విడుదల తేదీ : 14 జనవరి 2015 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5 | ||
దర్శకత్వం : శంకర్ | ||
నిర్మాత : ఆస్కార్ రవిచంద్రన్ | ||
సంగీతం : ఎఆర్ రెహమాన్ | ||
నటీనటులు : విక్రమ్, అమీ జాక్సన్… |
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ‘ఐ’. కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల చేత మెప్పు పొందిన చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీలో అమీ జాకాసన్ హీరోయిన్ గా నటించింది. శంకర్ మొదటిసారి ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కి సైన్స్ అండ్ టెక్నాలజీని జోడించి తీసిన ఈ విజువల్ ట్రీట్ సినిమాలో విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. గతంలో విక్రమ్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అపరిచితుడు’ తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో.. ఇప్పుడు చూద్దాం..
కథ :
సనత్ నగర్ లో ఓ జిమ్ పెట్టుకొని ఎప్పటికైనా మిస్టర్ ఇండియన్ బాడీ బిల్డర్ అనే టైటిల్ ని గెలుచుకోవాలనే కోరికతో లైఫ్ ని సాగించే కుర్రాడు లింగేశ్వర్(విక్రమ్). అందుకోసమే ముందుగా మిస్టర్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ గా ఎన్నికవుతాడు. లింగేశ్వర్ కి ఉన్న ఒకే ఒక్క వీక్ నెస్ ఇండియా టాప్ మోడల్ అయిన దియా(అమీ జాక్సన్) ని ఆరాధించడం. అనుకోకుండా ఓ సారి దియాతో పరిచయం అవుతుంది. ఇప్పుడు దియా విషయానికి వస్తే దియా ఇండియన్ టాప్ మోడల్ కానీ తన పార్టనర్ అయిన జాన్(ఉపేన్ పటేల్) తనని పలు రకాలుగా వేధిస్తుంటాడు. అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అనే ఉద్దేశంలో డా. వాసుదేవర(సురేష్ గోపి) సాయంతో మంచి ఫిజిక్, లుక్ ఉన్న లింగేశ్వర్ ని మోడలింగ్ లోకి దింపుతుంది. ఈ జర్నీలో వీళ్ళిద్దరూ మోడల్స్ గా మంచి ఫేమస్ అవ్వడమే కాకుండా ప్రేమలో కూడా పడతారు.
అలా వీరి ప్రేమ పెళ్ళికి దారితీస్తుంది. అదే టైంలో లింగేశ్వర్ కి ఓ వినూత్నమైన జబ్బు వస్తుంది. దాని వల్ల అతను రోజు రోజుకీ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతూ అందవిహీనంగా ఓ అష్టావకుడిగా మారిపోతాడు. ఆ సమయంలోనే అతను అలా మారడానికి జబ్బు కాదని వేరే కారణం ఉందని తెలుసుకున్న లింగేశ్వర్ ఏం చేసాడు.? అష్టావకుడిలా మారిపోయిన లింగేశ్వర్ మాలీ దియా ప్రేమ కోసం ట్రై చేసాడా.? అసలు లింగేశ్వర్ ని కురూపిలా మార్చడానికి గల కారణం ఏమిటి.? అతన్ని అలా చేయడం వెనుక ఎవరెవరి హస్తం ఉందనేది.? మీరు శంకర్ ‘ఐ’ చూసి తెలుసుకోవాల్సిందే.?
ప్లస్ పాయింట్స్ :
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో చెప్పే మాట ‘ఐ’ సినిమా విజువల్స్, లోకేషన్స్, మేకప్ టెక్నాలజీ అత్యద్బుతంగా ఉన్నాయి. ఎప్పుడూ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే హాలీవుడ్ సినిమాలే అని చెప్పుకునే వారికి మన ఇండియన్ సినిమాలు హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోవు అనే రేంజ్ లో విజువల్స్ చూపించిన శంకర్ కి సెల్యూట్ చేస్తున్నాం..
