సమీక్ష : ఇద్దరి మధ్య 18 – కొత్తదనమంటూ ఏం లేదు

సమీక్ష : ఇద్దరి మధ్య 18 – కొత్తదనమంటూ ఏం లేదు

Published on Apr 21, 2017 5:53 PM IST
Iddari Madhya 18 movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : నాని ఆచార్య

నిర్మాత : శివరాజ్ పాటిల్

సంగీతం : గంటాడి కృష్ణ

నటీనటులు : రామ్ కార్తీక్, భాను త్రిపాఠి

చిన్న సినిమాల ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన మరొక చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. రామ్ కార్తీక్, భాను త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ:

ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన మహి (రామ్ కార్తీక్), హిమ (భాను త్రిపాఠి) అరకు వ్యాలీలో జరిగే ఒక ఇండస్ట్రియల్ టూర్లో కలుసుకుంటారు. అక్కడే ఒకరికొకరు బాగా దగ్గరై ఒకే ప్రాజెక్ట్ ను తీసుకుంటారు. అదే జాతీయ భద్రతా అంశాలతో ముడిపడి ఉన్న మిషన్ 18. ఆ మిషన్ ప్రత్యేకత ఏమిటి ? దాన్ని మహి, హిమ లు విజయవంతంగా పూర్తి చేశారా ? ఆ ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు నాని ఆచార్య సినిమా ద్వారా ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం, దేశం పట్ల అతనికున్న భాద్యత మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయి. హీరో రామ్ కార్తీక్ తన నటనతో పర్వాలేదనిపించినా హీరోయిన్ పాత్రలో భాను త్రిపాఠి మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చింది.

హీరోయిన్ పాత్రకు చెప్పిన డబ్బింగ్ చాలా బాగుంది. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. యాంకర్ బిత్తిరి సత్తి తన తెలంగాణ యాసతో, నాటాతో అక్కడక్కడా మెప్పించాడు. సినిమాలోని మొదటి పాటను అరకు లొకేషన్లలో చాల బాగా చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్. అందులో ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడంతో చప్పగా సాగింది. సినిమాలోని చాలా సన్నివేశాలను సరైన ముగింపు ఇవ్వకుండానే వదిలేశారు. అది సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కాస్త ఎక్కువ చిరాగుగానే అనిపిస్తుంది.

సినిమాలో హీరో హీరోయిన్ల బ్యాగులు మారిపోవడం, గమనించే వీలుండి కూడా హీరో దాన్ని అస్సలు గమనించలేకపోవడం వంటి లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. డైలాగ్స్ పరంగా దర్శకుడు ఏదో ఒక కొత్త స్టైల్ ను ట్రై చేశాడు గాని ఒక లిమిట్ తర్వాత అది కూడా బోర్ అనిపించింది.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పినట్టు కథ బాగున్నా కూడా దర్శకుడు దాన్ని మంచి మంచి కథనంతో, బ్యాక్ డ్రాప్ తో ఆసక్తికరంగా రూపొందించడంలో విఫలమయ్యాడు. జి. ఎల్ బాలు సినిమాటోగ్రఫి బాగుంది. అరకు లోయలోని సహజ అందాలను చాలా బాగా చూపించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చెప్పుకోదగగ స్థాయిలో లేదు. గంటాడి కృష్ణ సంగీతం పర్వాలేదనిపించింది. నాలుగింటిలో రెండు పాటలు బాగున్నాయి. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఈ ‘ఇద్దరి మధ్య 18’ అనే చిత్రంలో మంచి సోషల్ మెసేజ్ ఉన్నా దర్శకుడు నాని ఆచార్య ఏమాత్రం ఆకట్టుకొని కథనం, సందర్భానుసారం లేని సన్నివేశాలతో నిరుత్సాహపరిచాడు. బిత్తిరి సత్తి నుండి భీభత్సమైన కామెడీని ఆశించేవారికి కూడా గట్టి నిరుత్సాహమే ఎదురైంది. వీటితో పాటే లాజిక్ లేని సన్నివేశాలు, కొత్తదనం లేకుండా కథను వివరించిన తీరు సినిమాను అనాసక్తిగా తయారుచేశాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ సినిమాలో కొత్తదనమంటూ ఏం దొరకదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు