంటే సెకండాఫ్ అనొచ్చు. అప్పటి వరకు గల్ఫ్ కలలు, కష్టాలు వంటి అంశాలతో హృద్యంగా సాగిపోయిన సినిమా హీరో తిరగబడటంతో ఇంకాస్త ఊపందుకుంటుంది అనుకోగా అలా జరగకుండా చప్పబడిపోయింది. హీరో హీరోయిన్, అతని స్నేహితులు పారిపోవడం, అరబ్ కు కనబడకుండా తలదాచుకోవడం వంటి అంశాలను ఇంకాస్త బాగా హ్యాండిల్ చేసుండాల్సింది. అలాగే చూపించిన కష్టాల్నే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ నడిపించడంతో సినిమా కాస్త చప్పబడినట్లు తోచింది.
అలాగే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ జన్యూన్ గానే ఉన్నా రొమాన్స్ పాళ్ళు తగ్గడంతో కొద్దిగా భారంగా అనిపించింది. ఇక సినిమా ముగింపు మంచి రీజనింగ్ ఉన్నదే అయినా అప్పటి వరకు అంతా సవ్యంగా జరుగుతుంది అన్నట్టు చూపించి చివర్లో శాడ్ ఎండింగ్ ఇవ్వడం కొంత నిరుత్సాహానికి గురిచేసింది. అంతేగాక కొన్ని సన్నివేశాల మధ్య కంటిన్యుషన్ కూడా మిస్సవడంతో కొంత ఇబ్బంది కలిగింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏ దర్శకులూ చేయని రీతిలో గల్ఫ్ వలస కష్టాలు అనే సామాజిక అంశాన్ని ఎంచుకుని దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలచి అందులో చెప్పవలసిన అన్ని అంశాల్ని చాలా వరకు ప్రస్తావించి మంచి ప్రయత్నం చేశారని అనిపించుకున్నారు. అయితే సెకండాఫ్లో ఆయన ఇంకాస్త జాగ్రత్త వహించి ఉండాల్సింది.
ప్రవీణ్ ఇమ్మడి సంగీతం పర్వాలేదనిపించింది. ఎస్వి శివరాం కెమెరా పనితనం ఓకే అనిపించింది. సినిమా కొన్ని చోట్ల చల్ సహజంగా అనిపించింది. శామ్యూల్ కళ్యాణ్ ఎడిటింగ్ బాగానే ఉంది. పులగం చిన్నారాయణ డైలాగ్స్ కొన్ని ఆకట్టుకున్నాయి. యక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్.కుమార్ నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి.
తీర్పు:
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చేసిన ‘గల్ఫ్’ అనే ఈ ప్రయత్నం సామాజికంగా చాలా సమర్థనీయమైంది. కుటుంబాల కోసం ఏళ్ల తరబడి గల్ప్ లో ఉంటూ కష్టాలు పడుతున్న ఎంతో మంది మగ, ఆడ కూలీల జీవితాల్ని ఈ సినిమాతో ఆవిష్కరించారాయన. అయితే సెకండాఫ్ కథనం, లవ్ ట్రాక్ ల మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అందులో తీవ్రత లోపించడం, ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్సును అంతగా ఆకట్టుకోకపోయినా గల్ఫ్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team