విక్రమ్ ఈ సినిమాలో మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. నటన అనేది రోజు రోజుకీ విలువ పడిపోతున్న ఈ టైంలో కథను నమ్మి ఆ సినిమా కోసం తన బాడీని పలు విధాలుగా మార్చుకోవడానికి ఎంతో రిస్క్ చేసిన విక్రమ్ డెడికేషన్ కి శిరస్సు వంచి హ్యాట్సాఫ్ చెప్పాలి. ముందుగా ఆడియన్స్ ని ఎక్కువ టెంప్ట్ చేసిన బీస్ట్(తోడేలు) పాత్ర విషయానికి వస్తే – ఈ గెటప్ ఉన్నది కేవలం ఒక్క పాటలోనే కావడం ఆడియన్స్ ని నిరాశ పడేలా చేస్తుంది. అయినా ఆ పాట ఉన్నంత సేపూ ఆడియన్స్ అందరూ సీటు చివర్లో కూర్చొని చూస్తారు. అంతలా ఆ బీస్ట్ పాత్రలో ఆడియన్స్ ని మెప్పించాడు. ఇకపోతే మొదట్లో వచ్చే బాడీ బిల్డర్ పాత్రలో భారీ దేహాన్ని చూపించడమే కాకుండా ఒక మాస్ ఏరియా కుర్రాడిగా విక్రమ్ పెర్ఫార్మన్స్ బాగుంది. ఈ పాత్ర బి, సి సెంటర్స్ వారికి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక మోడల్ గా విక్రమ్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ యువత హృదయాల్ని కొల్లగొడతాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే విక్రమ్ పూర్తిగా తగ్గిపోయి చేసిన పాత్ర అష్టావకుడు(కురూపి).. ఆ కురూపి పాత్రలో కూడా విక్రమ్ చూపించిన హావ భావాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. ఫైనల్ గా డైరెక్టర్ అనుకున్న పాత్రకి విక్రమ్ తప్ప మరెవరూ సెట్ అవ్వరు, అలాగే ఈ మూడు పాత్రలను విక్రమ్ తప్ప మరెవరూ చేయలేరు.
ఇదొక లవ్ స్టొరీ కావున హీరోయిన్ అమీ జాక్సన్ కి కూడా కథాపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. అమీ జాక్సన్ సినిమాలో ఓ టాప్ ఇండియన్ మోడల్ కావడం వలన సినిమా మొత్తం అల్ట్రా గ్లామరస్ గా కనిపిస్తూ విచ్చల విడిగా అందాల విందు చేసింది. అలాగే ప్రతి ఫ్రేం లోనూ అమీ జాక్సన్ ని మోడ్రన్ గా, స్టైలిష్ గా చూపించారు. అవసరమైన చోట్ల హావభావాలను కూడా బాగానే పలికించింది. ఇక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు ఉపేన్ పటేల్. మోడల్ గా స్టైలిష్ గా అనిపించే ఉపేన్ నెగటివ్ షేడ్స్ ని బాగానే పలికించాడు. ఇకపోతే సంతానం సినిమాలో అక్కడక్కడా చెప్పే పంచ్ డైలాగ్స్ బాగానే నవ్విస్తాయి. సురేష్ గోపి పెర్ఫార్మన్స్ ఓ పెద్ద మనిషి తహాలో చాలా సింపుల్ గా, సెటిల్ గా ఉంటుంది.
సినిమా పరంగా ఓవరాల్ గా వచ్చే కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయి. మాస్క్ ఫైట్, ట్రైన్ ఫైట్ మరియు రివెంట్ తీర్చుకోవడంలో విక్రమ్ ఫాలో అయ్యే టెక్నిక్స్ బాగా ఆసక్తిగా ఉంటాయి. ఓవరాల్ గా విజువల్ ఎఫెక్ట్స్, సరికొత్త లోకేషన్స్, మేకప్ స్టాండర్డ్స్ మాత్రం ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని పెంచడమే కాకుండా చూసే ఆడియన్స్ కి సరికొత్త లోకాలకి తీసుకెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రతి పాటలోనూ చూపించిన వండర్ఫుల్ లొకేషన్ విజువల్స్ ఆడియన్స్ ని కళ్ళు తిప్పుకోనీకుండా చేస్తాయి.
మైనస్ పాయింట్స్ :
ఒక సినిమాపై భారీ అంచనాలున్నప్పుడు ఆ సినిమా ఆడియన్స్ అంచనాలు అందుకునేలా ఉంటేనే హిట్ అవుతుంది, ఆ అంచనాలను అందుకోవడంలో ఏ మాత్రం మిస్ అయినా ఆడియన్స్ ఆ సినిమాని పెద్దగా ఆదరించరు. అదే విషయం ఈ సినిమాలో కూడా జరిగింది. క్రియేట్ చేసిన అంచనాలను అందుకోలేకపోవడం ఈ సినిమా మొదటి మైనస్ పాయింట్.. ఇక సినిమా పరంగా వస్తే… ‘ఐ’ సినిమా విజువల్స్ పరంగా ఎంత గ్రాండ్ గా ఉన్నా చెప్పే కథలో దమ్ములేకపోతే అస్సలు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. అసలు శంకర్ సినిమా కథేనా ఇది అనే భావన ఆడియన్స్ కి కలుగుతుంది. దానికి తోడూ కథనం కూడా బాలేక పోవడం మరియు లెంగ్త్ ఎక్కువ అవ్వడం వలన ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ఈ సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాలు అవ్వడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.
చెప్పాలంటే శంకర్ చెప్పాలనుకున్న కాన్సెప్ట్ కి ఇంత లెంగ్త్ అవసరం లేదు. సింపుల్ గా 2 గంటలు లేదా ఇంకో 10 నిమిషాలు కలిపి తీస్తే సరిపోద్ది. శంకర్ తన ఫార్మాట్ ని వదిలి ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి గెటప్స్ ని జత చేసి తీసాడు. ఇక పోతే ఫస్ట్ హాఫ్ లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని చెప్పేయడం వలన సెకండాఫ్ చాలా వరకూ ఊహాజంతంగా తయారవుతుంది. సెకండాఫ్ లో వచ్చే ఒకటి రెండు థ్రిల్స్ తప్పితే మిగతా అంతా ఫస్ట్ హాఫ్ లానే సాగదీసినట్టు ఉంటుంది. అలాగే మొదటిసారి శంకర్ తన సినిమాలో పెట్టిన గే కామెడీ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.
ఇకపోతే చెప్పుకోవాల్సింది ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ బీస్ట్ పాత్ర సినిమాలో చాలా సేపు ఉంటుందని, ఆ పాత్రతో శంకర్ రచ్చరచ్చ చేసి ఉంటాడని అందరూ ఆశిస్తారు. కానీ ఈ పాత్ర ఒక్క పాటలో మాత్రం కనిపించి మాయమయిపోతుంది. దాంతో ఈ పాత్ర ఉండేది ఇంతేనా అని ప్రేక్షకులు పెదవి విరుస్తారు. సెకండాఫ్ ని చాలా ట్రిమ్ చేసి కథనంని ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకొని ఉంటే బాగుండేది. అలాగే పాటలు చూడటానికి బాగున్నా వినడానికి మాత్రం చాలా చెత్తగా అనిపిస్తాయి. మొదటి సారి శంకర్ సినిమాలో లాజికల్ గా చాలా తప్పులు కనిపిస్తాయి.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ టీం.. అన్ని సినిమాల టెక్నికల్ టీమ్స్ అన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా కోసం పని చేసిన టెక్నికల్ టీం ఒక ఎత్తని చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ కథ అనుకున్నప్పుడు ఎన్ని అయినా ఊహించుకోవచ్చు. కానీ వాటిని తెరపైకి తీసుకువచ్చే విధానంలో సరైన టెక్నికల్ టీం లేకపోతే ఆ దర్శకుడి శ్రమ వృధా అయిపోతుంది. కానీ శంకర్ కథ అనుకున్నప్పుడు కొన్ని సీన్స్ ని అనుకున్నాడు, వాటిని అత్యంత అద్భుతంగా తెరపైకి తీసుకు వచ్చిన ఘనత లెజెండ్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరాంకే చెందింది. చైనాలోని బ్యూటిఫుల్ లోకేషన్స్ ని, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించిన షాట్స్ సింప్లీ సూపర్బ్. పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీకి వి. శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్, మేకప్ స్టాండర్డ్స్ మరింత గ్రాండ్ నెస్ ని పెంచాయి. మేకప్ స్టాండర్డ్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇండియన్ ఫిల్మ్ రేంజ్ ని పెంచే స్థాయిలో ఉన్నాయి. అనల్ అరసు, పీటర్ మింగ్ కలిసి కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటాయి. ఇక అంథోని ఎడిటింగ్ సినిమాకి పెద్ద మైనస్. సీన్స్ పరంగా బాగానే ఎడిట్ చేసినా ఓవరాల్ చిఎన్మా చూసేటప్పుడైనా ఆలోచించి సినిమా రన్ టైం తగ్గించి ఉంటే బాగుండేది.
ఇక స్పెషల్ గా చెప్పుకోవాల్సింది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ గురించి.. ఎఆర్ రెహమాన్ పాటలకు మంచి ట్యూన్స్ ఇచ్చాడు, కానీ ఆ పాటలకి లిరిక్స్ సెట్ అవ్వకపోవడంతో ఆడియో ఫెయిల్ అయ్యింది. కానీ విజువల్ గా బాగున్నాయి. ఇకపోతే రెహమాన్ థ్రిల్లర్, యాక్షన్ సన్నివేశాల్లో అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీ రోమాలు నిక్క బోడుచుకునేలా చేస్తోంది. సినిమాకి ప్రధాన బలం అయిన కథ – కథనం – దర్శకత్వం విభాగాలకు వస్తే.. ఈ 3 డిపార్ట్ మెంట్స్ కి హెడ్ మరియు కెప్టెన్ అఫ్ ది షిప్ శంకర్ డీల్ చేసాడు. ఒక రెగ్యులర్ అండ్ పాతకాలం నుంచి వస్తున్న లవ్ స్టొరీని తీసుకొని దానికి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, గ్రాండ్ విజువల్స్ జతచేసి కథని రాసుకున్నాడు. కావున ఎప్పటిలా శంకర్ కథలో ఉండే కొత్తదనం ఇందులో ఉండదు. ఇక కథనం – కథనంలో శంకర్ కి సురేష్ – బాలకృష్ణన్ ల సాయం తీసుకున్నప్పటికీ సరైన కథనం సెట్ కాలేదు. ఓవరాల్ గా బోరింగ్ అండ్ ఊహాజనితంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇక దర్శకుడిగా శంకర్ ఎప్పుడూ టాప్ పొజిషన్ లో ఉంటాడు. ఈ సినిమా పరంగా ఓ దర్శకుడిగా శంకర్ టాప్ పొజిషన్ లో ఉంటాడు కానీ ఆడియన్స్ ని మెప్పించడంలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాణ విలువలు ఎంతో రిచ్ గా ఉన్నాయి. డైరెక్టర్ అనుకున్నది తెరపై ప్రెజెంట్ చేయడం కోసం ఆయన పెట్టిన రూపాయి తెరపై గ్రాండ్ గా కనిపించింది.
తీర్పు :
రెండు సంవత్సరాలు సినీ ప్రేమికులను ఊరించి ఊరించి 2015 సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ‘ఐ’ సినిమా విజువల్స్ పరంగా సూపర్బ్ అనిపించుకున్నా, ఆడియన్స్ అంచనాలను మాత్రం పెద్దగా అందుకోలేకపోయింది. రెగ్యులర్ గా ప్రతి సినిమాలోనూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకొని ఎంతో కమర్షియల్ గా చెప్పడానికి ట్రై చేసే శంకర్ మొదటి సారి కథ విషయంలోనే కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత కథనం లో కూడా ఫెయిల్ అయ్యారు. సాంగ్స్ మీద పెట్టిన శ్రద్ధ ఆయన కథ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. మూడు డిఫరెంట్ లుక్స్ లో అదిరిపోయే విక్రమ్ పెర్ఫార్మన్స్, సూపర్బ్ అనిపించే విజువల్స్, మేకప్ స్టాండర్డ్స్, అమీ జాక్సన్ అందాలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే భారీ అంచనాలను అందుకునే స్థాయిలో లేని కథ, కథనం, బోరింగ్ ఎలిమెంట్స్, రన్ టైం చెప్పదగిన మైనస్ పాయింట్. ఈ సంక్రాంతి సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా ఓ రెగ్యులర్ ఓ కమర్షియల్ మూవీ చూడాలనుకునే వారు ఈ సినిమాని ఓ సారి ట్రై చెయ్యచ్చు.
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం